బ్రౌన్ గ్రంథాలయానికి పూర్తి సహకారం
కడప కల్చరల్ :
బ్రౌన్ గ్రంథాలయం గురించి సాహితీ, విశ్వ విద్యాలయాల ప్రముఖుల ద్వారా తెలుసుకునే వచ్చానని, నిజానికి తాను విన్నదాని కంటే మరెన్నో రెట్లు ఉన్నత స్థానంలో ఈ గ్రంథాలయం ఉండడం తనకెంతో ఆశ్చర్యంగా ఉందని, దీని అభివృద్ధికి వైవీయూ సంపూర్ణ సహకారం అందిస్తుందని వైస్ ఛాన్సలర్ అత్తిపల్లి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నెలనెల మన జిల్లా సాహిత్యం కార్యక్రమం 60వ మాసం ప్రత్యేక కార్యక్రమంగా మంగళవారం బ్రౌన్ గ్రంథాలయంలో విశేష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ గ్రంథాలయాన్ని విజ్ఞాన నిధిలా భావిస్తున్నానని, దీన్ని కేంద్రంగా 60 వరుస కార్యక్రమాలను నిర్వహించడం వైవీయూకు గర్వకారణమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, అందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కేంద్రం ఆధారంగా భాషా, సాహిత్యాలపైన కొత్త కోణాలలో పరిశోధనలు చేయించాలని సూచించారు.
బ్రౌన్‌కి మించి దేనికీ అర్హత లేదు
సభాధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నెలనెల...మన జిల్లా సాహిత్యం కార్యక్రమం రూపుదిద్దుకున్న నేపధ్యాన్ని వివరించారు. జిల్లా సాహితీ చరిత్రలో ఇదో మరుపురాని సన్నివేశమని, ఇంత విజయం సాధిస్తుందని తామెవరూ ఊహించలేదన్నారు. రచన, అధ్యయనం, ప్రచాచాలకు బ్రౌన్ గ్రంథాలయం కేంద్రంగా నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాహిత్య ప్రచారం మరింతగా జరగాలని ఆశిస్తున్నామన్నారు.
మైసూరులోని ప్రాచీన భాష అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బ్రౌన్ గ్రంథాలయం మినహా మరే దేనికీ అర్హత లేదని వైవీయూ ఆ కేంద్రాన్ని ఈ గ్రంథాలయానికి తెచ్చేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఈ మేరకు సాహితీవేత్తలంతా ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేయాలని సూచించారు.
ప్రత్యేక అతిథి అలపర్తి పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వైవీయూ ఆధ్వర్యంలో బ్రౌన్ గ్రంథాలయం సాధించిన ఈ అరుదైన రికార్డు సాహిత్యాభిమానులందరికీ సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వైవీయూ రిజిస్ట్రార్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బ్రౌన్ గ్రంథాలయానికి, వైవీయూకుగల బంధాన్ని వివరించారు.
డీఎస్పీ లోసారి సుధాకర్ మాట్లాడుతూ ఈ గ్రంథాలయం ద్వారా నేటి యువతలో సాహితీ స్పహ కల్పించేందుకు మరింతగా కృషి చేయాలన్నారు. నైతిక విలువల రక్షణకు సాహిత్యం మినహా మరో మార్గం లేదని పేర్కొన్నారు. డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి కార్యక్రమాల నేప«థ్యాన్ని ‘నెల నెల’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన వారందరినీ అభినందించారు. ఈ సభను నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రముఖ కవి, విమర్శకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గజ్జెల మల్లారెడ్డి జీవితం–సాహిత్యం అంశంపై ప్రసంగించారు. మల్లారెడ్డి అధిక్షేప సాహిత్యం ఎంతో పదునైనది..విభిన్నమైనదని తెలిపారు. ముఖ్యంగా తనదైన వ్యంగంతో సమకాలిన సమస్యలపై కత్తి ఝళిపించారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా నెలనెల కార్యక్రమం’ రూపకర్త రాచపాలెంను బి.కోడూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, జానమద్ది సాహితీపీఠం అధ్యక్షులు జానమద్ది విజయభాస్కర్ తదితరులు ఘనంగా సత్కరించారు. నిర్వాహకలు కార్యక్రమానికి సహకరించిన వారందరినీ కూడా సత్కరించారు. సహాయ పరిశోధకులు భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, శివారెడ్డి, బ్రౌన్ గ్రంథాలయ అధికారి హరి, చిట్టి, పలువురు సాహితీ ప్రియులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ర్యాలీ
ఈ సందర్బంగా సభకు ముందుగా స్థానిక కోటిరెడ్డి సర్కిల్‌లో గల స్టేట్ గెస్ట్‌హౌస్‌నుంచి వైవీయూ విద్యార్థులు, జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు మేళ తాళాల మధ్య సాహిత్య ర్యాలీ నిర్వహించారు. ఎర్రముక్కపల్లె బ్రౌన్ సెంటర్‌లోగల బ్రౌన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ బ్రౌన్ గ్రంథాలయానికి చేరుకుంది.