దొరకని దొంగ చంద్రబాబు | KSR Live Show With Motkupalli Narasimhulu | Sakshi
Sakshi News home page

కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు

Published Wed, Jul 25 2018 2:34 AM | Last Updated on Wed, Jul 25 2018 2:35 AM

KSR Live Show With Motkupalli Narasimhulu - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నమ్మకద్రోహి అనే అభిప్రాయం బలపడిపోయిందని, 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ చేతిలో టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం నూటికి రెండువందల శాతం ఖాయమని టీడీపీ మాజీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తేల్చి చెప్పారు. ఆంధ్ర ప్రజల హృదయాల్లో చంద్రబాబుకు స్థానం లేకుండా పోయిందని, ఎన్టీఆర్‌ తాను చనిపోయేముందు బాబు మోసగాడు, నమ్మొద్దు అని ఎలాగయితే చెప్పారో అది ఇవ్వాళ కూడా ఏపీలో నిజం కాబోతోందని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లోనే దొరకని దొంగ చంద్రబాబే అంటున్న నరసింహులు అభిప్రాయం ఆయన మాటల్లోనే...

తెలంగాణకు బాబు మద్దతు నేపథ్యం ఏమిటి?
2004లో 2009లో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయింది. 2009 నాటికి తెలంగాణ ఉద్యమం బలం పుంజు కుంది. దాన్ని గ్రహించే బాబు తెలంగాణ ట్రంప్‌ కార్డు తీశారు. తెలంగాణపై మీరు తీర్మానం పెట్టండి నేను సపోర్టు చేస్తాను. తీర్మానం చేసే దమ్ము మీకుందా అని బాబు కాంగ్రెస్‌ నాయకత్వానికి సవాల్‌ చేశాడు. బాబు ఇలా దమ్ముందా అని ఎప్పుడైతే సవాల్‌ చేశాడో సోనియాగాంధీ అదే అదునుగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పించేసింది. కానీ లోపల మాత్రం తెలంగాణ రాదని బాబుకు బలంగా ఉండేది. మనమెన్ని సవాళ్లు చేసినా వాళ్లు తెలంగాణ ఇవ్వడం జరిగేది కాదని బాబు నమ్మకం. తెలంగాణ ఎక్కడొస్తుంది, కానీ మనం పార్టీపరంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిం చాలి అని బాబు చెబుతుండేవాడు. కానీ సోనియా అక్కడ ప్రకటించగానే ఒక్కసారిగా బాబు యూటర్న్‌ తీసుకున్నాడు.

ఇదెలా ఇస్తారు మధ్యరాత్రి ఎలా ఇస్తారు అంటూ రివర్స్‌ అయ్యాడు కాబట్టే తెలంగాణ ఉద్యమం మొత్తంగా బాబు వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది. టీడీపీ వ్యతిరేక ఉద్యమమే తెలం గాణ ఉద్యమం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వమని టీడీపీ డిమాండ్‌ చేసినా జనం నమ్మలేదు. బాబు వైఖరి గమనించే టీడీపీ ప్రభుత్వంలో గతంలో పనిచేసిన ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మేల్యే కానీ, నాయకులు కాని తెలంగాణ ఉద్యమకాలంలో బాబు దరిదాపుల్లోకి కూడా ఎవరూ పోలేదు.

బాబే స్వయంగా నాతో చెప్పాడు. తెలంగాణలో ఏ ఒక్క టీడీపీ నేతా నావద్దకు రాలేదు చూశావా నర్సింహులూ అని బాధపడ్డాడు బాబు. దానికి నేను ఒకే మాట చెప్పా. ‘బయట మిమ్మల్ని ఎవరూ నమ్మలేదండి’ అనేశాను. ఆత్మను అమ్ముకుని బతికే దొంగ బాబు. తనను నమ్మకండి అని ఎన్టీఆరే చివరిదశలో లోకానికి చెప్పారు. అందుకే బాబు ముందు డేర్‌గా అనేశాను. మిమ్మల్ని ఎవరూ నమ్మటం లేదు. ఒకవేళ నమ్మటం అంటూ జరిగితే వారి గొంతు కోసేంతవరకు మీరు ఊరుకోరు అని కూడా అనేశాను. బాబు మాట ఇస్తే నిలబడతాడు అనే విశ్వసనీయతను నా విషయంలో కూడా కోల్పోయాడు. నా విషయంలో బాబు చేసిందానికి నష్టం నాకు కాదు, బాబు విశ్వసనీయతే గంగలో కలిసింది.

ఓటుకు కోట్లు కేసులో బాబు పాత్ర?
బాబులో ఏమూలైనా విశ్వసనీయత అనేది ఉండి ఉంటే ఓటుకు కోట్లు కేసుతో అది పూర్తిగా పోయింది. ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తారా, డబ్బులతో కొంటారా, ఇంత అన్యాయమా అని బాబును సామాన్యుడి నుంచి మేధావుల దాకా అందరూ ఏవగించుకున్నారు. ఆ ఘటనలో టీడీపీ పరువు మొత్తం పోయింది. ఏంపీలు, ఎమ్మెల్యేలు, కేడర్, ప్రజలు బాబు నిర్వాకంపై దుమ్మెత్తి పోశారు. అంత నిరనస, వ్యతిరేకత వచ్చింది కాబట్టే దొంగలాగా ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయాడు.

తెలంగాణలో ఏ ఒక్కరికీ అంటే నాయకులకూ, కేడరుకు, ప్రజలకు చెప్పకుండా అమరావతికి పారిపోయాడు. పైగా మోదీ దగ్గరకు పరుగెత్తాడు. తిరుపతి లడ్డు, శాలువా పట్టుకెళ్లి కప్పి కాపాడు అంటూ మోదీ కాళ్లమీద పడ్డాడు. బ్రహ్మదేవుడు కూడా నిన్నిక కాపాడలేడు బాబూ అని కేసీఆర్‌ ఎప్పుడయితే దేవరకొండలో ప్రకటించాడో అప్పుడే బాబులో భయం పట్టుకుంది. రక్షకుడు మోదీనే అని ఢిల్లీ పరుగెత్తాడు. ఆ తర్వాత తప్పయిపోయిందని కేసీఆర్‌ ముందు సాగిలబడితే అప్పుడు కేసీఆర్‌ క్షమించాడు. ఇదీ బాబు బతుకు. ఓటుకు కోట్లు కేసుతో నా జీవితంలో రెండు రాత్రులు నిద్రపోలేదు అని బాబు పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పిన మాటలు మీడియాలోనూ వచ్చేశాయి. 

బాబును చివరిదాకా మీరు సమర్థిస్తూ వచ్చారే?
దొంగయినా, లంగయనా ఒక పార్టీలో ఉన్నప్పుడు నాయకుడిని ఎంతో కొంత కాపాడాలి కదా. అందుకే ప్రెస్‌ కాన్ఫరెన్సులు బంద్‌ చేశాను. ఇక రేవంత్‌ కేసు విషయంలో బాబునే నేరుగా అడిగేశాను. తప్పో రైటో కానివ్వండి. ఆ వాయిస్‌ మీదే కదా.. మా అభ్యర్థి గెలవాలి. అందుకే అలా మాట్లాడాను. తప్పేముంది, ఆ వాయిస్‌ నాదే అని చెప్పి ఉంటే బాగుం డేది కదా అని అడిగాను. ‘నాదే అని చెబితే వేరే పరిణామాలు ఉంటాయి నరసింహులూ’ అన్నాడు బాబు. తప్పు రేవంత్‌ రెడ్డిది మాత్రమే అయితే బాబు మరుక్షణంలో రేవంత్‌ను సస్పెండ్‌ చేసేవాడు. కానీ ఈయన కూడా దాంట్లో భాగస్వామి కాబట్టి కిమ్మనకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత తెలంగాణ కాబోయే సీఎంగా రేవంత్‌ని పైకి లేపాడు బాబు.

మా పార్టీ మొత్తానికి అదే మెసేజ్‌ వెళ్లిపోయింది. రేవంత్‌ ఓటుకు కోట్లకేసులో ఎక్కడ అప్రూవర్‌ అయిపోతాడేమో అనే భయంతో బాబు రేవంత్‌కి లొంగిపోయాడు. రేవంత్‌ స్టీఫెన్సన్‌ ముందర డబ్బు పేరుస్తూ మా బాస్‌ అనే మాట ప్రస్తావించాడు కదా. ఎవరండీ ఆ బాస్‌. బాబు కాదా. ఈరోజుకీ లోకేశ్‌ పొద్దున నిద్రలేచింది మొదలు పదిసార్లు రేవంత్‌ రెడ్డికి పోన్‌ చేస్తాడు. ఇక బాబు ఏదో ఒక సందర్భంలో రేవంత్‌ రెడ్డితో మాట్లాడుతున్నాడు ఇప్పటికీ. ఈ కేసును పైకి తీస్తే ఏమవుతుందో, రేవంత్‌ ఏం మాట్లాడతాడో అనే భయం ఇప్పటికీ బాబును వెంటాడుతోంది.

ఈసారి ఏపీలో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు?
ఆంధ్రప్రజలకు నిజంగా ఏమాత్రం అలోచన ఉన్నా, చంద్రబాబును వచ్చే  ఎన్నికల్లో తరిమికొట్టాలి. ఊర్లలోకి రానీయవద్దు. నాలుగేళ్లు బీజేపీ  పార్టీతో అంట కాగిన బాబు ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం  బీజేపీ అంటున్నాడు. ప్రత్యేకహోదా వద్దు అన్న బాబుకు ఇవాళ ప్రత్యేకహోదా గురించి మాట్లాడే హక్కే లేదు. పైగా బాబు సీఎంగా  ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేకహోదా రాదు. ఏపీ ప్రజలే  తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. ప్రత్యేకహోదా తీసుకొచ్చే దమ్ము వైఎస్‌ జగన్‌కి మాత్రమే ఉంది. 
(ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2AdOL2a
https://bit.ly/2Oa7hLU

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement