జనాకర్షణలో, జనాభిప్రాయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీలో ముందంజలో ఉన్నారని, రాజకీయంగా ఆయన పరిస్థితి ప్రస్తుతం పుంజుకుందని సీనియర్ రాజకీయనేత, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు. అదేసమయంలో పాలన విషయంలో చంద్రబాబునాయుడికి పాస్ మార్కులు ఇవ్వొచ్చని, అయితే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా బాబు మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్, చంద్రబాబు పాలన రెండు పద్ధతుల్లో నడుస్తోంది కానీ వారి పాలన, వారి వ్యవహారం అందరికంటే ముందు ప్రజలకు నచ్చాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేస్తున్న భారీ అప్పు వాంఛనీయం కాదని, దాన్ని తిరిగి చెల్లించడం కష్టమని, ప్రజలకు ఇది భారమంటున్న రోశయ్య అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
సుదీర్ఘ రాజకీయ అనుభవం మీది. ఎలా ఉన్నారు?
ఆరోగ్యం బాగానే ఉంది. కాని జరుగుతున్న పరిణామాలు జీర్ణం కావటం లేదు. ఎందుకంటే మా రోజుల్లో ఒక నాయకుడు ఆయనను అనుసరించేవారు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అలాకాదు కదా. నాయకుల సంఖ్య ఎక్కువ అయిపోయింది. బాగా పెరిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా ఉంటుందనుకుంటున్నారు?
మా కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు కదా అంత ప్రజారంజకంగా లేదని. నేను ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినా ఆ భావజాలం ప్రభావం కొంత ఉంది.
యనమల రామకృష్ణుడు తీరు కానీ, చంద్రబాబు అప్పులు చేస్తున్న వైనంపై మీ అభిప్రాయం?
అవగాహన లేకుండా ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడపటం కష్టం. ఆర్థిక నిర్వహణకు సరైన అవగాహన ఉండాలి.
తెలంగాణలో లక్ష కోట్లు, ఏపీలో లక్షా పాతిక కోట్ల రూపాయల అప్పు పోగుపడింది కదా?
కాలం మారింది. విలువలు మారుతున్నాయి. అప్పుచేయడం గొప్పే. అప్పు అందరికీ పుట్టదు. కానీ నాకు అప్పు పుట్టింది అనుకునే వారున్నారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ భారీ అప్పులను తీర్చడం కష్టం. మళ్లీ ప్రజలనుంచే రాబట్టాలి.
చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల విలువైన బాండ్లను 10.37 శాతం వడ్డీకి తీసుకుంది కదా?
అది మంచి పద్థతి కాదు. వాంఛనీయం కాదు. రాష్ట్రానికి ఇది నష్టమే.
ఫిరాయింపుదార్లకు మంత్రిపదవులు ఇవ్వడం సరైందేనా?
నువ్వు వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని ప్రలోభ పెట్టడం సరైంది కాదు. కానీ అవి కూడా జరుగుతున్నాయి. స్పీకర్ సాక్షాత్తూ ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయవచ్చా? పాలాభిషేకం చేసిన విషయం నాకు తెలీదు. కానీ పార్టీ సమావేశాలకు మామూలు రోజుల్లో అయితే వెళ్లవచ్చు. కానీ ఇదివరకు అలా స్పీకర్లు ఎవరూ వెళ్లేవారు కాదు. వ్యక్తుల స్థాయిలో ఎవరైనా వెళ్లిన సందర్భాలున్నాయి.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే స్థితి ఉందా?
సీట్ల విషయంలో చెప్పలేను కానీ ఈసారి ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకునే అవకాశం అయితే ఉంది. కొంత మెరుగవుతుంది
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా?
చూడాలి. ఎన్నికల్లో ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారో, ఎవరు పోటీ చేస్తారో చూస్తే గాని చెప్పలేం.
ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ఉంటుంది?
అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఏదోమేరకు ప్రజా వ్యతిరేకత ఉంటుంది.
బాబు పాలనకు మీరెన్ని మార్కులు ఇస్తారు?
పాస్ మార్కులు ఇవ్వొచ్చు. అంటే 30 శాతం మార్కులు వేయవచ్చు. అయితే మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాడా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేం కదా.
వైఎస్ జగన్‌కు ఎన్ని మార్కులు వేస్తారు?
జగన్ పరిస్థితి బాగానే ఉంది. ఎన్ని మార్కులు అని చెప్పలేను కానీ అతడి భవిష్యత్తు మాత్రం ముందంజలోనే ఉంది.
వైఎస్‌తో మీకున్న అనుబంధం ఏమిటి?
రాజశేఖరరెడ్డి చాలా మంచి స్నేహితుడు. నేను దేనిపైనైనా విభేదిస్తే అందరిముందరా లేక ప్రెస్ ముందర చెప్పేవాడిని కాదు. విడిగా కలిసి తనతో మాట్లాడేవాడిని. ఆయన వాటిని చక్కగా రిసీవ్ చేసుకునేవారు.
అలిపిరి ఘటనలో చంద్రబాబు గాయంపై మీరు అప్పట్లో వ్యంగ్యాస్త్రాలు సందించారు కదా?
అవును. ఒక చేతికి కట్టుకోవలిసింది మరోచేతికి కట్టు కట్టించుకున్నాడు. ఆ విషయం మీలాంటి స్నేహితుడు ఒకరు చెబితే దాన్ని మనసులో పెట్టుకుని విమర్శ చేశాను. ‘ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఆయనకు సరైన వైద్యం చేసేవాళ్లు కనబడటం లేదు’ అని విమర్శించాను. తర్వాత బాబు అర్థం చేసుకుని ఆ కట్టే లేకుండా తీయించుకున్నాడు.
చంద్రబాబు కొండెత్తమంటాడు అనే విమర్శ కూడా చేశారు కదా మీరు?
హామీలు ఇచ్చేటప్పుడు అంతులేకుండా భారంతో కూడిన హామీలు ఇచ్చేవాడు. వాటిని పూర్తి చేయాలంటే మీరంతా తలా ఒక చేయి వేసి ఎత్తితే కదా అనే సందర్భంలో ‘కొండెత్తు’ అనే మాట వాడాను.
విభజన చేసి కూడా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మునిగిపోవడంపై మీ అభిప్రాయం?
సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం. ఏ నిర్ణయంలో అయినా సరే ఆలస్యంగా నిర్ణయం చేశారు. రాష్ట్రం వైపు నుంచి విభజనకు సంబంధించిన సమాచారం కూడా సకాలంలో ఇవ్వలేదు. అలా నష్టం జరిగింది. అయితే ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఇక్కడ కూర్చొని మనం తేల్చలేం. విభజనతో మునిగిపోతాం అని మా వంతుగా చెప్పాల్సింది చెప్పాం. కాని సోనియా తన నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వస్తుందని మీరెన్నడైనా ఊహించారా?
ఊహించలేదు. కానీ పరిస్థితులు అలా దారితీశాయి. అయితే కాంగ్రెస్ ఏపీలో కోలుకోవడానికి మళ్లీ అవకాశముంది. ఏ పార్టీ అయినా నిండా మునగదు కదా.
కేసీఆర్, చంద్రబాబు ఇద్దరి పాలన ఎలా ఉంది?
రెండూ రెండు పద్ధతులు. వారి పాలన నాకు బాగుండటం కాదు. వారి పాలన, వారి వ్యవహారం అంతిమంగా ప్రజలకు బాగుండాలి కదా.
(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
http:// bit. do/ exZiv
http:// bit. do/ exZiH
Comments
Please login to add a commentAdd a comment