విశాఖపట్నం, పాడేరు: పాడేరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో నెగ్గుకు రావడానికి చేస్తున్న వ్యూహాలు, ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అటు టీడీపీలో అసమ్మతితో పాటు వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించడంతో ప్రజల నుంచి అడుగడుగునా ఎదురవుతున్న నిలదీతలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 22న టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమానికి జనం రాకపోవడంతోనే ఆమెలో ఆందోళన నెలకొంది. 23న పాడేరులో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ అదినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ విజయవంతం కావడంతో ఈశ్వరి గుండెల్లో దడ ప్రారంభమైంది. జగన్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున తరలి తరలిరావడంతో పాడేరు జనప్రభంజనంగా మారింది. దీంతో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలమేంటో మరోసారి రుజువైంది. ఈశ్వరితో పాటు టీడీపీ వర్గాల్లో ఆ రోజే కలవరం మొదలైంది. దీనికి తోడు టీడీపీ నాయకుల మధ్య వర్గవిభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అసమ్మతి వర్గాలు కలిసే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ సీనియర్లంతా గిడ్డి ఈశ్వరికి ముఖం చాటేస్తున్నారు. మండల స్థాయి కేడర్ కూడా కలిసి రావడం లేదు. వైఎస్సార్‌సీపీలోని అసమ్మతి వర్గాలను తన వైపు తిప్పుకోవచ్చుననే ఈశ్వరి వ్యూహాలు సైతం బెడిసికొట్టాయి.
ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు
పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి అక్రమాలకు పాల్పడ్డారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆమె అడ్డదారులు తొక్కా రు. తమ బంధువర్గానికి, అనుచర వర్గానికి ప్రాధాన్యమిచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో నియామకాలు చేశారు. కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో ప్రత్యేకాధికారులు, ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ నియామకాలు, అక్రమ డిప్యుటేషన్లు తమ వారికి ప్రాధాన్యం ఇప్పించి రాజకీయ లబ్ధి పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ పథకాల కేటాయింపుల్లో అయినవారికే ప్రాధాన్యమిచ్చారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించడం కోసం అమలు చేస్తున్న నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబుల్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ) పథకం ద్వారా ఇన్నోవా, బొలేరో వాహనాల్ని తమకు నచ్చిన వారికే ఈశ్వరి ఇప్పించుకున్నారు. నిజమైన లబ్ధిదారులకు మొండిచేయి చూపించారు. నిబంధనలకు తూట్లు పొడిచి తాను సూచించిన 16 మందికి ఈ వాహనాల్ని గుట్టుచప్పుడుగా పంపిణీ చేశారు. రాజకీయ దురుద్దేశంతో బినామీ పేర్లతో గిరిజనేతరులకు కూడా ఈ వాహనాలు ఇప్పించారు. లబ్ధిదారుల ఎంపికను ఏకపక్షంగా నిర్వహించడంపై గిరిజనల్లో తీవ్ర నిరసన నెలకొంది.
వెంటాడుతున్న అసమ్మతి రాగం
నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. ఏడాది కిందట వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన ఈశ్వరి అభ్యర్థిత్వం పట్ల టీడీపీలోని సీనియర్ నేతలు, మండల స్థాయి పార్టీ శ్రేణుల్లో అసమ్మతి నెలకొంది. పాడేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, కొయ్యూరుకు చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ తనయుడు ఎంవీవీ ప్రసాద్, పాడేరుకు చెందిన మరో సీనియర్ నేత టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు టికెట్ ఆశించి భంగపడ్డారు. 3 దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకుని ఆ పార్టీలో కొనసాగుతున్న సీనియర్లకు పార్టీ అధినేత కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణల్లో తీవ్ర అసమ్మతి నెలకొంది. అసమ్మతి నేతల్ని కలుపుకుని వెళ్లే పరిస్థితి టీడీపీ అభ్యర్థికి కనబడటం లేదు. వైఎస్సార్‌సీపీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించి.. ఆ తరువాత పార్టీ ఫిరాయించిన ఈశ్వరికి ఎట్టి పరిస్థితిలో కూడా సహకరించేదిలేదని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తుండడంతో ఆమె కలవరపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment