Memorial Award
-
సూపర్ స్టార్ కృష్ణ పేరుతో అవార్డు
‘‘సినీ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’ ప్రదానం చేస్తాం’’ అని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (మా ఏపీ)’ అధ్యక్షుడు, డైరెక్టర్ దిలీప్ రాజా అన్నారు. తెనాలిలోని ‘మా ఏపీ’ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమకు ఇష్టమైన ముగ్గురు నటుల పేర్లను ‘మా – ఏపీ’ కార్యాలయానికి పంపాలి. పంపిన వారి వివరాలు, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ప్రజా బ్యాలెట్లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’కు జ్యూరీ ఎంపిక చేస్తుంది. తెనాలిలో జరిగే ఈ అవార్డు వేడుక తేదీని మహేశ్‌బాబుతో చర్చించిన అనంతరం తెలియజేస్తాం’’ అన్నారు. -
సంపాదకుడు ఏబీకే ప్రసాద్‌కు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం
హఫీజ్‌పేట్(హైదరాబాద్): ప్రముఖ పత్రికా సంపాదకుడు ఏబీకే ప్రసాద్‌కు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం లభించింది. కొండాపూర్‌లోని చండ్రరాజేశ్వరరావు (సీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమానికి శనివారం వచ్చిన యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి సూర్యకళావతి ఆమె చేతులమీదుగా ఈ పురస్కారాన్ని ఏబీకేకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చి అనేక ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి గౌరవ పురస్కారాలు అందుకున్న వ్యక్తి ఏబీకే అని తెలుగులోని అన్ని ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన ఘనత ఆయనదని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా 2004–2009 సంవత్సరాలకు సేవలందించి తెలుగుభాషకు ప్రాచీన హోదా తీసుకురావడంలో ఆయన చేసిన కృషి విస్మరించలేనిదన్నారు. ఈ సమావేశంలో సీఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి.చెన్నకేశవరావు, వైద్యాధికారి డాక్టర్ కె.రజిని, డాక్టర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
నా ఎదుగుదలలో గజ్జల మల్లారెడ్డిదే కీలక పాత్ర: సజ్జల
సాక్షి,కడప కల్చరల్ : యూనివర్సిటీలు ప్రజల పక్షాన నిలబడే బాధ్యతాయుతమైన పాత్రికేయులను తయారుచేసేలా జర్నలిజం కోర్సులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కడపలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రముఖ కవి గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మల్లారెడ్డి కవిత్వంలో వాడి, వేడి, నాడి, పదును ఉండడంవల్లే ఆయనకు విశిష్టస్థానం లభించిందన్నారు. ఆయన పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు అందుకుంటున్న వారిలో ఆయన స్ఫూర్తితో పాత్రికేయ రంగంలో విశిష్ట స్థానం అందుకున్న వారే ఉండడం అభినందనీయమన్నారు. నేడు ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సంకుచిత భావాలతో పత్రికలు నడుస్తున్నాయన్నారు. ఇలాంటి పత్రికలు ప్రజా›శ్రేయస్సే పరమావధిగా నడిస్తే మంచి మనుగడ ఉండగలదని చెప్పారు. అనంతరం.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి, విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్వీ రామారావుకు గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య దుర్బాక విజయరాఘవ ప్రసాద్, నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కుల సచివులు డాక్టర్ ఎల్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాడ సూరన్నకు వంగపండు అవార్డు అందజేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖటప్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్వర్యంలో జానపద వాగ్గేయకారుడు వంగపండు వర్ధంతి సభ బుధవారం ఘనంగా జరిగింది. జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో..బాడ సూరన్నను సత్కరించారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. అవార్డులో భాగంగా ప్రభుత్వం తరఫున మంత్రి బాడ సురన్నకు రూ.2 లక్షలు అందజేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళలు, కళాకారులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ‘‘నా గురువు వంగపండు పాట ద్వారా అవార్డు దక్కడం గర్వంగా ఉంది’’ అన్నారు సూరన్న. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగపండు వర్ధంతి సభను ప్రభుత్వం నిర్వహించడం గొప్ప విషయం. వంగపండు విగ్రహ ఏర్పాటు ద్వారా కళాకారులకు గుర్తింపు లభించింది. సీఎం వైఎస్ జగన్‌కు కళాకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. -
అదే దాసరిగారికి ఇచ్చే అసలు నివాళి
‘‘కళాకారులు చిరంజీవులు. ఎప్పటికీ బతికే ఉంటారు. గురువుగారు దాసరి నారాయణరావుగారు ఇంకా మన ముందే ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4) సందర్భంగా దాసరి మెమోరియల్ అవార్డ్స్‌ను హైదరాబాద్‌లో కళాకారులకు బహూకరించారు. దాసరి ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, భీమవరం టాకీస్ సంస్థల నేతృత్వంలో నిర్మాత రామసత్యనారాయణ, రమణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దాసరి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆర్. నారాయణమూర్తికి అందజేశారు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. శ్రీదాసరి ఎక్స్‌లెన్స్ అవార్డుకి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంపిక అయ్యారు. శ్రీ దాసరి నారాయణరావు అండ్ శ్రీ దాసరి పద్మ మెమోరియల్ అవార్డును రాజశేఖర్–జీవితలకు అందజేశారు. దాసరి టాలెంట్ అవార్డ్స్ దర్శకులు గౌతమ్ తిన్ననూరి, శశికరణ్ తిక్క, వెంకటేష్ మహా, వేణు ఊడుగుల, బాబ్జీలను వరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య మాట్లాడుతూ– ‘‘అన్ని రకాలుగా ప్రతిభ కనబరిచిన వ్యక్తి దాసరిగారు. కేంద్రమంత్రిగాను చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. దాసరిగారు ఇంకొంత కాలం బతికి ఉండాల్సింది. అవార్డుగ్రహీతలకు శుభాకాంక్షలు’’ అని అన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘దాసరిగారు వంద సినిమాలు తీసినప్పుడు ఆ వేడుకను ఎలా చేయాలి? అని నేను, మోహన్‌బాబు, మురళీమోహన్ చర్చించుకుంటున్నాం. అప్పుడు దర్శకులు కోడి రామకృష్ణగారు వచ్చి ఆ ఫంక్షన్‌ను తాను చేస్తానన్నారు. పాలకొల్లులో అత్యద్భుతంగా చేశారు. ఇప్పుడు దాసరిగారి పేరిట అవార్డులను ఇవ్వాలనే ఆలోచన చేసిన రామసత్యనారాయణగారికి ధన్యవాదాలు. దాసరిగారు నాలాంటి ఎందర్నో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పేద కళాకారులకు భరోసా దాసరిగారు. ఇప్పుడు వారసత్వ సినిమాలు వస్తున్నాయి. కొత్తవారికి, పేద కళాకారులకు ఎక్కువగా ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వడమే దాసరిగారికి మనం ఇచ్చే అసలు నివాళి. ఆంధ్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించాలి. ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా అంబికా కృష్ణగారిని కోరుతున్నాను’’ అన్నారు. ‘‘దాసరిగారు వ్యక్తికాదు.. వ్యవస్థ. ఆయనలా ఎందరో దర్శకులు, హీరోలు, దర్శకులను పరిచయం చేసినట్లు ఏ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు’’ అన్నారు దర్శకులు వీవీ వినాయక్. ‘‘దాసరిగారు ఫాదర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన అందర్నీ సమానంగా చూసేవారు’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘ఇవి బెస్ట్ అవార్డ్స్‌గా నేను భావిస్తున్నాను’’ అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘‘దాసరిగారి యూనివర్సిటీలో నేనో చిన్న విద్యార్థిని. ఆయనతో కలిసి దాదాపు 40 సినిమాలు చేశాను’’ అని మురళీమోహన్ అన్నారు. ‘‘దాసరిగారి కుటుంబం చాలా పెద్దది. ఆయన అందరి గుండెల్లో బతికే ఉంటారు’’ అన్నారు ధవళ సత్యం. ‘‘గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాం ’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘దాసరిగారి పేరిట నెలకొల్పిన ఈ అవార్డుల వేడుకలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు రమణారావు. ‘‘నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉందో భవిష్యత్‌లో దాసరి మెమోరియల్ అవార్డ్స్‌కు అంతే ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ‘‘దాసరిగారి రక్తంలోని ప్రతి కణంలో దర్శకత్వంపై ప్రేమ ఉంది’’ అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ‘‘దాసరిగారికి ఎవరూ సరిలేరు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు నరేశ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్లతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆదివాసీ హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత
-
వినోద్ మెహతాకి జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, ది ఔట్లుక్ గ్రూప్ ఎడిటోరియల్ చైర్మన్ వినోద్ మెహతా ప్రతిష్టాత్మక ‘జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు’కు ఎంపికయ్యారు. జర్నలిజంలో మెహతా చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ని ఎంపిక చేసినట్టు ఈ అవార్డు వ్యవస్థాపకులు, టీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఓ కార్యక్రమంలో అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు బహుమతి, బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని మెహతాకు అందజేయనున్నట్టు తెలిపారు. సుప్రసిద్ధ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏటా పాత్రికేయ రంగానికి చెందిన ఒకరిని ఈ అవార్డుతో టీఎస్ఆర్ ఫౌండేషన్ సత్కరిస్తోంది. -
దాశరథి పేరిట స్మారక పురస్కారం
కృష్ణమాచార్య జయంతి సభలో సీఎం కేసీఆర్ హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీవేత్త దివంగత దాశరథి కృష్ణమాచార్య పేరిట స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన కవికి ఆ పురస్కారం రూపంలో రూ. లక్షా నూట పదహార్లు అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయానికి లేదా ప్రముఖ విద్యాసంస్థకు ఆయన పేరు పెడతామని వెల్లడించారు. దాశరథి 89వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా మంగళవారమిక్కడి రవీంద్రభారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన దాశరథి కృష్ణమాచార్య వంటి వారిని ఈ ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తుందని చెప్పారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతంలో దాశరథి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు తెలిపారు. ఆయన కుమారుడికి ప్రభుత్వంలో మంచి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కాగా, రవీంద్రభారతిలో సరైన ఏర్పాట్లు లేవని, ఇకపై అలాంటి లోపాలు లేకుండా ప్రతి సంవత్సరం రూ.కోటి గ్రాంటును మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. పనికిమాలిన విగ్రహాలెన్నో: సభావేదికపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను కొన్ని మాటలు మాట్లాడితే లొల్లి అయితది’ అంటూనే ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాల గురించి వ్యాఖ్యలు చేశారు. దాశరథికి విగ్రహం లేదనే సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘చూస్తున్నరుగదా ట్యాంక్‌బండ్ మీద, చౌరస్తాలల్లో ఎన్నో పనికిమాలిన విగ్రహాలున్నై. అవి మనకు సంబంధించినవారివి కాదు. ఆ నాటకాలాయనతో మనకేం సంబంధం? పుస్తకంలో పాఠం చూసి.. బళ్లారి రాఘవ గురించి నాకేం అవసరం అని ఓ చిన్నపాప ఇటీవల అడిగింది’’ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ఎవరైనా విమర్శిస్తే తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. విమర్శిస్తే మా వద్ద ‘రాళ్లబండి’ ఉంది (పక్కనే సాంస్కృతిక విభాగం సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ ఉన్నారు) అని చమత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ప్రసాద రాజు, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, సాహితీవేత్తలు నందిని సిద్ధారెడ్డి, శ్రీనివాసాచార్య, దాశరథి కుమారుడు లక్ష్మణాచార్య పాల్గొన్నారు. గురుభక్తి చాటుకున్న కేసీఆర్: సీఎం సభావేదికపైకి వస్తుండగా ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్య కనిపించారు. వెంటనే కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేశారు. తాను దుబ్బాక పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆయన తెలుగు బోధించేవారని తెలిపారు.