ప్రజలే రెండుగా విడిపోయారు: చంద్రబాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన విభజన విషయంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సంప్రదాయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించ కూడదన్నారు. ఇది తెలుగు జాతికి సంబంధించిన సమస్య కాదని, దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటే దేశంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ వైఖరితో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, కనీసం అసెంబ్లీ అభిప్రాయాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం వెళితే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఇరు ప్రాంతాలతో చర్చించి సమస్య పరిష్కరించాలని సూచించారు. విషబీజాలు నాటడంతో ప్రజలే రెండుగా విడిపోయారని పేర్కొన్నారు. విభజన సమస్యను సానుకూలంగా, ఆమోదయోగ్యంగా పరిష్కరించాలని చంద్రబాబు కోరారు.