జాతీయ దృక్పథం గల దళితోద్ధారకుడు | Babu Jagjivan Ram Jayanti 2022 Guest Column Dokka Manikya Varaprasad | Sakshi
Sakshi News home page

జాతీయ దృక్పథం గల దళితోద్ధారకుడు

Published Tue, Apr 5 2022 1:33 AM | Last Updated on Tue, Apr 5 2022 1:33 AM

Babu Jagjivan Ram Jayanti 2022 Guest Column Dokka Manikya Varaprasad - Sakshi

ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్‌రామ్‌. రాజకీయాల్లో ఆచరణవాది. తండ్రి జీవన తాత్విక బాటలో అహింసా తత్వాన్ని పుణికి పుచ్చుకొని, జాతీయోద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని, దేశ రాజ కీయాల్లో ఒక సరికొత్త నినాదంగా మారిన వ్యక్తి. బ్రిటిషర్స్‌ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకువస్తున్న సందర్భంలోనే ‘ఆల్‌ ఇండియా అణగారిన వర్గాల సమాఖ్య’ను ఏర్పాటు చేసి దళిత బహుజన వర్గాలను జాతీయ స్థాయిలో ఐక్యపరచే కార్యాచరణకై ఉద్యమించాడు.

బిహార్‌ అసెంబ్లీకి 1936లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పొత్తుతో అణగారిన వర్గాల సమాఖ్య తరపున బరిలోకి దిగి 14 మంది అభ్యర్థులను గెలిపించాడు. జాతీయ దృక్పథంతో పనిచేస్తూనే దళిత బహు జనోద్ధరణకు పూనుకున్న ప్రజ్ఞావంతుడు జగ్జీవన్‌రావ్‌ు. మానవ సమాజమార్పునకు దోహదపడే రాజ్యాంగ మార్గ పద్ధతుల పట్ల బలమైన నమ్మకంతో పనిచేశాడు. 

రాజ్యాంగ రచనకై ఏర్పాటైన ‘రాజ్యాంగ సభ’ సభ్యు నిగా బిహార్‌ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. 1946లో కేంద్రంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్ర కార్మికాఖ మంత్రిగా పని చేశాడు. 1947లో ఏర్పడ్డ ప్రభుత్వంలో కూడా మరోమారు ఇదే శాఖకు మంత్రి అయ్యాడు. కార్మికులపై జాతీయ కమీషన్‌ను ఏర్పాటు చేసి జస్టిస్‌ గజేంద్ర ఘట్కర్‌ వంటి ఉద్దండ న్యాయమూర్తిని అధ్యక్షుడిగా నియమించాడు. ఈ కమిటీ నివేదికల ఆధారంగా కార్మిక ప్రజా ప్రయోజనాల కోసం కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సవరణ) చట్టం, బోనస్‌ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక ప్రజోపయోగ చట్టా లను రూపొందించాడు.

అలాగే ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూ రెన్స్‌ ఫండ్‌ వంటి చట్టాల ద్వారా సామాజిక భద్రతకు పునా దులు వేశాడు. ఫ్యాక్టరీస్‌ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయడాన్ని నిషేధించాడు. కార్మికుల పనిగంటలు నిర్ధారించాడు. అదనపు పనికి గానూ అదనపు చెల్లింపులకు శ్రీకారం చుట్టాడు. కాంట్రాక్ట్‌ లేబర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైల్వే మంత్రిగా చార్జిల పెంపు భారం పేదవాళ్ళపై పడకుండా సంస్కరణలు చేపట్టాడు.

భారత సమాజం దళిత అణగారిన వర్గాల పట్ల చూపు తున్న వివక్షలను ‘భారత్‌లో కులం సవాళ్ళు’ (కాస్ట్‌ ఛాలెం జెస్‌ ఇన్‌ ఇండియా) రచన ద్వారా వివరించాడు. అంబేడ్కర్‌ వంటి మేధావి రాజ్యాంగ రచనా సంఘం బాధ్యతలు చేపట్టేందుకు తన వంతుగా నెహ్రూ, గాంధీ, పటేల్‌ వంటి జాతీయ నాయకులను ఒప్పించిన రాజకీయ నేర్పరి జగ్జీవన్‌రామ్‌. బిహార్‌లో భూకంపం సంభవించి నప్పుడు ఆయన చూపించిన చొరవ, సామాజిక విపత్తులు సంభవించి నప్పుడు ఎలా ఎదర్కొనాలో తెలుపుతాయి. ఈ సంఘటన మహాత్మాగాంధీని సైతం ఆకర్షించింది. దేశంలో ఆహార సంక్షోభం సంభవించినప్పుడు హరిత విప్లవానికి నాంది పలికి ఆహారోత్పత్తిని పెంచి, దేశాన్ని సంక్షోభం నుంచి ముందుకు నడిపాడు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చేందుకు పూనుకున్న దార్శనికుడు.

దేశ రక్షణ శాఖ మంత్రిగా ఆయన కార్యసాధన ఎప్పటికీ ఆదర్శనీయమే. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు సియాచిన్‌ పర్వత శ్రేణులలో సైనికులతో కలసి తిరిగాడు. యుద్ధం పాక్‌ భూభాగంలో మాత్రమే జరగాలనీ, భారత్‌ భూభాగంలో కాదనీ ఉద్భోధించి, భారత సైన్యాన్ని ఉత్సాహ పరుస్తూ సైనికుల్లో సైనికుడిలా మెలిగిన రక్షణ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు. భారత సైన్యం విజయం సాధిం చిన మొదటి యుద్ధం దళితుడైన జగ్జీవన్‌ రామ్‌ నాయకత్వాన జరిగినది కావడం ఒక చారిత్రక విషయం.

భారత పార్లమెంట్‌లో 4 దశాబ్దాలపాటు పార్లమెంటే రియన్‌గా మెలిగిన అజాత శత్రువు బాబూ జగ్జీవన్‌రావ్‌ు. దేశ ప్రజల చేత ‘బాబూజీ’ అన్న పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు బాబూ జగ్జీవన్‌ రామ్‌! గొప్ప దేశభక్తుడు, దార్శనికుడు, మానవీయ మూర్తి జగ్జీవన్‌రావ్‌ును ‘భారత రత్న’ వంటి అత్యున్నత పురస్కారంతో దేశం గౌరవించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

-డొక్కా మాణిక్య వరప్రసాద్‌
వ్యాసకర్త ఎమ్మెల్సీ, మాజీ మంత్రి
(నేడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement