అందరికీ న్యాయం జరగాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం రాత్రి 8.45 నిమిషాలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ న్యాయం జరగాలని, ఇరు ప్రాంతాల వారితో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేసే విధంగా రాష్ట్రపతిగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
తెలుగు ప్రజలను రాజకీయ లబ్ధికోసం విడదీస్తున్న వ్యవహారంలో మొదటి ముద్దాయి సోనియాగాంధీయేనని విమర్శించారు. సీట్ల కోసమే ఈ విభజనను చేపడుతున్నారన్నారు. ఇరు ప్రాంతాల సమస్యలకు పరిష్కారం చూపకుండా విడదీస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. వ్యక్తులు కాదు వ్యవస్థ శాశ్వతమని, ఆ వ్యవస్థలో హద్దు మీరితే సమాజానికే ప్రమాదమని బాబు హెచ్చరించారు.
ఆర్టికల్ 3ను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజలను రెచ్చగొడితే సీట్లు వస్తాయనే ఆలోచనలో టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ సీపీలు ఉన్నాయని బాబు అన్నారు. రాష్ట్ర విభజన విధ్వంసానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ సీపీలే కారణమన్నారు. దేశంలో జరిగిన విభజన సందర్భాలను పరిశీలిస్తే అసెంబ్లీ ఆమోదం పొందాకే ఆ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజిస్తుండడం దారుణమన్నారు.
నిన్న మొన్న వచ్చిన పార్టీలన్నీ రాజకీయం కోసమేనని, టీడీపీ మాత్రం తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు. ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని వస్తున్న డిమాండ్‌లను చూస్తే అది ఎవరికీ ఆమోదయోగ్యమైన విధంగా లేదని స్పష్టమవుతోందన్నారు. విద్యా, విద్యుత్, నీళ్ళు, ఉద్యోగాలకు సంబంధించి ఏ ఒక్క అంశంపైనా స్పష్టమైన ప్రతిపాదనలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పై చర్చకు రమ్మని ఛాలెంజ్ చేస్తే ఒకరు ఫాం హౌస్‌లో పని ఉందని ముందుకు రాలేదన్నారు.