భువనేశ్వర్: మహా పవిత్ర కార్తిక మాసం(karthika Masam 2025) చిట్ట చివరి 5 రోజులను మహా కార్తిక పంచుకగా వ్యవహరిస్తారు. కార్తిక మాసం నెల పొడవునా ఉపవాసం, ప్రత్యేక పూజలతో ప్రాప్తించే పుణ్యం కంటే పంచుక ఉపవాసం ప్రాప్తించే పుణ్య ఫలం అత్యంత మోక్షదాయకమని విశ్వసిస్తారు. దీన్ని భీష్మ పంచుక అని కూడా అంటారు. ఒడిశాలోని పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయంలో ఈసారి పంచుక 5 రోజులకు బదులు 4 రోజులకు పరిమితం అయింది. పంచాంగం గణాంకాల ప్రకారం కార్తిక శుక్ల ద్వాదశి క్షీణతతో ఈ పరిస్థితి నెలకొంది. పంచుక సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై సోదర సోదరీ సమేత శ్రీ జగన్నాథ స్వామి రోజుకో అలంకరణలో శోభిల్లుతాడు. ఈ అలంకారాల్లో మూల విరాటులను దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. శ్రీ మందిరం పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రద్దీ నియంత్రణ కోసం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మహా లఘు దర్శనం
భక్తులకు వెలుపలి గడప (బహారొ కఠొ) నుండి రత్న వేదికపై మూల విరాట్ల దర్శనం ఏర్పాటు చేశారు. కార్తిక పూర్ణిమ రోజున ప్రథమ భోగ మండప సేవ ముగిసే వరకు ఈ కట్టడి నిరవధికంగా కొనసాగుతుంది. ఆ తర్వాత లోపలి గోడలపై నుంచి దర్శనం కల్పిస్తారు.

సింహ ద్వారం గుండా ప్రవేశం
భక్తులు సింహ ద్వారం గుండా ప్రవేశించి మిగిలిన మూడు ద్వారాల గుండా బయటకు రావాల్సి ఉంది. సేవకులు అన్ని ద్వారాల గుండా రాకపోకలు చేస్తారు. యాత్రికులతో ఆలయం లోనికి ప్రవేశించే యాత్రీ పండాలను మాత్రం అనుమతించరు. శ్రీ మందిరం లోపలి ప్రాంగణంలో మరియు బగేడియా ధర్మశాల సమీపంలో రాత్రింబవళ్లు సేవలు అందించే ఆరోగ్య కేంద్రం తెరిచారు. ఆలయం సమీపంలో రాత్రింబవళ్లు 2 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు రద్దీ నియంత్రణ కార్యకలాపాల కోసం 32 ప్లాటూన్ల బలగాలను మోహరించినట్లు డీఐజీ డాక్టర్ సత్యజిత్ నాయక్ తెలిపారు. పంచుక ముగిసేంత వరకు ఈ నెల 5వ తేదీ వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. పంచుక తొలి రోజు పురస్కరించుకుని ఆది వారం భద్రతా ఏర్పాట్లుని ప్రత్యక్షంగా సందర్శించి సమీక్షించారు.
ఇదీ చదవండి: నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు, నెట్టింట చర్చ


