మాట ఇచ్చా...మళ్లీ వచ్చా...!!
ఓట్ల కోసం వచ్చి అవసరం తీరాక ప్రజలకు మొహం చాటేసే నేతలను ఇన్నాళ్లూ చూసిన ఆ గ్రామస్తులు ఈ కొత్త ఎమ్మెల్యే సాహసం చూసి అబ్బుపడ్డారు. తమ కోసం వాగులు వంకలు, కొండలు గుట్టలు దాటుకుని వచ్చిన తమ ఆడ బిడ్డను చూసి ఆనంద పరవశులై అక్కున చేర్చుకున్నారు.
సీలేరు,న్యూస్‌లైన్ : పాడేరు నియోజకవర్గంలో కాకు లు దూరని కారడవి, అడుగు తీసి అడుగు వేయాలంటే ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని ప్రాంతాలవి. గత ఇరవయ్యేళ్లుగా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అటువైపు చూసిన దాఖలాల్లేవు. కనీసం తహశీల్దార్ కూడా వెళ్ళిన చరిత్ర లేదు. నిత్యం మావోయిస్టులు, పోలీసుల మధ్య అక్కడి జనం నలిగిపోతుంటారు. గుమ్మిరేవుల పంచాయతీ 25 గ్రామాల్లో 20 వేలకు పైగా ఓటర్లున్నాయి. ఆ పల్లెలను అభివృద్ధి చేస్తామన్న మాటలు నమ్మి ఇదివరకు నలుగుర్ని ఎమ్మెల్యేలుగా గెలిపించినా ఆ తరువాత వారు మొహం చాటేశారు.
అయితే తాజాగా వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే ఈశ్వరి మాత్రం ఆ పంచాయతీలకు వెళ్లారు. సుమారు 30 కిలోమీటర్ల గతుకులు, గంతల రహదారి గుండా అటు ఇటు ఆరు గంటలు ప్రయాణించారు. ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు వెళ్లి అక్కడి ప్రజలకు కలిశానని ఆమె చెప్పారు. ఒక మహిళా ఎమ్మెల్యే తమ గ్రామంలో పర్యటించడం ఇదే మొదటిసారని చెప్పిన అక్కడి జనం ఆమె కోసం పరుగుపరుగున వచ్చి అక్కున చేర్చుకున్నారు.
6 గంటలు ఉత్కంఠ
మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గిడ్డి ఈశ్వరి ఎలాంటి భయం లేకుండా మావోయిస్టుల కోటలోకి అడుగిడారు. దారిలో పెద్ద పెద్ద గోతులున్నా భయపడకుండా అవసరమైన చోట కాలినడకన వెళ్లారు. ప్రతి గ్రామంలోనూ గిరిజనులను పేరుపేరుగా పలకరిస్తూ ముందుకు సాగారు. సాయంత్రం 4 నుంచి 11 వరకూ ఆమె పర్యటన సాగింది. ఆమె వెంట జీకేవీధి, చింతపల్లి, పాడేరు జెడ్పీటీసీలు అందరూ మహిళలే కావడం విశేషం. వీరంతా ఆ గ్రామాలకు ధైర్యంగా వెళ్ళారు. ఆమె వెంట పలువురు జడ్పీటీసీలు, కర్యకర్తలు ఉన్నారు.