
2014కు ఎంతో ప్రాధాన్యం
తెలంగాణ సాకారం కానుంది: పొన్నాల
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యం ఉందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 74వ అఖిల భారత పారిశ్రామికోత్పత్తుల ప్రదర్శన (నుమాయిష్)ను పొన్నాల బుధవారం ప్రారంభించి మాట్లాడారు. 2014 క్యాలెండర్ 1947 క్యాలెండర్‌ను పోలి ఉందని చెప్పారు. 1947లో బ్రిటీష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించగా, 2014లో తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రం సాకారం కానున్నదని చెప్పారు. రానున్న 25 ఏళ్లలో హైదరాబాద్ నగరపరిధిలో 50 వేల ఎకరాల్లో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. గడచిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మెట్రోరైల్ ప్రాజెక్టు నగరానికే తలమానికంగా నిలుస్తుందన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. వృధాగా సముద్రంలోకి పోయే నదీ జలాలను సాగు కోసం సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిందే జలయజ్ఞం కార్యక్రమమని పేర్కొన్నారు. మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆయా ఉత్పత్తులకు విస్తృతమైన ప్రచారం, ఉపాధి కల్పనకు నుమాయిష్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు ఎస్. రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్విన్, సొసైటీ ప్రతినిధులు సుఖేష్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, వనం వీరేందర్, నిరంజన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళలు అలెక్స్‌స్టాల్ పేరిట ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రారంభించారు. అదే విధంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆ శాఖ డెరైక్టర్ జనరల్ కృష్ణంరాజు ప్రారంభించారు.