సాక్షి, అమరావతి: ఎన్నికల భయంతో కులాల కుంపట్లు రాజేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటేనని ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, బొమ్మి ఇజ్రాయెల్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు తమను వాడుకోవటాన్ని నిరసిస్తూ టీడీపీకి చెందిన మాదిగ నేతలంతా ఆ పార్టీని వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా మాదిగలకు ఒక్కటైనా మేలు చేసిందా? అని ప్రశ్నించారు.
మాల మాదిగలను గౌరవిస్తూ, రాజ్యాధికారంలో వాటా కల్పిస్తూ సీఎం జగన్ ఐదు కీలక శాఖలను కేటాయించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలతోపాటు ఉన్నత చదువులు అభ్యసించేలా తోడుగా నిలిచి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దురహంకారంతో మాట్లాడిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఈమేరకు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.
దూషించేందుకే ఆ సమావేశం
చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మాదిగలకు టీడీపీ చేసిన మేలు ఒక్కటైనా ఉందా? టీడీపీ అధినాయకత్వాన్ని దళితులంతా నిలదీయాలి. టీడీపీకి చెందిన మాదిగ నాయకులంతా సంక్షేమంపై చర్చించకుండా సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషించేందుకే సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏడాది రాగానే కులాల కుంపట్లు రాజేయడం చంద్రబాబుకు అలవాటే. విద్య, సంక్షేమ పథకాలతో దళితుల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు.
ఇద్దరు మాదిగలు, ముగ్గురు మాలలకు కీలక శాఖలు అప్పగించారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 30 లక్షల మందికిపైగా ఉచితంగా ఇళ్ల స్థలాలను అందించారు. అమరావతి ప్రాంతంలో మరో 50 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారు. ఒకేసారి అంతమందికి ఉచితంగా ఇళ్ల స్థలాలిచి్చన పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉందా? – డొక్కా మాణిక్య వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
దళిత ద్రోహులంతా టీడీపీలోనే
చంద్రబాబు ఆది నుంచీ దళితులకు వ్యతిరేకమే. ఎన్నికల భయంతో మాదిగల ఓట్ల కోసం ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా మాదిగల పట్ల ఎంత నీచంగా వ్యవహరించారో, ఎలా అవమానించారో మాదిగ జాతి మరిచిపోలేదు. మాదిగలు, మాలలకు పెద్దపీట వేస్తూ ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది.
మాదిగల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యను అభ్యసిస్తున్నారు. దీనిపై కూడా కోర్టులకెక్కి అడ్డుపడ్డ దళిత ద్రోహి చంద్రబాబు. పేదల ఇళ్లను సమాధులతో పోల్చిన వ్యక్తి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉండగా ఏ ఒక్క పేదవాడికైనా సెంటు స్థలమిచ్చారా? దళితులను అవమానించిన ద్రోహులంతా టీడీపీలోనే ఉన్నారు. దళితులంతా సీఎం జగన్ వెంటే నడుస్తారు. –కొమ్మూరి కనకారావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్
జగన్ అంటే సోషల్ ఇంజనీరింగ్
పేద బిడ్డలను ప్రోత్సహిస్తూ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తెచ్చిన సమూల మార్పులు టీడీపీ నేతలకు కనపడటం లేదా? దళిత నేతలు ఇప్పటికైనా చంద్రబాబు నైజాన్ని గ్రహించి టీడీపీని వీడి బయటకు రావాలి. సోషల్ ఇంజనీరింగ్ అంటే సీఎం జగన్... జగన్ అంటేనే సోషల్ ఇంజినీరింగ్! సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, ఆర్బీకేలు, అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా లాంటి విప్లవాత్మక చర్యలే ఇందుకు నిదర్శనం.
దళితులకు హిందూ దేవాలయాల్లో ప్రవేశం ఎందుకని నాడు ఇదే టీడీపీ పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఆలయాల్లో ప్రవేశాలతోపాటు మాల మాదిగలు, రెల్లి కులస్తులకు ఆలయ పాలకవర్గాల్లో సభ్యులుగా నియమించడంతోపాటు నిర్వహణ బాధ్యత కూడా అప్పగించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏరోజైనా మాల, మాదిగ, రెల్లి, యానాది కులాలకు చెందిన వారిని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీలకు చైర్మన్‌గా నియమించారా? నామినేటెడ్ పనులు, పదవుల దగ్గర్నుంచి ముఖ్యమంత్రికి సలహాదారులుగా మాదిగలు, మాలలు ఉన్న పరిస్థితిని మనమంతా చూస్తున్నాం. హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంటూ ఓ చెత్తబుట్టను ప్రకటించారు. – బొమ్మి ఇజ్రాయెల్, ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment