cp brown library
-
వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డ్: సి.పి. బ్రౌన్ లైబ్రరీ
-
నా ఎదుగుదలలో గజ్జల మల్లారెడ్డిదే కీలక పాత్ర: సజ్జల
సాక్షి,కడప కల్చరల్ : యూనివర్సిటీలు ప్రజల పక్షాన నిలబడే బాధ్యతాయుతమైన పాత్రికేయులను తయారుచేసేలా జర్నలిజం కోర్సులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కడపలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రముఖ కవి గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మల్లారెడ్డి కవిత్వంలో వాడి, వేడి, నాడి, పదును ఉండడంవల్లే ఆయనకు విశిష్టస్థానం లభించిందన్నారు. ఆయన పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు అందుకుంటున్న వారిలో ఆయన స్ఫూర్తితో పాత్రికేయ రంగంలో విశిష్ట స్థానం అందుకున్న వారే ఉండడం అభినందనీయమన్నారు. నేడు ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సంకుచిత భావాలతో పత్రికలు నడుస్తున్నాయన్నారు. ఇలాంటి పత్రికలు ప్రజా›శ్రేయస్సే పరమావధిగా నడిస్తే మంచి మనుగడ ఉండగలదని చెప్పారు. అనంతరం.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి, విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్వీ రామారావుకు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య దుర్బాక విజయరాఘవ ప్రసాద్, నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కుల సచివులు డాక్టర్ ఎల్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్రౌన్ గ్రంథాలయానికి పూర్తి సహకారం
కడప కల్చరల్ : బ్రౌన్ గ్రంథాలయం గురించి సాహితీ, విశ్వ విద్యాలయాల ప్రముఖుల ద్వారా తెలుసుకునే వచ్చానని, నిజానికి తాను విన్నదాని కంటే మరెన్నో రెట్లు ఉన్నత స్థానంలో ఈ గ్రంథాలయం ఉండడం తనకెంతో ఆశ్చర్యంగా ఉందని, దీని అభివృద్ధికి వైవీయూ సంపూర్ణ సహకారం అందిస్తుందని వైస్ ఛాన్సలర్ అత్తిపల్లి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నెలనెల మన జిల్లా సాహిత్యం కార్యక్రమం 60వ మాసం ప్రత్యేక కార్యక్రమంగా మంగళవారం బ్రౌన్ గ్రంథాలయంలో విశేష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ గ్రంథాలయాన్ని విజ్ఞాన నిధిలా భావిస్తున్నానని, దీన్ని కేంద్రంగా 60 వరుస కార్యక్రమాలను నిర్వహించడం వైవీయూకు గర్వకారణమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, అందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కేంద్రం ఆధారంగా భాషా, సాహిత్యాలపైన కొత్త కోణాలలో పరిశోధనలు చేయించాలని సూచించారు. బ్రౌన్కి మించి దేనికీ అర్హత లేదు సభాధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నెలనెల...మన జిల్లా సాహిత్యం కార్యక్రమం రూపుదిద్దుకున్న నేపధ్యాన్ని వివరించారు. జిల్లా సాహితీ చరిత్రలో ఇదో మరుపురాని సన్నివేశమని, ఇంత విజయం సాధిస్తుందని తామెవరూ ఊహించలేదన్నారు. రచన, అధ్యయనం, ప్రచాచాలకు బ్రౌన్ గ్రంథాలయం కేంద్రంగా నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాహిత్య ప్రచారం మరింతగా జరగాలని ఆశిస్తున్నామన్నారు. మైసూరులోని ప్రాచీన భాష అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బ్రౌన్ గ్రంథాలయం మినహా మరే దేనికీ అర్హత లేదని వైవీయూ ఆ కేంద్రాన్ని ఈ గ్రంథాలయానికి తెచ్చేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఈ మేరకు సాహితీవేత్తలంతా ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేయాలని సూచించారు. ప్రత్యేక అతిథి అలపర్తి పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వైవీయూ ఆధ్వర్యంలో బ్రౌన్ గ్రంథాలయం సాధించిన ఈ అరుదైన రికార్డు సాహిత్యాభిమానులందరికీ సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వైవీయూ రిజిస్ట్రార్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బ్రౌన్ గ్రంథాలయానికి, వైవీయూకుగల బంధాన్ని వివరించారు. డీఎస్పీ లోసారి సుధాకర్ మాట్లాడుతూ ఈ గ్రంథాలయం ద్వారా నేటి యువతలో సాహితీ స్పహ కల్పించేందుకు మరింతగా కృషి చేయాలన్నారు. నైతిక విలువల రక్షణకు సాహిత్యం మినహా మరో మార్గం లేదని పేర్కొన్నారు. డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి కార్యక్రమాల నేప«థ్యాన్ని ‘నెల నెల’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన వారందరినీ అభినందించారు. ఈ సభను నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రముఖ కవి, విమర్శకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గజ్జెల మల్లారెడ్డి జీవితం–సాహిత్యం అంశంపై ప్రసంగించారు. మల్లారెడ్డి అధిక్షేప సాహిత్యం ఎంతో పదునైనది..విభిన్నమైనదని తెలిపారు. ముఖ్యంగా తనదైన వ్యంగంతో సమకాలిన సమస్యలపై కత్తి ఝళిపించారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా నెలనెల కార్యక్రమం’ రూపకర్త రాచపాలెంను బి.కోడూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, జానమద్ది సాహితీపీఠం అధ్యక్షులు జానమద్ది విజయభాస్కర్ తదితరులు ఘనంగా సత్కరించారు. నిర్వాహకలు కార్యక్రమానికి సహకరించిన వారందరినీ కూడా సత్కరించారు. సహాయ పరిశోధకులు భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, శివారెడ్డి, బ్రౌన్ గ్రంథాలయ అధికారి హరి, చిట్టి, పలువురు సాహితీ ప్రియులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీ ఈ సందర్బంగా సభకు ముందుగా స్థానిక కోటిరెడ్డి సర్కిల్లో గల స్టేట్ గెస్ట్‌హౌస్‌నుంచి వైవీయూ విద్యార్థులు, జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు మేళ తాళాల మధ్య సాహిత్య ర్యాలీ నిర్వహించారు. ఎర్రముక్కపల్లె బ్రౌన్ సెంటర్‌లోగల బ్రౌన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ బ్రౌన్ గ్రంథాలయానికి చేరుకుంది. -
సాహితీకారులకు ప్రోత్సాహం ముఖ్యం
కడప కల్చరల్: సాహితీకారులను ప్రోత్సహిస్తే వారి కలాలు మరింత పదునెక్కి ప్రజల పక్షంగా, సమాజాభివద్ధి పక్షంగా నిలుస్తాయని కవిత విద్య సాంస్కతిక సంస్థ అధ్యక్షులు అలపర్తి పిచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. లలిత కళానికేతన్ సాహిత్య సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో వైవీయూ లలిత కళల విభాగం అధిపతి డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి శనివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో సాహితీకారుల అభినందన సభ నిర్వహించారు. ఇటీవల నందలూరులో ఎస్.దస్తగిరి సాహెబ్ స్మారక సాహిత్య పురస్కారాలు పొందిన కథా రచయిత పాలగిరి విశ్వప్రసాద్‌రెడ్డి, సాహితీవేత్త డాక్టర్ తవ్వా వెంకటయ్య, కొండూరు పిచ్చమ్మ నారాయణరాజు స్మారక సంస్థ అధ్యక్షులు కొండూరు జనార్దన్‌రాజులను అభినందించారు. ఇంకా జానమద్ది విజయభాస్కర్, గంగనపల్లి వెంకట రమణ, భూతపురి గోపాలకష్ణశాస్త్రి, శివారెడ్డి, యల్లేశ్వరరావు, శివారెడ్డి మాట్లాడారు. సత్కార గ్రహీతలు ధన్యవాదాలు తెలిపారు. -
విశ్వనరుడు జాషువా
కడప కల్చరల్ : దళితుల్లో పుట్టిన జాషువ ఆ బాధలను తెలుసుకుని వాటికి గొంతుకై నిలిచారని సీపీ బ్రౌన్ గ్రంథాలయం బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకవి జాషువ జయంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జాషువాను కేవలం దళిత కవిగా ముద్ర వేయవద్దని, ఆయన విశ్వనరుడని తెలిపారు. సమాజానికి మంచి దారి చూపేవాడే కవి అని, మనిషిని, మనసును పట్టుకోవడమే నిజమైన కవిత్వమని అభివర్ణించారు. సమాజం దిగజారేందుకు తగిన కారణాలను కవిగా జాషువ ఎలుగెత్తి చాటారని తెలిపారు. ప్రముఖ రచయిత, నందలూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు చీపాడు రాజేశ్వరరావు మాట్లాడుతూ జాషువ రచన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించడం సాహితీ లోకానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైవీయూ ఆచార్యులు గంగయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, డాక్టర్ గురవయ్య, డాక్టర్ రమణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముస్తఫా రచనల నిండా మానవతా పరిమళాలే
కడప కల్చరల్ : డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా రచనలన్నీ మానవత్వపు పరిమళాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయని ప్రముఖ రచయిత, అనువాదకులు కొమ్మిశెట్టి మోహన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా జీవితం–సాహిత్యం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ముస్తఫా రచనలన్నీ వెలుగుల రవ్వలేనని, సమాజంలోని విలువల పట్ల ఆయన కాంక్ష, స్పందన ఆ రచనల్లో ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు. ఉత్తమ సమాజం కోసం ఆయన రచనలు సాగాయన్నారు. రాజకీయాల పట్ల ఆయన నిరసన కవిత్వంలోని వ్యంగం ద్వారా అర్థమవుతోందని, గోవును గ్రామంతో, పులిని పట్నంతో పోల్చడం ఎంతో పదునుగా ఉందన్నారు. సీమ వాసి గనుక ఈ ప్రాంత కడగండ్లను కవితా వస్తువుగా స్వీకరించడం విశేషమన్నారు. రచనలన్నీ దేనికవే గొప్పవిగా చెప్పవచ్చన్నారు. ఇంతటి ప్రతిభావంతుడైన ముస్తఫా నిగర్వి, సంయమనశీలి, జ్ఞాని అని, ఆయనతో మాట్లాడితే పుస్తకంతో మాట్లాడినట్లు ఉంటుందని అభివర్ణించారు. దశాబ్దాల క్రితం ఆయన ఈ ప్రాంత రైతుల ఆత్మహత్యల పట్ల ఆవేదనను రచనల్లో వివరించారన్నారు. ప్రక్రియ ఏదైనా మూల వస్తువు మానవత్వమేనని వివరించారు. పలు పత్రికల్లో వచ్చిన ఆయన వ్యాసాలు రాష్ట్రంలోని మేధావుల ప్రశంసలు కూడా అందుకున్నాయన్నారు. ఈ సందర్భంగా బ్రౌన్ గ్రంథాలయ బాధ్యులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి ముస్తఫా రచనలను విశేషంగా ప్రశంసించారు. బ్రౌన్ గ్రంథాలయం పక్షాన వక్తతోపాటు రచయిత ముస్తఫాను కూడా నిర్వాహకులు, డాక్టర్ జానమద్ది సాహిత్య పీఠం అధ్యక్షుడు జానమద్ది విజయభాస్కర్ సత్కరించారు. -
ద్విపథం.. ఒక గమ్యం
కడప కల్చరల్: అభ్యుదయ రచయితల సంఘం కడపశాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో సంస్థ బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి రచించిన రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియలు సమాజ హితం కోరేవే. డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి కవిత్వాన్ని తనకు ఆత్మీయ మిత్రునిగా ఇష్టపడతారు. ఆలోచింపజేసే వచనం కంటే హృదయాన్ని కదిలింపజేసే భావుకత, క్లుప్తత, అంతర్లీనంగా సంగీతం ధ్వనించే కవిత్వం వైపే ఆయన కలం, గలం మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుతం ఆవిష్కృతం కానున్న ‘కవిత–మానవీయత’ పుస్తకం ఎందరో కవులు తమ రచనలతో మానవతను ఆవిష్కరించారో తెలుపుతుంది. కవితకు నిజమైన లక్ష్యాన్ని సాధించి ఉత్తమ మార్గాన్ని చూపుతుంది. మనము అదే బాటలో నడుద్దామన్న స్పూర్తిని కలిగిస్తోంది. మనకోసం కాకుండా సమాజం కోసం బ్రతికిన వారే చరిత్రలో నిలుస్తారన్నది పెద్దల మాట. సామాజిక హితం కోరని కవిత్వం కాలానికి నిలువబోదని కూడా వారు చెప్పారు. ఎన్నో సందర్బాల్లో తనకు మార్గదర్శనం చేసిన రచనలను హృదయ గ్రంథాలయం నుంచి డాక్టర్ ఈశ్వర్‌రెడ్డి సాహిత్యం, సామాజిక అవసరం పుస్తకంలో ఆవిష్కరించారు. తనకు కూడా ఆ పథమే ఇష్టం గనుక కవిగా తన బాధ్యత గనుక అలాంటి ఎందరో రచనలను, అవి లక్ష్యం వైపు సాగిన విధానాన్ని ఈ పుస్తకంలో తెలుపుతున్నారు. ఈ పుస్తకాలను డాక్టర్ పీసీ వెంకటేశ్వర్లు, డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి పరిచయం చేయనున్నారు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి సబాధ్యక్షులుగా, ఆచార్య ఆర్వీఎస్ సుందరం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆర్ఎం ఉమామహేశ్వరరావు, ఆచార్య బి.రామకృష్ణారెడ్డి, ఆచార్య డీవీ శ్రవణ్‌కుమార్ అతిథులుగా హాజరు కానున్నారు.