తెలంగాణ బిల్లు తిరస్కరించిన తర్వాతే రాజీనామా: టీజీ
తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే, దానిని తిరస్కరించి రాజీనామా చేస్తామని రాష్ట్ర మంత్రి టి.జి.వేంకటేష్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నివాసంలో సీమాంధ్ర మంత్రులతో సమావేశం అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమ రాజీనామాలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. రాష్ట్ర విభజనపై తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఎదిరించామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తప్ప మిగిలిన పార్టీల్లో ప్రజాస్వామ్యం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు చెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తాము సమైక్యానికి కట్టుబడి ఉన్నామని లేఖలు ఇస్తే, గతంలో విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కాంగ్రెస్ అధిష్టాన్నాన్ని ఒప్పిస్తామన్నారు.
అలాగే అసెంబ్లీలో బిల్లు ఆమోదించకుండా రాష్ట్ర విభజన చేసిన సందర్భాలు దేశంలో ఎక్కడ లేవని టీజీ గుర్తు చేశారు. సీఎం సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని చెబుతున్నారన్నారు. మిగిలిన పార్టీ నేతలు కూడా ఇలా వ్యవహారించి ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇలే ఉండేవి కావన్నారు. ప్రతిపక్షనాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఇటువంటి దుర్మార్గపు నిర్ణయానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే రాష్ట్ర విభజనపై ఇంత రగడ జరిగేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్నే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని వివిధ పట్టాణాలను అభివృద్ధి చేసినట్లు అయితే ఈ పరిస్థతి వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీజీ నివాసంలో నిర్వహించిన భేటీకి ఆనం రామనారాయణరెడ్డి, మహేంద్రరెడ్డి, వట్టి వసంతకుమార్, సీ.రామచంద్రయ్య, కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి తదితర మంత్రులు హాజరయ్యారు.