
రామోజీ ఫిలింసిటీపై కేసున్నా.. క్లీన్‌చిట్టా?
సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ పొన్నాల ధ్వజం
సీఎం హోదాలో ముందే తీర్పా?
గోబెల్స్‌కన్నా అతిపెద్ద అబద్ధాలకోరు
సాక్షి, హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో అసైన్డ్ భూములు ఉన్నాయనే ఆరోపణలపై కోర్టులో కేసు ఉన్నా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు క్లీన్‌చిట్ ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసు ఉన్నా సీఎం హోదాలో ముందే తీర్పు ఇవ్వడం ఏమిటని విమర్శించారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో అసత్యాలు చెప్పి మోసం చేసినట్టుగానే రామోజీ ఫిలింసిటీ విషయంలోనూ కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
సోమవారం పొన్నాల గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను అతిపెద్ద అబద్ధాలకోరుగా అభివర్ణించారు. అబద్ధాలు చెప్పనని ఆయన అనడమే అసలు అబద్ధమని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను కూడా కేసీఆర్ మించిపోయాడన్నారు. దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి రామోజీ ఫిలింసిటీ వరకు కేసీఆర్ మాట్లాడని అంశమే లేదన్నారు. ఎన్నో మాటలు చెప్పి, హామీలు ఇచ్చి అసలు విషయం వచ్చేసరికి మాటమార్చడం, పచ్చి అబద్ధాలు చెప్పడం కేసీఆర్ నైజమని ఆరోపించారు. అబద్ధాలను ప్రచారం చేయడం గురించి గోబెల్స్‌ను, తప్పుల గురించి శిశుపాలుడిని ప్రస్తావించుకున్నట్టుగానే ఈ రెండు అంశాలను కలిపి మాట్లాడుకోవాలంటే భవిష్యత్తులో కేసీఆర్‌ను ఉదాహరణగా మాట్లాడుకుంటారని పొన్నాల ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పనితీరు అధ్వానం...
పింఛన్లు, ఆహారభద్రత కార్డులు ఇప్పించడానికి ముఖ్యమంత్రి స్వయంగా మూడురోజులపాటు వరంగల్‌లో ఉండాల్సి వచ్చిందంటే ప్రభుత్వ పనితీరు, పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో తేలిందని పొన్నాల విమర్శించారు. సీఎం తన పర్యటనలో ఔటర్ రింగురోడ్డు, పట్టణంలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.
వరంగల్‌లో సమస్యలను పరిష్కరించినట్టుగానే కేసీఆర్ రాష్ట్రమంతటా పర్యటించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన మూడోరోజే గజ్వేల్‌కు వెళ్లిన కేసీఆర్... 5 వేల ఇళ్లు కట్టిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని పొన్నాల ప్రశ్నించారు. అలాగే దళితులకు మూడెకరాల భూమి, పేదలకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం వంటి హామీల అమలు సంగతి ఏమైందో చెప్పాలన్నారు. ఈ హామీలను అమలు చేయకుండానే కేసీఆర్ కొత్తగా నోటికొచ్చిన హామీలను ఇస్తున్నారని ఆరోపించారు.
రైతు ఆత్మహత్యలు పట్టించుకోవేం...
కొత్త రాష్ట్రంలో 200 రోజుల్లోనే 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని పొన్నాల విమర్శించారు. ఆసరా పింఛన్ల కోసం మండుటెండల్లో రెవెన్యూ కార్యాలయాల ముందు నిలబడి గుండెపోటుతో కొందరు చనిపోయారని, మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారని, ఇంకా కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని పొన్నాల విమర్శించారు. ఒక్క సిరిసిల్లలోనే వారం వ్యవధిలో నలుగురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు.
బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామనే హామీని అమలు చేయాలని ఉద్యమాలు చేస్తుంటే కేసీఆర్ స్పందించడంలేదని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులు, యువకులే ఇప్పుడు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఎదుట చేస్తున్న పోరాటాలు కనిపించడంలేదా? అని నిలదీశారు. కేవలం ఎన్నికలు ఉన్నాయనే కారణంతోనే కేసీఆర్ ఆర్భాటం చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో అద్దంకి దయాకర్, బండ ప్రకాశ్, నాయిని రాజేందర్‌రెడ్డి, కె.మల్లేశ్ పాల్గొన్నారు.
పీజేఆర్‌కు నివాళి
సీఎల్పీ మాజీ నేత పి.జనార్ధన్‌రెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో సోమవారం ఆయనకు పొన్నాల నివాళులర్పించారు. పేదల హృదయాల్లో చిరస్థాయిగా పీజేఆర్ నిలిచిపోయారని పొన్నాల కొనియాడారు. పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమానికి పోరాడటమే పీజేఆర్‌కు అర్పించే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు నిరంజన్, కుమార్‌రావు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ప్రజలకు పొన్నాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.