అదే దాసరిగారికి ఇచ్చే అసలు నివాళి | dasari memorial awards distribution | Sakshi
Sakshi News home page

అదే దాసరిగారికి ఇచ్చే అసలు నివాళి

Published Thu, May 2 2019 1:11 AM | Last Updated on Thu, May 2 2019 1:11 AM

dasari memorial awards distribution - Sakshi

రామసత్యనారాయణ, రామ మోహనరావు,అంబికా కృష్ణ, రోశయ్య, మురళీమోహన్, నారాయణ మూర్తి, నరేశ్, విజయశంకర్, రమణమూర్తి

‘‘కళాకారులు చిరంజీవులు. ఎప్పటికీ బతికే ఉంటారు. గురువుగారు దాసరి నారాయణరావుగారు ఇంకా మన ముందే ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని దర్శక–నిర్మాత–నటుడు ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4) సందర్భంగా దాసరి మెమోరియల్‌ అవార్డ్స్‌ను హైదరాబాద్‌లో కళాకారులకు బహూకరించారు. దాసరి ఆర్ట్స్‌ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, భీమవరం టాకీస్‌ సంస్థల నేతృత్వంలో నిర్మాత రామసత్యనారాయణ, రమణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ దాసరి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆర్‌. నారాయణమూర్తికి అందజేశారు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. శ్రీదాసరి ఎక్స్‌లెన్స్‌ అవార్డుకి దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఎంపిక అయ్యారు. శ్రీ దాసరి నారాయణరావు అండ్‌ శ్రీ దాసరి పద్మ మెమోరియల్‌ అవార్డును రాజశేఖర్‌–జీవితలకు అందజేశారు. దాసరి టాలెంట్‌ అవార్డ్స్‌ దర్శకులు గౌతమ్‌ తిన్ననూరి, శశికరణ్‌ తిక్క, వెంకటేష్‌ మహా, వేణు ఊడుగుల, బాబ్జీలను వరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య మాట్లాడుతూ– ‘‘అన్ని రకాలుగా ప్రతిభ కనబరిచిన వ్యక్తి దాసరిగారు. కేంద్రమంత్రిగాను చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. దాసరిగారు ఇంకొంత కాలం బతికి ఉండాల్సింది. అవార్డుగ్రహీతలకు శుభాకాంక్షలు’’ అని అన్నారు.

ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘దాసరిగారు వంద సినిమాలు తీసినప్పుడు ఆ వేడుకను ఎలా చేయాలి? అని నేను, మోహన్‌బాబు, మురళీమోహన్‌ చర్చించుకుంటున్నాం. అప్పుడు దర్శకులు కోడి రామకృష్ణగారు వచ్చి ఆ ఫంక్షన్‌ను తాను  చేస్తానన్నారు. పాలకొల్లులో అత్యద్భుతంగా చేశారు. ఇప్పుడు దాసరిగారి పేరిట అవార్డులను ఇవ్వాలనే ఆలోచన చేసిన రామసత్యనారాయణగారికి ధన్యవాదాలు. దాసరిగారు నాలాంటి ఎందర్నో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పేద కళాకారులకు భరోసా దాసరిగారు. ఇప్పుడు వారసత్వ సినిమాలు వస్తున్నాయి. కొత్తవారికి, పేద కళాకారులకు ఎక్కువగా ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వడమే దాసరిగారికి మనం ఇచ్చే అసలు నివాళి. ఆంధ్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించాలి.

ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా అంబికా కృష్ణగారిని కోరుతున్నాను’’ అన్నారు. ‘‘దాసరిగారు వ్యక్తికాదు.. వ్యవస్థ. ఆయనలా ఎందరో దర్శకులు, హీరోలు, దర్శకులను పరిచయం చేసినట్లు ఏ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు’’ అన్నారు దర్శకులు వీవీ వినాయక్‌. ‘‘దాసరిగారు ఫాదర్‌ ఆఫ్‌ తెలుగు ఇండస్ట్రీ. ఆయన అందర్నీ సమానంగా చూసేవారు’’ అన్నారు నటుడు రాజశేఖర్‌. ‘‘ఇవి బెస్ట్‌ అవార్డ్స్‌గా నేను భావిస్తున్నాను’’ అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘‘దాసరిగారి యూనివర్సిటీలో నేనో చిన్న విద్యార్థిని. ఆయనతో కలిసి దాదాపు 40 సినిమాలు చేశాను’’ అని మురళీమోహన్‌ అన్నారు. ‘‘దాసరిగారి కుటుంబం చాలా పెద్దది.

ఆయన అందరి గుండెల్లో బతికే ఉంటారు’’ అన్నారు ధవళ సత్యం. ‘‘గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్లాన్‌ చేశాం ’’ అన్నారు రామ సత్యనారాయణ.  ‘‘దాసరిగారి పేరిట నెలకొల్పిన ఈ అవార్డుల వేడుకలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు రమణారావు. ‘‘నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉందో భవిష్యత్‌లో దాసరి మెమోరియల్‌ అవార్డ్స్‌కు అంతే ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికాకృష్ణ. ‘‘దాసరిగారి రక్తంలోని ప్రతి కణంలో దర్శకత్వంపై ప్రేమ ఉంది’’ అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ‘‘దాసరిగారికి ఎవరూ సరిలేరు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు నరేశ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌లతోపాటు పలువురు  సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement