సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికలలో కేవలం 34 శాతం ప్రజల మద్దతుతో అందలం ఎక్కి, అధికారంలోకి వచ్చాక తన స్వలాభం కోసం పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంతలా చరిత్రలో నిలిచిపోతారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా ప్రధాని మోడీ మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ కనీసం నోరు మెదపకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు.
సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని బలంగా కాంక్షించిన ప్రజలు టీఆర్‌ఎస్ పాలనలో మోసానికి, దగాకు గురయ్యామని అభిప్రాయపడుతున్నారని అన్నారు. మిగులు సంపన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించకుండా తాను మాత్రం జమీందారీ, దొర తరహాలో కోట్ల రూపాయలతో బంగ్లా కట్టుకుని ఉంటున్నారని అన్నారు.
అప్పులు చేయడంలో, రైతుల ఆత్మహత్యల్లో, రాజకీయ ఫిరాయింపుల్లో, కుటుంబ పాలనలో, న్యాయస్థానాల చేత మొట్టికాయలు తినడంలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్1 చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు శిక్ష వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వేలకోట్ల రూపాయల అవినీతిపై చర్చకు ప్రభుత్వం సిద్ధం కావాలని పొన్నాల డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment