K roshaiah
-
అదే దాసరిగారికి ఇచ్చే అసలు నివాళి
‘‘కళాకారులు చిరంజీవులు. ఎప్పటికీ బతికే ఉంటారు. గురువుగారు దాసరి నారాయణరావుగారు ఇంకా మన ముందే ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4) సందర్భంగా దాసరి మెమోరియల్ అవార్డ్స్‌ను హైదరాబాద్‌లో కళాకారులకు బహూకరించారు. దాసరి ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, భీమవరం టాకీస్ సంస్థల నేతృత్వంలో నిర్మాత రామసత్యనారాయణ, రమణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దాసరి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆర్. నారాయణమూర్తికి అందజేశారు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. శ్రీదాసరి ఎక్స్‌లెన్స్ అవార్డుకి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంపిక అయ్యారు. శ్రీ దాసరి నారాయణరావు అండ్ శ్రీ దాసరి పద్మ మెమోరియల్ అవార్డును రాజశేఖర్–జీవితలకు అందజేశారు. దాసరి టాలెంట్ అవార్డ్స్ దర్శకులు గౌతమ్ తిన్ననూరి, శశికరణ్ తిక్క, వెంకటేష్ మహా, వేణు ఊడుగుల, బాబ్జీలను వరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య మాట్లాడుతూ– ‘‘అన్ని రకాలుగా ప్రతిభ కనబరిచిన వ్యక్తి దాసరిగారు. కేంద్రమంత్రిగాను చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. దాసరిగారు ఇంకొంత కాలం బతికి ఉండాల్సింది. అవార్డుగ్రహీతలకు శుభాకాంక్షలు’’ అని అన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘దాసరిగారు వంద సినిమాలు తీసినప్పుడు ఆ వేడుకను ఎలా చేయాలి? అని నేను, మోహన్‌బాబు, మురళీమోహన్ చర్చించుకుంటున్నాం. అప్పుడు దర్శకులు కోడి రామకృష్ణగారు వచ్చి ఆ ఫంక్షన్‌ను తాను చేస్తానన్నారు. పాలకొల్లులో అత్యద్భుతంగా చేశారు. ఇప్పుడు దాసరిగారి పేరిట అవార్డులను ఇవ్వాలనే ఆలోచన చేసిన రామసత్యనారాయణగారికి ధన్యవాదాలు. దాసరిగారు నాలాంటి ఎందర్నో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పేద కళాకారులకు భరోసా దాసరిగారు. ఇప్పుడు వారసత్వ సినిమాలు వస్తున్నాయి. కొత్తవారికి, పేద కళాకారులకు ఎక్కువగా ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వడమే దాసరిగారికి మనం ఇచ్చే అసలు నివాళి. ఆంధ్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించాలి. ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా అంబికా కృష్ణగారిని కోరుతున్నాను’’ అన్నారు. ‘‘దాసరిగారు వ్యక్తికాదు.. వ్యవస్థ. ఆయనలా ఎందరో దర్శకులు, హీరోలు, దర్శకులను పరిచయం చేసినట్లు ఏ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు’’ అన్నారు దర్శకులు వీవీ వినాయక్. ‘‘దాసరిగారు ఫాదర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన అందర్నీ సమానంగా చూసేవారు’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘ఇవి బెస్ట్ అవార్డ్స్‌గా నేను భావిస్తున్నాను’’ అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘‘దాసరిగారి యూనివర్సిటీలో నేనో చిన్న విద్యార్థిని. ఆయనతో కలిసి దాదాపు 40 సినిమాలు చేశాను’’ అని మురళీమోహన్ అన్నారు. ‘‘దాసరిగారి కుటుంబం చాలా పెద్దది. ఆయన అందరి గుండెల్లో బతికే ఉంటారు’’ అన్నారు ధవళ సత్యం. ‘‘గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాం ’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘దాసరిగారి పేరిట నెలకొల్పిన ఈ అవార్డుల వేడుకలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు రమణారావు. ‘‘నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉందో భవిష్యత్‌లో దాసరి మెమోరియల్ అవార్డ్స్‌కు అంతే ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ‘‘దాసరిగారి రక్తంలోని ప్రతి కణంలో దర్శకత్వంపై ప్రేమ ఉంది’’ అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ‘‘దాసరిగారికి ఎవరూ సరిలేరు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు నరేశ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్లతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
జనాకర్షణలో జగన్ ముందంజ
జనాకర్షణలో, జనాభిప్రాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ముందంజలో ఉన్నారని, రాజకీయంగా ఆయన పరిస్థితి ప్రస్తుతం పుంజుకుందని సీనియర్ రాజకీయనేత, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు. అదేసమయంలో పాలన విషయంలో చంద్రబాబునాయుడికి పాస్ మార్కులు ఇవ్వొచ్చని, అయితే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా బాబు మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్, చంద్రబాబు పాలన రెండు పద్ధతుల్లో నడుస్తోంది కానీ వారి పాలన, వారి వ్యవహారం అందరికంటే ముందు ప్రజలకు నచ్చాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేస్తున్న భారీ అప్పు వాంఛనీయం కాదని, దాన్ని తిరిగి చెల్లించడం కష్టమని, ప్రజలకు ఇది భారమంటున్న రోశయ్య అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సుదీర్ఘ రాజకీయ అనుభవం మీది. ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉంది. కాని జరుగుతున్న పరిణామాలు జీర్ణం కావటం లేదు. ఎందుకంటే మా రోజుల్లో ఒక నాయకుడు ఆయనను అనుసరించేవారు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అలాకాదు కదా. నాయకుల సంఖ్య ఎక్కువ అయిపోయింది. బాగా పెరిగిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా ఉంటుందనుకుంటున్నారు? మా కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు కదా అంత ప్రజారంజకంగా లేదని. నేను ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినా ఆ భావజాలం ప్రభావం కొంత ఉంది. యనమల రామకృష్ణుడు తీరు కానీ, చంద్రబాబు అప్పులు చేస్తున్న వైనంపై మీ అభిప్రాయం? అవగాహన లేకుండా ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడపటం కష్టం. ఆర్థిక నిర్వహణకు సరైన అవగాహన ఉండాలి. తెలంగాణలో లక్ష కోట్లు, ఏపీలో లక్షా పాతిక కోట్ల రూపాయల అప్పు పోగుపడింది కదా? కాలం మారింది. విలువలు మారుతున్నాయి. అప్పుచేయడం గొప్పే. అప్పు అందరికీ పుట్టదు. కానీ నాకు అప్పు పుట్టింది అనుకునే వారున్నారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ భారీ అప్పులను తీర్చడం కష్టం. మళ్లీ ప్రజలనుంచే రాబట్టాలి. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల విలువైన బాండ్లను 10.37 శాతం వడ్డీకి తీసుకుంది కదా? అది మంచి పద్థతి కాదు. వాంఛనీయం కాదు. రాష్ట్రానికి ఇది నష్టమే. ఫిరాయింపుదార్లకు మంత్రిపదవులు ఇవ్వడం సరైందేనా? నువ్వు వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని ప్రలోభ పెట్టడం సరైంది కాదు. కానీ అవి కూడా జరుగుతున్నాయి. స్పీకర్ సాక్షాత్తూ ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయవచ్చా? పాలాభిషేకం చేసిన విషయం నాకు తెలీదు. కానీ పార్టీ సమావేశాలకు మామూలు రోజుల్లో అయితే వెళ్లవచ్చు. కానీ ఇదివరకు అలా స్పీకర్లు ఎవరూ వెళ్లేవారు కాదు. వ్యక్తుల స్థాయిలో ఎవరైనా వెళ్లిన సందర్భాలున్నాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే స్థితి ఉందా? సీట్ల విషయంలో చెప్పలేను కానీ ఈసారి ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకునే అవకాశం అయితే ఉంది. కొంత మెరుగవుతుంది చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? చూడాలి. ఎన్నికల్లో ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారో, ఎవరు పోటీ చేస్తారో చూస్తే గాని చెప్పలేం. ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ఉంటుంది? అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఏదోమేరకు ప్రజా వ్యతిరేకత ఉంటుంది. బాబు పాలనకు మీరెన్ని మార్కులు ఇస్తారు? పాస్ మార్కులు ఇవ్వొచ్చు. అంటే 30 శాతం మార్కులు వేయవచ్చు. అయితే మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాడా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేం కదా. వైఎస్ జగన్‌కు ఎన్ని మార్కులు వేస్తారు? జగన్ పరిస్థితి బాగానే ఉంది. ఎన్ని మార్కులు అని చెప్పలేను కానీ అతడి భవిష్యత్తు మాత్రం ముందంజలోనే ఉంది. వైఎస్‌తో మీకున్న అనుబంధం ఏమిటి? రాజశేఖరరెడ్డి చాలా మంచి స్నేహితుడు. నేను దేనిపైనైనా విభేదిస్తే అందరిముందరా లేక ప్రెస్ ముందర చెప్పేవాడిని కాదు. విడిగా కలిసి తనతో మాట్లాడేవాడిని. ఆయన వాటిని చక్కగా రిసీవ్ చేసుకునేవారు. అలిపిరి ఘటనలో చంద్రబాబు గాయంపై మీరు అప్పట్లో వ్యంగ్యాస్త్రాలు సందించారు కదా? అవును. ఒక చేతికి కట్టుకోవలిసింది మరోచేతికి కట్టు కట్టించుకున్నాడు. ఆ విషయం మీలాంటి స్నేహితుడు ఒకరు చెబితే దాన్ని మనసులో పెట్టుకుని విమర్శ చేశాను. ‘ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఆయనకు సరైన వైద్యం చేసేవాళ్లు కనబడటం లేదు’ అని విమర్శించాను. తర్వాత బాబు అర్థం చేసుకుని ఆ కట్టే లేకుండా తీయించుకున్నాడు. చంద్రబాబు కొండెత్తమంటాడు అనే విమర్శ కూడా చేశారు కదా మీరు? హామీలు ఇచ్చేటప్పుడు అంతులేకుండా భారంతో కూడిన హామీలు ఇచ్చేవాడు. వాటిని పూర్తి చేయాలంటే మీరంతా తలా ఒక చేయి వేసి ఎత్తితే కదా అనే సందర్భంలో ‘కొండెత్తు’ అనే మాట వాడాను. విభజన చేసి కూడా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మునిగిపోవడంపై మీ అభిప్రాయం? సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం. ఏ నిర్ణయంలో అయినా సరే ఆలస్యంగా నిర్ణయం చేశారు. రాష్ట్రం వైపు నుంచి విభజనకు సంబంధించిన సమాచారం కూడా సకాలంలో ఇవ్వలేదు. అలా నష్టం జరిగింది. అయితే ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఇక్కడ కూర్చొని మనం తేల్చలేం. విభజనతో మునిగిపోతాం అని మా వంతుగా చెప్పాల్సింది చెప్పాం. కాని సోనియా తన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వస్తుందని మీరెన్నడైనా ఊహించారా? ఊహించలేదు. కానీ పరిస్థితులు అలా దారితీశాయి. అయితే కాంగ్రెస్ ఏపీలో కోలుకోవడానికి మళ్లీ అవకాశముంది. ఏ పార్టీ అయినా నిండా మునగదు కదా. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరి పాలన ఎలా ఉంది? రెండూ రెండు పద్ధతులు. వారి పాలన నాకు బాగుండటం కాదు. వారి పాలన, వారి వ్యవహారం అంతిమంగా ప్రజలకు బాగుండాలి కదా. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) http:// bit. do/ exZiv http:// bit. do/ exZiH -
95వ జయంతి మహోత్సవం
దాదా సాహెబ్‌ఫాల్కే, పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత, స్వర్గీయ నటుడు డాక్టర్ అక్కి నేని నాగేశ్వరరావు 95వ జయంతి మహోత్సవం ఈ నెల 19న జరగనుంది. ‘రసమయి’ సంస్థ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ‘అక్కినేని ఆలోచనలు’ సంస్కృత అనువాధ గ్రంథం ‘అక్కినేని అనుచింతనాని’, అక్కినేని ప్రత్యేక తపాలా చంద్రిక (అక్కినేని స్పెషల్ పోస్టర్ కవర్) ఆవిష్కరణలు ఉంటాయి. ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ డా. కె. రోశయ్య, సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి పూర్వ చైర్మెన్ డా.ఎ. చక్రపాణి, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి. చంద్రశేఖర్, డా. బి.వాణీదేవి తదితరులు పాల్గొంటారు. అలాగే అదే రోజు శ్రీ త్యాగరాయ గానసభలో ‘మహానటులు అక్కినేని’ శీర్షికన ఎం.కె రాము రచించిన సంగీతరూపక ప్రదర్శన ఉంటుందని ‘రసమయి’ అధ్యక్షులు ఎం.కె. రాము తెలిపారు. -
ప్రతానికి డాక్టరేట్
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘యునైటెడ్ ధియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ’ (యుటిఆర్) నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీకి అనుబంధంగా గుర్తింపు పొందిన యుటిఆర్ యూనివర్సిటీ రామకృష్ణ గౌడ్, నటుడు సుమన్‌లను గౌరవ డాక్టరేట్‌కి ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ చేతుల మీదుగా రామకృష్ణ గౌడ్ గౌరవ డాక్టరేట్, 51వేల నగదు అందుకున్నారు. ఐదు వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డ్స్, ఐదు లక్షల ఉచిత బీమా కల్పించడంతో పాటు రెండు వందల మంది సినీ వర్కర్లకు గృహాలు ఇప్పించారు ప్రతాని. సినిమారంగంలో ఆయన చేసిన సోషల్ సర్వీస్‌కి గాను ఈ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రతానికి అభినందనలు తెలిపారు. ‘‘గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉంది’’ అని ప్రతాని అన్నారు. -
అందుకు ప్రతిరూపమే ఈ చిత్రం: బగ్గిడి గోపాల్
మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవితం ఆధారంగా అర్జున్ కుమార్ దర్శకత్వంలో బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘బగ్గిడి గోపాల్’. టైటిల్ రోల్లో బగ్గిడి గోపాల్ నటించారు. సుమన్, కవిత, గీతాంజలి తదితరులు నటించిన ఈ సినిమాకు జయసూర్య స్వరకర్త. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో సీడీని అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య రిలీజ్ చేశారు. బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ– ‘‘నా జీవితాన్ని కథగా రాస్తే ఎవరూ చదవరు. కాబట్టి సినిమా ద్వారా చెప్పాలనుకున్నాను. నేను ఎవరినీ మోసం చేయలేదు అని చెప్పాలనే నా 35 ఏళ్ల మనోవేదనకు ప్రతి రూపమే ఈ ‘బగ్గిడి గోపాల్’. త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి జమున, ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి మారెప్ప తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రావీణ్యత చాటేవారే నాయకులు
- కేంద్ర మంత్రి వెంకయ్య - లక్ష్మీప్రసాద్ ‘నాయక త్రయం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్: కేవలం రాజకీయ నాయకుడే నాయకుడు కాలేడని, ఒక రంగంలో ప్రావీణ్యతను చాటే ప్రతి ఒక్కరూ నాయకులవుతారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. భారత్‌లో తెలివైన వారికి కొదవ లేదని, ఆ తెలివితేటలకు కొంత సానపెడితే దేశం ఉజ్వలంగా వెలిగిపోతుందన్నారు. ఆదివారమిక్కడి ఓ హోటల్లో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘నాయక త్రయం’ పుస్తకాన్ని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యతో కలసి ఆయన ఆవిష్కరించారు. రచయితలకు సామాజిక స్పృహ ఉండాలని, రచనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని వెంకయ్య హితవు పలికారు. పత్రికలు, చానళ్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పుడు హెడ్డింగ్‌లు చేసి వదిలేసే ప్రక్రియ మొదలైందని, ఇది మంచిది కాదన్నారు. ఇటీవల ఎకనామిక్ టైమ్స్ పత్రికలో కె.ఎం.మున్షి, అశుతోష్ ముఖర్జీలు జనసంఘ్ నాయకులంటూ హెడ్డింగ్ పెట్టారన్నారు. వాస్తవానికి మున్షి కాంగ్రెస్ నేతని, కేంద్రమంత్రిగా పనిచేయడంతో పాటు భారతీయ విద్యాభవన్ సంస్థలను ప్రారంభించారని, ఆయన ఎప్పుడూ జనసంఘ్‌లో పనిచేయలేదన్నారు. అలాగే శ్యామప్రసాద్ ముఖర్జీ తండ్రి అశుతోష్ ముఖర్జీ 1924లోనే చనిపోయారని, 1952లో శ్యామప్రసాద్ జనసంఘ్ స్థాపించారన్నారు. ఇటీవల కొంతమంది పనిగట్టుకొని పరమతసహనం గురించి ఉపన్యసిస్తున్నారని, చిన్నచిన్న ఘటనలను భూతద్దంలో చూపిస్తూ దేశ ప్రతిష్ట దిగజారుస్తున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీలో లక్షలాది మంది జైళ్లలో మగ్గినప్పుడు, 1984లో వేలాది మంది సిక్కులు ఊచకోతకు గురైనప్పుడు వీళ్ల గొంతులు ఏమయ్యాయన్నారు. లక్ష్మీప్రసాద్ బహుభాషా కోవిదుడని కొనియాడారు. ఉత్తరాదివారితో పోటీపడటం అంత సులువు కాదని, అలాంటి తరుణంలో వారితో పోటీపడి ఆయన రెండు డాక్టరేట్లు, రెండు సాహితీ అకాడమీ అవార్డులు సాధించారన్నారు. ఈ పుస్తకంలో వాజ్‌పేయి, అద్వానీ, మోదీ చరిత్రలు ఉన్నాయని, వారి జీవితాలు రానున్న తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. వాజ్‌పేయి సిద్ధాంతాలకు రాజీపడకుండా నిలబడ్డారని, అద్వానీ మేరునగధీరుడని, మోదీ దేశ చరిత్రలో కొత్తగా ఉద్భవించిన నేత అని కొనియాడారు. నేటి ఎంపీలకు పార్లమెంటులో గ్రంథాలయం ఉందన్న విషయం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. రోజురోజుకు సాహిత్యం అందించే వారి సంఖ్య తగ్గిపోతోందని, సినారె తర్వాత ఎవరని ఊహించుకుంటేనే భయమేస్తుందన్నారు. సినీ నటుడు నాగార్జున, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, రచయిత కృష్ణారావు, ఎమెస్కో పబ్లిషర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.