అక్కడ అసమ్మతి రాగం, ఇక్కడ ఆత్మవిశ్వాసం | Ysrcp Confidence, Tdp Confusion State In Paderu Constituency | Sakshi
Sakshi News home page

అక్కడ అసమ్మతి రాగం, ఇక్కడ ఆత్మవిశ్వాసం

Published Wed, Mar 13 2019 11:21 AM | Last Updated on Wed, Mar 13 2019 11:26 AM

Ysrcp Confidence, Tdp Confusion State In Paderu Constituency - Sakshi

సాక్షి, పాడేరు: సార్వత్రిక ఎన్నికల తేదీని ప్రకటించడంతో  పాడేరు ఎస్టీ రిజర్వుడ్‌  నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది.   2019 ఎన్నికల బరిలో నిలిచేందుకు వైఎస్సార్‌ సీపీ,టీడీపీ బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల నుంచి అభ్యర్థులు  సమాయత్తమవుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి గిరిజన సంక్షేమ మంత్రి పదవిని కూడా నిర్వహించిన పసుపులేటి బాలరాజు 2014లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి అనూహ్యంగా జనసేన పార్టీలో చేరి పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేం దుకు సిద్ధం కావడం తాజా పరిణామం.

అలాగే గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఈ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లోకులగాంధీ ఈ సారి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ పార్టీ టికెట్‌ కోసం బీజేపీ సీనియర్‌ నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, నందోలి ఉమామహేష్‌ కూడా దరఖాస్తు చేశారు. మాజీ మంత్రి బాలరాజు కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరిన నియోజకవర్గంలోని పలువురు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.

ఇందులో ముఖ్యంగా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చెందిన తమర్భ కృష్ణవేణి, సీదరి మంగ్లన్నదొరతో పాటు మరో సీనియర్‌ నాయకుడు స్వాముల సుబ్రహ్మణ్యం పాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసి బరిలో దిగేందుకు నిరీక్షిస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరా యించిన సిటింగ్‌ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేరును పాడేరు టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. గానీ  అధికారికంగా ప్రకటించలేదు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని    ఖరారు చేయవలసి ఉంది.

రాజకీయ ముఖచిత్రం : నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభంజనం సృష్టించిన వైఎస్సార్‌సీపీదే నియోజకవర్గంలో పైచేయిగా ఉంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లోనూ బూత్‌స్థాయిలో ఈ పార్టీ బలోపేతంగా ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 26వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన గిడ్డి ఈశ్వరి పార్టీఫిరాయించిటీడీపీలో చేరి నప్పటికి కేడర్‌ పార్టీకి దూరం కాలేదు. ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల్లో వైఎస్సార్‌సీపీ కేడర్‌ విస్తరించి ఉంది. 

15 ఏళ్ల తర్వాత టీడీపీ పోటీ : పాడేరు నియోజకవర్గంలో 15ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ తన  అభ్యర్థిని బరిలో దింపుతోంది. 2009లో నియోజకవర్గం పునర్విభజన తర్వాత కూడా పాడేరు నుంచి టీడీపీ అసెంబ్లీకి ఇప్పుడే పోటీ చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆరుసార్లు పోటీ చేయగా మూడుసార్లు గెలుపు, మూడు సార్లు ఓటమి చెందారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత పాడేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు వరుసగా 1983, 1989, 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందగా 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో సీపీఐ పొత్తుతోను, 2014లో బీజేపీతో పొత్తుతోను టీడీపీ ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో గత 15 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థులు బరిలో లేకపోవడంతో నియోజకవర్గంలో ఈ పార్టీ బలహీనపడింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేతో మరింత అసమ్మతి : వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్‌ కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలోని నియోజకవర్గ ముఖ్య నేతల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారితో పాటు నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిలుగా ఉన్న సీనియర్‌ నాయకులు బొర్రా నాగరాజు, ప్రస్తుత జీసీసీ చైర్మన్‌ ఎంవీవీఎస్‌ ప్రసాద్‌ కూడా పాడేరు టీడీపీ టికెట్‌ను ఆశించారు.  దీంతో ఈ ముగ్గురు సీనియర్లు అధి ష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

గతంలో కూడా సీపీఐ, బీజేపీ పొత్తుతో సీట్లు దక్కక నిరాశతో ఉన్న ఈ నేతలకు ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మూలంగా భంగపాటు తప్పలేదు. సీటు దక్కకపోవడంతో నియోజకవర్గంలోని సీనియర్‌ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు వద్ద, మంత్రుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో అలకపాన్పు ఎక్కారు. అలాగే మరికొందరు సీనియర్‌ నేతలు కూడా  అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలో చేరి సాధించిన అభివృద్ధి ఏమి లేకపోగా, పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో టీడీపీ అభ్యర్థి పరిస్థితి అయోమయంగా ఉంది. 

జనసేన పార్టీ అభ్యర్ధి పసుపులేటి బాలరాజుకు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు తప్ప నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్మాణాత్మకంగా విస్తరించకపోవడం ప్రతీకూల అంశంగా ఉంది. మిత్రపక్షమైన సీపీఐ మద్దతుతో నెగ్గుకు రావచ్చునని బాలరాజు బరిలో నిలిచారు. ప్రధాని మోదీ ప్రధాన ఆకర్షణగా బీజేపీ నేతలు కేంద్రప్రభుత్వ పథకాల్ని ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుని   ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి ఆ పార్టీ నేతల్లో ఉన్న అసమ్మతి, సామాజిక వర్గంలో  తగ్గిన ఆదరణ, పార్టీ ఫిరాయింపు వల్ల ఓటర్లలో ఏర్పడిన వ్యతిరేకత, అభివృద్ధిలో వివక్ష ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ప్రధానపార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోరు సాగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement