paderu constituency
-
నా రాజకీయ ప్రయాణం జగనన్నతోనే..
సాక్షి,పాడేరు: ‘న్యాయవాది వృత్తిలో ఉన్న నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన్ను మోసం చేస్తే నాకు పుట్టగతులుండవు’ అని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. సోమవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగనన్న రాజకీయ భిక్షతో గెలిచిన తన రాజకీయ ప్రయాణం చివరి వరకు ఆయనతోనేనన్నారు. పార్టీ మారుతున్నాననే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. వైఎస్ జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో తనను గెలిపించిన పాడేరు నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తానని, కొంతమందిలా తాను రూ.కోట్లకు అమ్ముడుపోయే రాజకీయ నాయకుడిని కాదన్నారు. 2029లో వైఎస్సార్సీపీదే అధికారమని, జగన్‌ను సీఎంగా చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు సురే‹Ùకుమార్, కిల్లు కోటిబాబునాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్మదర్శి సీదరి మంగ్లన్నదొర, పార్టీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పలు పంచాయతీల సర్పంచ్‌లు వంతాల రాంబాబు, బసవన్నదొర, మాజీ సర్పంచ్‌లు పాంగి సత్తిబాబు, శరభ సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు డీపీ రాంబాబు పాల్గొన్నారు. -
ఆయన పోరాటం నన్ను కదిలించింది
సాక్షి, అమరావతి : నాకు వైఎస్సార్ అంటే ప్రాణం. మా ఆదివాసీల పట్ల ఆయన చూపిన ఆదరణ, అప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేం. మాకోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశారు. పక్కా ఇళ్లు, పింఛన్లు, మోడల్ కాలనీలు, తాగునీటి పథకాలు, లక్షల ఎకరాల భూ పంపిణీతో పాటు విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేద గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందింది. ఇప్పుడు ఆ రాజన్న రాజ్యం స్థాపన కోసం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం నన్ను కదిలించింది. అందుకే వైఎస్సార్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి, గిరిజనులకు న్యాయం జరుగుతుందని భావించి ఆ పార్టీలో చేరాను. ఎమ్మెల్యేగా పనిచేసిన మా నాన్నను చిన్నప్పటి దగ్గర్నుంచి చూసిన నాకు ఎప్పటికైనా ఆయనలా ప్రజాసేవ చేయాలని అనుకునేదాన్ని. జగనన్నతో నా కల నిజమైంది. నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నిత్యం ఆదివాసీలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నీ పరిష్కరిస్తాను’ అని పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాక్షితో తన మనసులో మాటను బయటపెట్టారు. వైఎస్ మరణం.. గిరిజనులకు శాపం వైఎస్ హయాంలో నేను ట్రైఫాడ్ వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశాను. మా తండ్రి దివంగత కొట్టగుల్లి చిట్టినాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. పాడేరులో ఆర్టీసీ డిపో, కాంప్లెక్స్ ఏర్పాటు, 50 పడకల ఆస్పత్రి, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు శ్రమించారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళు గడిచినా మా గిరిజనులకు పూర్తి స్థాయిలో సంక్షేమం అందలేదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో మాత్రమే అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. ఆయన మరణాంతరం ఆదివాసీల సంక్షేమాన్ని టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కనీసం ఒక పూట కూడా పోషకాహారం అందక అత్యంత దయనీయ స్థితిలో ఆదివాసీలు జీవిస్తున్నారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్ళలేక దేవుడి మీద భారం వేస్తున్నారు. నేను వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాను. ప్రధానంగా విద్య, వైద్యం, సురక్షిత తాగునీరు, రోడ్లు, అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలు గుర్తించాను. స్వలాభం కోసమే గిడ్డి ఈశ్వరీ పార్టీ ఫిరాయింపు ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రభుత్వం ఆదివాసీలపై పూర్తి నిర్లక్ష్యం చూపింది. గిరిజనులంతా జగనన్న వెంట ఉన్నారనే కక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు మా సంక్షేమాన్ని విస్మరించారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఆదివాసీల్ని అడవికి నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో బాక్సైట్ తవ్వకాలకు పూనుకున్నారు. జీవో 97తో ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఆదివాసీలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం వల్ల బాక్సైట్ తవ్వకాలకు అడ్డుకట్టపడింది. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన స్వలాభం కోసం టీడీపీలోకి ఫిరాయించారు. తనకు అనుకూలమైన వారికి సబ్సిడీ రుణాలు, ట్రైకార్ పథకం ద్వారా వాహనాలు కేటాయించుకున్నారు. దీంతో టీడీపీ పట్ల, స్థానిక అభ్యర్ధి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగనన్నతోనే ...రాజన్న రాజ్యం ఆదివాసీలు తమకు మేలు చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోరు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంకా వారి మనస్సులో అలాగే ఉన్నాయి. జగనన్న సీఎం అయితేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందని ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగనన్న చేస్తున్న పోరాటానికి గిరిజనులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, టీడీపీపై వ్యతిరేకత కూడా నాకు కలిసి వస్తుందని నమ్ముతున్నాను. పార్టీ శ్రేణులు, గిరిజనులంతా పాడేరు ఎమ్మెల్యే స్థానాన్ని వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని శ్రమిస్తున్నాం. టీడీపీ పాలనతో పాడేరు నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నమ్మకద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ఇబ్బందులు పడేందుకు ఇక్కడి ప్రజలు సిద్దంగా లేరు. వారి జీవితాల్లో మార్పునకు ఇదే సరైన అవకాశం. నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి మార్పునకు పట్టం కడతారని గట్టి నమ్మకముంది. -
ఈశ్వరి విలవిల!
విశాఖపట్నం, పాడేరు: పాడేరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో నెగ్గుకు రావడానికి చేస్తున్న వ్యూహాలు, ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అటు టీడీపీలో అసమ్మతితో పాటు వైఎస్సార్సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించడంతో ప్రజల నుంచి అడుగడుగునా ఎదురవుతున్న నిలదీతలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 22న టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమానికి జనం రాకపోవడంతోనే ఆమెలో ఆందోళన నెలకొంది. 23న పాడేరులో జరిగిన వైఎస్ఆర్సీపీ అదినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభ విజయవంతం కావడంతో ఈశ్వరి గుండెల్లో దడ ప్రారంభమైంది. జగన్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున తరలి తరలిరావడంతో పాడేరు జనప్రభంజనంగా మారింది. దీంతో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలమేంటో మరోసారి రుజువైంది. ఈశ్వరితో పాటు టీడీపీ వర్గాల్లో ఆ రోజే కలవరం మొదలైంది. దీనికి తోడు టీడీపీ నాయకుల మధ్య వర్గవిభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అసమ్మతి వర్గాలు కలిసే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ సీనియర్లంతా గిడ్డి ఈశ్వరికి ముఖం చాటేస్తున్నారు. మండల స్థాయి కేడర్ కూడా కలిసి రావడం లేదు. వైఎస్సార్సీపీలోని అసమ్మతి వర్గాలను తన వైపు తిప్పుకోవచ్చుననే ఈశ్వరి వ్యూహాలు సైతం బెడిసికొట్టాయి. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి అక్రమాలకు పాల్పడ్డారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆమె అడ్డదారులు తొక్కా రు. తమ బంధువర్గానికి, అనుచర వర్గానికి ప్రాధాన్యమిచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో నియామకాలు చేశారు. కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో ప్రత్యేకాధికారులు, ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ నియామకాలు, అక్రమ డిప్యుటేషన్లు తమ వారికి ప్రాధాన్యం ఇప్పించి రాజకీయ లబ్ధి పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ పథకాల కేటాయింపుల్లో అయినవారికే ప్రాధాన్యమిచ్చారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించడం కోసం అమలు చేస్తున్న నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబుల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్టీఎఫ్డీసీ) పథకం ద్వారా ఇన్నోవా, బొలేరో వాహనాల్ని తమకు నచ్చిన వారికే ఈశ్వరి ఇప్పించుకున్నారు. నిజమైన లబ్ధిదారులకు మొండిచేయి చూపించారు. నిబంధనలకు తూట్లు పొడిచి తాను సూచించిన 16 మందికి ఈ వాహనాల్ని గుట్టుచప్పుడుగా పంపిణీ చేశారు. రాజకీయ దురుద్దేశంతో బినామీ పేర్లతో గిరిజనేతరులకు కూడా ఈ వాహనాలు ఇప్పించారు. లబ్ధిదారుల ఎంపికను ఏకపక్షంగా నిర్వహించడంపై గిరిజనల్లో తీవ్ర నిరసన నెలకొంది. వెంటాడుతున్న అసమ్మతి రాగం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. ఏడాది కిందట వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన ఈశ్వరి అభ్యర్థిత్వం పట్ల టీడీపీలోని సీనియర్ నేతలు, మండల స్థాయి పార్టీ శ్రేణుల్లో అసమ్మతి నెలకొంది. పాడేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, కొయ్యూరుకు చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ తనయుడు ఎంవీవీ ప్రసాద్, పాడేరుకు చెందిన మరో సీనియర్ నేత టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు టికెట్ ఆశించి భంగపడ్డారు. 3 దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకుని ఆ పార్టీలో కొనసాగుతున్న సీనియర్లకు పార్టీ అధినేత కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణల్లో తీవ్ర అసమ్మతి నెలకొంది. అసమ్మతి నేతల్ని కలుపుకుని వెళ్లే పరిస్థితి టీడీపీ అభ్యర్థికి కనబడటం లేదు. వైఎస్సార్సీపీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించి.. ఆ తరువాత పార్టీ ఫిరాయించిన ఈశ్వరికి ఎట్టి పరిస్థితిలో కూడా సహకరించేదిలేదని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తుండడంతో ఆమె కలవరపడుతున్నారు. -
అక్కడ అసమ్మతి రాగం, ఇక్కడ ఆత్మవిశ్వాసం
సాక్షి, పాడేరు: సార్వత్రిక ఎన్నికల తేదీని ప్రకటించడంతో పాడేరు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. 2019 ఎన్నికల బరిలో నిలిచేందుకు వైఎస్సార్ సీపీ,టీడీపీ బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి గిరిజన సంక్షేమ మంత్రి పదవిని కూడా నిర్వహించిన పసుపులేటి బాలరాజు 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి అనూహ్యంగా జనసేన పార్టీలో చేరి పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేం దుకు సిద్ధం కావడం తాజా పరిణామం. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఈ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లోకులగాంధీ ఈ సారి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం బీజేపీ సీనియర్ నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, నందోలి ఉమామహేష్ కూడా దరఖాస్తు చేశారు. మాజీ మంత్రి బాలరాజు కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరిన నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఇందులో ముఖ్యంగా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చెందిన తమర్భ కృష్ణవేణి, సీదరి మంగ్లన్నదొరతో పాటు మరో సీనియర్ నాయకుడు స్వాముల సుబ్రహ్మణ్యం పాడేరు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసి బరిలో దిగేందుకు నిరీక్షిస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరా యించిన సిటింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేరును పాడేరు టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. గానీ అధికారికంగా ప్రకటించలేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఖరారు చేయవలసి ఉంది. రాజకీయ ముఖచిత్రం : నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభంజనం సృష్టించిన వైఎస్సార్సీపీదే నియోజకవర్గంలో పైచేయిగా ఉంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లోనూ బూత్‌స్థాయిలో ఈ పార్టీ బలోపేతంగా ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 26వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన గిడ్డి ఈశ్వరి పార్టీఫిరాయించిటీడీపీలో చేరి నప్పటికి కేడర్ పార్టీకి దూరం కాలేదు. ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల్లో వైఎస్సార్సీపీ కేడర్ విస్తరించి ఉంది. 15 ఏళ్ల తర్వాత టీడీపీ పోటీ : పాడేరు నియోజకవర్గంలో 15ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని బరిలో దింపుతోంది. 2009లో నియోజకవర్గం పునర్విభజన తర్వాత కూడా పాడేరు నుంచి టీడీపీ అసెంబ్లీకి ఇప్పుడే పోటీ చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆరుసార్లు పోటీ చేయగా మూడుసార్లు గెలుపు, మూడు సార్లు ఓటమి చెందారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత పాడేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు వరుసగా 1983, 1989, 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందగా 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో సీపీఐ పొత్తుతోను, 2014లో బీజేపీతో పొత్తుతోను టీడీపీ ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో గత 15 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థులు బరిలో లేకపోవడంతో నియోజకవర్గంలో ఈ పార్టీ బలహీనపడింది. ఫిరాయింపు ఎమ్మెల్యేతో మరింత అసమ్మతి : వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలోని నియోజకవర్గ ముఖ్య నేతల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారితో పాటు నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిలుగా ఉన్న సీనియర్ నాయకులు బొర్రా నాగరాజు, ప్రస్తుత జీసీసీ చైర్మన్ ఎంవీవీఎస్ ప్రసాద్ కూడా పాడేరు టీడీపీ టికెట్‌ను ఆశించారు. దీంతో ఈ ముగ్గురు సీనియర్లు అధి ష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో కూడా సీపీఐ, బీజేపీ పొత్తుతో సీట్లు దక్కక నిరాశతో ఉన్న ఈ నేతలకు ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మూలంగా భంగపాటు తప్పలేదు. సీటు దక్కకపోవడంతో నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు వద్ద, మంత్రుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో అలకపాన్పు ఎక్కారు. అలాగే మరికొందరు సీనియర్ నేతలు కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలో చేరి సాధించిన అభివృద్ధి ఏమి లేకపోగా, పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో టీడీపీ అభ్యర్థి పరిస్థితి అయోమయంగా ఉంది. జనసేన పార్టీ అభ్యర్ధి పసుపులేటి బాలరాజుకు పవన్ కళ్యాణ్ అభిమానులు తప్ప నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్మాణాత్మకంగా విస్తరించకపోవడం ప్రతీకూల అంశంగా ఉంది. మిత్రపక్షమైన సీపీఐ మద్దతుతో నెగ్గుకు రావచ్చునని బాలరాజు బరిలో నిలిచారు. ప్రధాని మోదీ ప్రధాన ఆకర్షణగా బీజేపీ నేతలు కేంద్రప్రభుత్వ పథకాల్ని ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి ఆ పార్టీ నేతల్లో ఉన్న అసమ్మతి, సామాజిక వర్గంలో తగ్గిన ఆదరణ, పార్టీ ఫిరాయింపు వల్ల ఓటర్లలో ఏర్పడిన వ్యతిరేకత, అభివృద్ధిలో వివక్ష ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ప్రధానపార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోరు సాగనుంది. -
మాట ఇచ్చా...మళ్లీ వచ్చా...!!
ఓట్ల కోసం వచ్చి అవసరం తీరాక ప్రజలకు మొహం చాటేసే నేతలను ఇన్నాళ్లూ చూసిన ఆ గ్రామస్తులు ఈ కొత్త ఎమ్మెల్యే సాహసం చూసి అబ్బుపడ్డారు. తమ కోసం వాగులు వంకలు, కొండలు గుట్టలు దాటుకుని వచ్చిన తమ ఆడ బిడ్డను చూసి ఆనంద పరవశులై అక్కున చేర్చుకున్నారు. సీలేరు,న్యూస్‌లైన్ : పాడేరు నియోజకవర్గంలో కాకు లు దూరని కారడవి, అడుగు తీసి అడుగు వేయాలంటే ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని ప్రాంతాలవి. గత ఇరవయ్యేళ్లుగా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అటువైపు చూసిన దాఖలాల్లేవు. కనీసం తహశీల్దార్ కూడా వెళ్ళిన చరిత్ర లేదు. నిత్యం మావోయిస్టులు, పోలీసుల మధ్య అక్కడి జనం నలిగిపోతుంటారు. గుమ్మిరేవుల పంచాయతీ 25 గ్రామాల్లో 20 వేలకు పైగా ఓటర్లున్నాయి. ఆ పల్లెలను అభివృద్ధి చేస్తామన్న మాటలు నమ్మి ఇదివరకు నలుగుర్ని ఎమ్మెల్యేలుగా గెలిపించినా ఆ తరువాత వారు మొహం చాటేశారు. అయితే తాజాగా వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే ఈశ్వరి మాత్రం ఆ పంచాయతీలకు వెళ్లారు. సుమారు 30 కిలోమీటర్ల గతుకులు, గంతల రహదారి గుండా అటు ఇటు ఆరు గంటలు ప్రయాణించారు. ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు వెళ్లి అక్కడి ప్రజలకు కలిశానని ఆమె చెప్పారు. ఒక మహిళా ఎమ్మెల్యే తమ గ్రామంలో పర్యటించడం ఇదే మొదటిసారని చెప్పిన అక్కడి జనం ఆమె కోసం పరుగుపరుగున వచ్చి అక్కున చేర్చుకున్నారు. 6 గంటలు ఉత్కంఠ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గిడ్డి ఈశ్వరి ఎలాంటి భయం లేకుండా మావోయిస్టుల కోటలోకి అడుగిడారు. దారిలో పెద్ద పెద్ద గోతులున్నా భయపడకుండా అవసరమైన చోట కాలినడకన వెళ్లారు. ప్రతి గ్రామంలోనూ గిరిజనులను పేరుపేరుగా పలకరిస్తూ ముందుకు సాగారు. సాయంత్రం 4 నుంచి 11 వరకూ ఆమె పర్యటన సాగింది. ఆమె వెంట జీకేవీధి, చింతపల్లి, పాడేరు జెడ్పీటీసీలు అందరూ మహిళలే కావడం విశేషం. వీరంతా ఆ గ్రామాలకు ధైర్యంగా వెళ్ళారు. ఆమె వెంట పలువురు జడ్పీటీసీలు, కర్యకర్తలు ఉన్నారు.