సాటి లేని మాసం.. పుణ్యకార్తీక మాసం | Karthika Masam 2025 importance of this month and significance of Usiri | Sakshi
Sakshi News home page

Karthika Masam 2025 సాటి లేని మాసం.. ఉసిరిచెట్టు కింద దీపాలు

Nov 4 2025 11:07 AM | Updated on Nov 4 2025 11:23 AM

Karthika Masam 2025 importance of this month and significance of Usiri

స్కాంద పురాణంలో కార్తికమాస మహిమ ఈ విధంగా వర్ణితమయ్యింది: ‘న కార్తికే సమో మాసం, న కృతేన సమం యుగం, న వేద సదృశం శాస్త్రం, న తీర్థంగంగాయ సమం.’ యుగాలలో కృతయుగానికీ, శాస్త్రాలలో వేదాలకూ, తీర్థాలలో గంగకూ సమానమైనవి లేవు. అలాగే మాసాలలో కార్తికమాసానికీ సమానమైన మాసం లేదని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి అత్యంత విశిష్టతను సంతరించు కుంది. శివ–విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ పౌర్ణమిని శరత్‌ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ వంటి పేర్లతో పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తికా నక్షత్రంలోనే ఈ పౌర్ణమి వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాచిన సోమకాసురుణ్ణి సంహ రించడానికి శ్రీహరి మత్సా్యవతారం ధరించింది ఈ రోజే.  

ఉసిరిక చెట్టు కింద శ్రీహరి దామోదర స్వరూపాన్ని ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజించడం కార్తిక మాసపు ప్రత్యేకత. కార్తికమాసం భక్తి, జ్ఞానం, ధ్యానం సమన్వయమైన మాసం. పౌర్ణమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు వచ్చే ఈ మాసానికి అధిదేవత అగ్ని. అందుచేత ఇది యజ్ఞ సంబంధమైన పవిత్ర మాసం. కార్తిక మాసంలోని సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి చెట్లు ఉన్న వనంలో బంధు మిత్రులతో కలిసి వనభోజనం చేయడం మరొక ప్రత్యేకత. కార్తికమాసంలోని ఆచారాలు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలనే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలనూ అందిస్తాయి. ఈ కాలంలో జఠరాగ్నిమందగిస్తుందనే శాస్త్రపరమైన సత్యాన్ని గ్రహించి, ఉపవాసం ద్వారా శరీర శుద్ధి సాధించడం పద్ధతి. ఈ విధంగా, కార్తిక మాసం కేవలం పూజల, వ్రతాల మాసం మాత్రమే కాదు– భక్తి, జ్ఞానం, ఆరోగ్యం, సమాజ సమతా,ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాలను పునరుద్ధరించే దివ్య మాసం!     

ఇదీ చదవండి: హైపర్‌ సెన్సిటివిటీ న్యూమొనైటిస్‌ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు

 – వాడవల్లి శ్రీధర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement