దేవిరెడ్డి, ఆర్వీఆర్‌లకు పురస్కారాలు అందిస్తున్న సజ్జల
సాక్షి,కడప కల్చరల్ : యూనివర్సిటీలు ప్రజల పక్షాన నిలబడే బాధ్యతాయుతమైన పాత్రికేయులను తయారుచేసేలా జర్నలిజం కోర్సులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కడపలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రముఖ కవి గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మల్లారెడ్డి కవిత్వంలో వాడి, వేడి, నాడి, పదును ఉండడంవల్లే ఆయనకు విశిష్టస్థానం లభించిందన్నారు.
ఆయన పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు అందుకుంటున్న వారిలో ఆయన స్ఫూర్తితో పాత్రికేయ రంగంలో విశిష్ట స్థానం అందుకున్న వారే ఉండడం అభినందనీయమన్నారు. నేడు ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సంకుచిత భావాలతో పత్రికలు నడుస్తున్నాయన్నారు. ఇలాంటి పత్రికలు ప్రజా›శ్రేయస్సే పరమావధిగా నడిస్తే మంచి మనుగడ ఉండగలదని చెప్పారు. అనంతరం.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి, విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్వీ రామారావుకు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య దుర్బాక విజయరాఘవ ప్రసాద్, నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కుల సచివులు డాక్టర్ ఎల్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment