( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేకహోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి అంగీకారం తెలిపారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆ ఆమోదం ప్రకారం పనిచేయాల్సి ఉంటుందన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టిన వారిలో తాను ఒకడినన్నారు.
ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద అంగీకారం తెలిపిన తర్వాత అందుకు కట్టుబడాల్సి ఉంటుందని చెప్పారు. ప్యాకేజీ రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేరకు నిధులు వస్తే ఆమేరకు తీసుకోవడమే బెటర్ కదా అని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అంశం అయినా రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలన్నదే బీజేపీ రాష్ట్ర పార్టీ విధానమన్నారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసే అంశంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రెండూ ప్రజలను మోసం చేశాయన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ విధానాల కారణంగా ఆంధ్రుల డబ్బులన్నీ హైదరాబాద్‌కి పెట్టుబడులు రూపంలో వెళుతున్నాయన్నారు. దాన్ని తెలంగాణ నేతలు వారిగొప్పగా చెప్పుకొంటున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment