సాక్షి, అమరావతి : నాకు వైఎస్సార్ అంటే ప్రాణం. మా ఆదివాసీల పట్ల ఆయన చూపిన ఆదరణ, అప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేం. మాకోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశారు. పక్కా ఇళ్లు, పింఛన్లు, మోడల్ కాలనీలు, తాగునీటి పథకాలు, లక్షల ఎకరాల భూ పంపిణీతో పాటు విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేద గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందింది. ఇప్పుడు ఆ రాజన్న రాజ్యం స్థాపన కోసం ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం నన్ను కదిలించింది.
అందుకే వైఎస్సార్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి, గిరిజనులకు న్యాయం జరుగుతుందని భావించి ఆ పార్టీలో చేరాను. ఎమ్మెల్యేగా పనిచేసిన మా నాన్నను చిన్నప్పటి దగ్గర్నుంచి చూసిన నాకు ఎప్పటికైనా ఆయనలా ప్రజాసేవ చేయాలని అనుకునేదాన్ని. జగనన్నతో నా కల నిజమైంది. నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నిత్యం ఆదివాసీలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నీ పరిష్కరిస్తాను’ అని పాడేరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాక్షితో తన మనసులో మాటను బయటపెట్టారు.
వైఎస్ మరణం.. గిరిజనులకు శాపం
వైఎస్ హయాంలో నేను ట్రైఫాడ్ వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశాను. మా తండ్రి దివంగత కొట్టగుల్లి చిట్టినాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. పాడేరులో ఆర్టీసీ డిపో, కాంప్లెక్స్ ఏర్పాటు, 50 పడకల ఆస్పత్రి, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు శ్రమించారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళు గడిచినా మా గిరిజనులకు పూర్తి స్థాయిలో సంక్షేమం అందలేదు.
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో మాత్రమే అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. ఆయన మరణాంతరం ఆదివాసీల సంక్షేమాన్ని టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కనీసం ఒక పూట కూడా పోషకాహారం అందక అత్యంత దయనీయ స్థితిలో ఆదివాసీలు జీవిస్తున్నారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్ళలేక దేవుడి మీద భారం వేస్తున్నారు.
నేను వైఎస్సార్‌సీపీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాను. ప్రధానంగా విద్య, వైద్యం, సురక్షిత తాగునీరు, రోడ్లు, అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలు గుర్తించాను.
స్వలాభం కోసమే గిడ్డి ఈశ్వరీ పార్టీ ఫిరాయింపు
ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రభుత్వం ఆదివాసీలపై పూర్తి నిర్లక్ష్యం చూపింది. గిరిజనులంతా జగనన్న వెంట ఉన్నారనే కక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు మా సంక్షేమాన్ని విస్మరించారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఆదివాసీల్ని అడవికి నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో బాక్సైట్ తవ్వకాలకు పూనుకున్నారు. జీవో 97తో ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేశారు.
ఆదివాసీలతో కలిసి వైఎస్సార్‌సీపీ పోరాటం వల్ల బాక్సైట్ తవ్వకాలకు అడ్డుకట్టపడింది. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన స్వలాభం కోసం టీడీపీలోకి ఫిరాయించారు. తనకు అనుకూలమైన వారికి సబ్సిడీ రుణాలు, ట్రైకార్ పథకం ద్వారా వాహనాలు కేటాయించుకున్నారు. దీంతో టీడీపీ పట్ల, స్థానిక అభ్యర్ధి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
జగనన్నతోనే ...రాజన్న రాజ్యం
ఆదివాసీలు తమకు మేలు చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోరు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంకా వారి మనస్సులో అలాగే ఉన్నాయి. జగనన్న సీఎం అయితేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందని ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగనన్న చేస్తున్న పోరాటానికి గిరిజనులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, టీడీపీపై వ్యతిరేకత కూడా నాకు కలిసి వస్తుందని నమ్ముతున్నాను.
పార్టీ శ్రేణులు, గిరిజనులంతా పాడేరు ఎమ్మెల్యే స్థానాన్ని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని శ్రమిస్తున్నాం. టీడీపీ పాలనతో పాడేరు నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నమ్మకద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ఇబ్బందులు పడేందుకు ఇక్కడి ప్రజలు సిద్దంగా లేరు. వారి జీవితాల్లో మార్పునకు ఇదే సరైన అవకాశం. నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి మార్పునకు పట్టం కడతారని గట్టి నమ్మకముంది.
Comments
Please login to add a commentAdd a comment