
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన: పొన్నాల
స్థానికత ఆధారంగానే ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు.
గవర్నర్‌కు టీపీసీసీ చీఫ్ పొన్నాల లేఖ
సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. ఆప్షన్ల ప్రకారమే రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులుంటాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు అయోమయంలో ఉన్నారన్నారు.
ఉద్యోగుల విభజనకు ఆప్షన్లు ఒక్కటే ప్రామాణికం కాదని ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం-2014లో ఇతర మార్గాలనూ సూచించిందని గుర్తు చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగితేనే తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని పొన్నాల పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత సచివాలయాన్ని రెండుగా భాగాలుగా విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లకు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలె త్తే అవకాశం ఉందని తెలిపారు. ఒకే కంపౌండ్‌లో రెండు రాష్ట్రాల సచివాలయాలు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఉండడం వల్ల ప్రభుత్వాల పనితీరుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.