breaking news
Karthika Masam 2025
-
#KartikaPournami : భక్త జనసంద్రంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ (ఫొటోలు)
-
దేవ దీపావళి దేవతలకూ పర్వదినమే!
చంద్రమా మనసో జాతః – చంద్రుడు (సృష్టికారకుడైన) విరాట్ పురుషుడి మనసు నుండి పుట్టాడు – అని ఋగ్వేద వాక్యం. అందుకే, సముద్రపు ఆటుపోట్లకూ, అమా వాస్య – పూర్ణిమలకూ ఉన్న సంబంధం లాగే, భూమి మీద మనుషుల మనసుల పని తీరు తీవ్రతకూ, ఆకాశంలో చంద్రబింబం వృద్ధి క్షయాలకూ కాదనలేని సంబంధం కనిపిస్తుంది. మానసిక రోగ చికిత్సా నిపుణులు కూడా మద్దతునిచ్చే మాట ఇది.నిండు పున్నమి దినాలలో మనిషి మనసుకు చురుకు ఎక్కువ. పున్నమి నాళ్ళలో, అటు రసభావాల వైపుగానీ ఇటు ఆధ్యాత్మికత వైపుగానీ మనసు ఎప్పటికంటే ఎక్కువ తీవ్రతతో స్పందిస్తుంది. అందుకే సాధకులకూ, భక్తులకూ, యోగులకూ పౌర్ణమి ప్రత్యేక విశిష్టత గల తిథి. అది మంత్రోపదేశాలకూ, ఉపాసనలకూ, తీవ్రమైన ధ్యానాలకూ మహత్తరమైన ముహూర్తం. పున్నమి అంటేనే పొంగిపోయే మనసు, శరత్కాల పూర్ణిమ అంటే మరీ ఉరకలెత్తు తుంది. శివకేశవులిరువురి అర్చనకూ సమానంగా ప్రశస్తమైనది కార్తిక పౌర్ణమి. ఆ పర్వ దినాన, మనసు పరుగునూ, చురుకునూ మంత్ర జపాల వైపు, ఇష్టదేవతారాధన వైపు మళ్ళిస్తే మరింత ఫలప్రాప్తి పొందవచ్చునని పెద్దల మాట.కార్తిక పూర్ణిమ మనుషులకే కాదు, దేవతలకు కూడా పవిత్రమైన పర్వదినమని పురాణాలు చెబున్నాయి. ఆస్తికావళికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీ క్షేత్రంలో, కార్తిక పూర్ణిమను ‘దేవ దీపావళి’గా పరిగణిస్తారు. వారణాసిలో గంగా తీరాన అన్ని ఘాట్లనూ దీపాలతో అలంకరించటంతో, గంగ ఒడ్డు లోకాతీతంగా ప్రకాశిస్తుంది. దేవతలు వారణాసికి వచ్చి గంగామాతను ఘనంగా అర్చించి వెళతారని ఆస్తికుల విశ్వాసం. కార్తిక దీపాలూ, జ్వాలాతోరణాలు, దేవ దీపావళుల లాంటి నైమిత్తిక సంప్రదాయాలతోనూ; అర్చనలూ, జపతపాలూ, అభిషేకాలూ, ధానధర్మాలతోనూ, ఆస్తికులు తమ మనసుకు నచ్చిన మార్గంలో, తమతమ ఇష్ట దేవతలను కొలుచుకొని, విశేషమైన అనుగ్రహం పొందటానికి అనుకూలమైన రోజు కార్తిక పూర్ణిమ. అలాగే, సాధకులు తమలో అనవరతం ప్రకాశించే ఆత్మజ్యోతి వైపు దృష్టి కేంద్రీకరించేందుకూ అది అనువైన రోజు. – ఎం. మారుతి శాస్త్రి -
కార్తీక పౌర్ణమి.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు (ఫొటోలు)
-
సాటి లేని మాసం.. పుణ్యకార్తీక మాసం
స్కాంద పురాణంలో కార్తికమాస మహిమ ఈ విధంగా వర్ణితమయ్యింది: ‘న కార్తికే సమో మాసం, న కృతేన సమం యుగం, న వేద సదృశం శాస్త్రం, న తీర్థంగంగాయ సమం.’ యుగాలలో కృతయుగానికీ, శాస్త్రాలలో వేదాలకూ, తీర్థాలలో గంగకూ సమానమైనవి లేవు. అలాగే మాసాలలో కార్తికమాసానికీ సమానమైన మాసం లేదని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి అత్యంత విశిష్టతను సంతరించు కుంది. శివ–విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ వంటి పేర్లతో పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తికా నక్షత్రంలోనే ఈ పౌర్ణమి వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాచిన సోమకాసురుణ్ణి సంహ రించడానికి శ్రీహరి మత్సా్యవతారం ధరించింది ఈ రోజే. ఉసిరిక చెట్టు కింద శ్రీహరి దామోదర స్వరూపాన్ని ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజించడం కార్తిక మాసపు ప్రత్యేకత. కార్తికమాసం భక్తి, జ్ఞానం, ధ్యానం సమన్వయమైన మాసం. పౌర్ణమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు వచ్చే ఈ మాసానికి అధిదేవత అగ్ని. అందుచేత ఇది యజ్ఞ సంబంధమైన పవిత్ర మాసం. కార్తిక మాసంలోని సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి చెట్లు ఉన్న వనంలో బంధు మిత్రులతో కలిసి వనభోజనం చేయడం మరొక ప్రత్యేకత. కార్తికమాసంలోని ఆచారాలు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలనే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలనూ అందిస్తాయి. ఈ కాలంలో జఠరాగ్నిమందగిస్తుందనే శాస్త్రపరమైన సత్యాన్ని గ్రహించి, ఉపవాసం ద్వారా శరీర శుద్ధి సాధించడం పద్ధతి. ఈ విధంగా, కార్తిక మాసం కేవలం పూజల, వ్రతాల మాసం మాత్రమే కాదు– భక్తి, జ్ఞానం, ఆరోగ్యం, సమాజ సమతా,ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాలను పునరుద్ధరించే దివ్య మాసం! ఇదీ చదవండి: హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు – వాడవల్లి శ్రీధర్ -
భీష్మ పంచుక నాలుగురోజులే : అపురూప దర్శనం
భువనేశ్వర్: మహా పవిత్ర కార్తిక మాసం(karthika Masam 2025) చిట్ట చివరి 5 రోజులను మహా కార్తిక పంచుకగా వ్యవహరిస్తారు. కార్తిక మాసం నెల పొడవునా ఉపవాసం, ప్రత్యేక పూజలతో ప్రాప్తించే పుణ్యం కంటే పంచుక ఉపవాసం ప్రాప్తించే పుణ్య ఫలం అత్యంత మోక్షదాయకమని విశ్వసిస్తారు. దీన్ని భీష్మ పంచుక అని కూడా అంటారు. ఒడిశాలోని పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయంలో ఈసారి పంచుక 5 రోజులకు బదులు 4 రోజులకు పరిమితం అయింది. పంచాంగం గణాంకాల ప్రకారం కార్తిక శుక్ల ద్వాదశి క్షీణతతో ఈ పరిస్థితి నెలకొంది. పంచుక సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై సోదర సోదరీ సమేత శ్రీ జగన్నాథ స్వామి రోజుకో అలంకరణలో శోభిల్లుతాడు. ఈ అలంకారాల్లో మూల విరాటులను దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. శ్రీ మందిరం పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రద్దీ నియంత్రణ కోసం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహా లఘు దర్శనం భక్తులకు వెలుపలి గడప (బహారొ కఠొ) నుండి రత్న వేదికపై మూల విరాట్ల దర్శనం ఏర్పాటు చేశారు. కార్తిక పూర్ణిమ రోజున ప్రథమ భోగ మండప సేవ ముగిసే వరకు ఈ కట్టడి నిరవధికంగా కొనసాగుతుంది. ఆ తర్వాత లోపలి గోడలపై నుంచి దర్శనం కల్పిస్తారు. సింహ ద్వారం గుండా ప్రవేశం భక్తులు సింహ ద్వారం గుండా ప్రవేశించి మిగిలిన మూడు ద్వారాల గుండా బయటకు రావాల్సి ఉంది. సేవకులు అన్ని ద్వారాల గుండా రాకపోకలు చేస్తారు. యాత్రికులతో ఆలయం లోనికి ప్రవేశించే యాత్రీ పండాలను మాత్రం అనుమతించరు. శ్రీ మందిరం లోపలి ప్రాంగణంలో మరియు బగేడియా ధర్మశాల సమీపంలో రాత్రింబవళ్లు సేవలు అందించే ఆరోగ్య కేంద్రం తెరిచారు. ఆలయం సమీపంలో రాత్రింబవళ్లు 2 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు రద్దీ నియంత్రణ కార్యకలాపాల కోసం 32 ప్లాటూన్ల బలగాలను మోహరించినట్లు డీఐజీ డాక్టర్ సత్యజిత్ నాయక్ తెలిపారు. పంచుక ముగిసేంత వరకు ఈ నెల 5వ తేదీ వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. పంచుక తొలి రోజు పురస్కరించుకుని ఆది వారం భద్రతా ఏర్పాట్లుని ప్రత్యక్షంగా సందర్శించి సమీక్షించారు. ఇదీ చదవండి: నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు, నెట్టింట చర్చ -
హర హర మహాదేవ : కార్తీకంలో దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు
కార్తీక మాసంలో మహాశివుడిని భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం, అలాగే కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసం శివరాధనకు అంకితం. ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాలన్ని సందర్శించి, భక్తితో దీపారాధన చేస్తే మోక్షం లబిస్తుందని, కష్టాలన్నీ తొలగి, అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో ఒక్క రోజులోనే పంచారామాలను ఒక్కరోజులోనే సందర్శించడం మరో విశేషం. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో సందర్శించదగిన కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం.నిజానికి చెప్పాలంటే శివాలయం లేని గ్రామం ఉండదు. అయినా ప్రసిద్ధ శివాలయాలను, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలను దర్శించి తరించాలని భక్తులు భావిస్తారు. అమరారామం: గుంటూరు జిల్లాలోని అమరావతిలో ప్రధాన దైవం అమరలింగేశ్వర స్వామి. అమరేంద్ర ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినందున ఈ పేరు వచ్చింది. కృష్టా నది దక్షిణ ఒడ్డున ఉన్న బాల చాముండిక అమరలింగేశ్వర స్వామి భార్య. ఈ ఆలయం రెండు అంతస్తులను కలిగి ఉన్న భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందింది.ద్రాక్షారామం: తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామంలో కొలువైన శివుడిని భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని సూర్య భగవానుడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు.దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి రాతి స్థంభాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం.సోమారామం: భీమవరంలో ఉన్న సోమారామం పంచారామాలలో మూడవది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడట. ఇక్కడ శివుడిని పూజించడం ద్వారా చంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని నమ్ముతారు. అందుకే దీనికి సోమారామం అని పేరు వచ్చింది. చంద్రుని దశల ఆధారంగా దాని రంగు మారుతూ ఉంటుంది. పౌర్ణమి సమయంలో , సోమారామంలోని శివలింగం తెల్లగాను, అమావాస్య కు నల్లగా మారుతుందట.సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలోని కుమార రామ ఆలయం పంచారామాలలో చివరిది. వుడిని కుమార భీమేశ్వర స్వామిగా కొలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని కార్తికేయుడు ప్రతిష్టించాడని ప్రతీతి. పూర్తిగా సున్నపురాయితో తయారు చేసిన ఇక్కడి శివలింగం దాదాపు 16 అడుగుల ఎత్తు ఉంటుంది అలాగే ఈ ఆలయం 100 స్తంభాల మండపం, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఏకశిలా నంది ప్రత్యేకం. కోటప్పకొండ : అత్యంత ప్రసిద్ధ శైవ దేవాలయాలలో గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ ఒకటి. 1587 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండలో అత్యంత పురాతనమైన శివాలయం. శివుడిని త్రికూటేశ్వర స్వామి అని పిలుస్తారు.కోటప్పకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా కూడా ఇది ప్రసిద్ధి. శ్రీశైలం: నంద్యాల జిల్లాలో కొలువై ఉన్న శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వయా పాలమూరు జిల్లా నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని రెండో శతాబ్దంలో నిర్మించాని చెబుతారు. ఈ క్షేత్రంలో పాతాళగంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు.ఛాయ సోమేశ్వర స్వామి : నల్లగొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం. దీన్ని ఇక్ష్వాకు వంశస్తులు 11, 12వ శతాబ్దంలో నిర్మించారట. ఈ గుడిలోని శివ లింగం ప్రతిరోజూ శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గ ఇక్కడి శివుడికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.రామప్ప దేవాలయం: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమైన దేవాలయం. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. అత్యున్నతమైన వాస్తు, శిల్ప సంపదతో ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఆలయం. రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు.యాగంటి : కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. 5వ శతాబ్దంలో నిర్మించారని ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలవడం మరో ప్రత్యేకత. అలాగే యాగంటి నంది ప్రతీ ఏడాదీ కొంచెం కొంచెం పెరుగుతుందని చెబుతారు.ఆలంపూర్ నవ బ్రహ్మ. : జోగుళాంబ-గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ తొమ్మిది దేవాలయాల శ్రేణిని చాళుక్యులు నిర్మించారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి ప్రపంచ సృష్టించడానికి కావలసిన శక్తులు బ్రహ్మకు ప్రసాదిస్తూ ఆశీర్వాదిస్తాడు. అందువల్ల శివునికి బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ ఉపసర్గ మొత్తం కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ, తారక బ్రహ్మ అనే తొమ్మిది ఆలయాలున్నాయి.సంగమేశ్వరుడు : కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకత. సప్తనదీ సంగమంగా పిలువబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. వేల ఏళ్లనాడు ఆలయంలో ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం.వేములవాడ రాజన్న: రాజన్న సిరిసిల్లాల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం నిర్మాణం, ఆధ్యాత్మిక పవిత్రత రెండింటికీ ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరొందిది. ఇక్కడి ధర్మ గుండం జలాల్లో తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు.కీసర : లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరి క మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం.ఇవి కొన్ని శివాలయాలు మాత్రమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరెన్నో శివాలయాలు, పవిత్రమైనవిగా, భక్తులు కోర్కెలు తీర్చే కొంగుబంగారం విలసిల్లుతున్నాయి. భక్తుల ఆదరణకు నోచుకున్నాయి. -
అమలా నవమి ఉత్సవాలు, సాక్షి గోపాల్ టెంపుల్ గురించి తెలుసా?
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లా సాక్షి గోపాల్ పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. పూరీ నుండి 19 కి.మీ దూరంలో ఉన్న సాక్షిగోపాల్ పట్టణంలో ఉంది. ఇక్కడ రాధా కృష్ణులను ఆరాధిస్తారు. మధ్యయుగ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చి బియ్యం బదులుగా దేవతకు గోధుమలు సమర్పిస్తారు.సాక్షి గోపాల్ ఈ పేరు ఎలా వచ్చింది?సఖిగోపాల్ అని పిలువబడే ఒక పేదవాడు గ్రామాధికారి కుమార్తెను ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు.కానీ వారి ఆర్థిక స్థితిలో తేడాను చూసి గ్రామ పెద్ద వీరి ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే కొంతకాలానికి గ్రామపెద్ద సఖిగోపాల్తో పాటు, కొంతమంది ప్రజలు తీర్థయాత్ర కోసం కాశీకి వెళ్లారు. అక్కడ గ్రామ పెద్ద అనారోగ్యానికి గురవుతాడు. గ్రామస్తులు ఎవరూ అతనికి సహాయం చేయలేదు. అప్పుడు సఖిగోపాలు మాత్రమే సపర్యలు చేస్తాడు. దీంతో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ ఇంటికి వచ్చిన మాట మారుస్తాడు. దీనికి సాక్షులని తెమ్మంటాడు. దీంతో స్వయంగా శ్రీకృష్ణుడు సాక్ష్యమిస్తాడు. అలా ఈ ఆలయానికి సాక్షిగోపాల్ అని పేరు వచ్చింది. ఇదీ చదవండి: పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయంఈ క్షేత్రంలో రాధాదేవీ పాద దర్శనం ప్రముఖ ఉత్సవం. ఏటా కార్తీక మాసం శుక్ల నవమి నాడు ఈ దర్శనం లభిస్తుంది. ఈ ఏడాది శుక్రవారం రాధా పాద దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గోపాల్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. దీన్నే అక్షయ నవమి, అమలా నవమిగా పేర్కొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సాక్షిగోపాల్ పట్టణం ఉత్సవ సన్నాహాలతో కళకళలాడుతోంది. ఈ ప్రత్యేక రోజున, భక్తులకు రాధారాణి దేవి పాదాలను చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఏడాది పొడవునా దేవీ పాదాల దర్శనం లభించదు. ఈ దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. రాధా పాద దర్శనం మోక్షం ప్రసాదిస్తుందని భక్తుల నమమ్మకం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా రాధా పాద దర్శనం ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాధారాణి దేవత అద్భుతమైన ఒడియా ఇంటి ఆడపడుచు (ఒడియాణి) అలంకరణలో, సాక్షి గోపాలుడు నటవర్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. శుక్రవారం ఉదయం 5 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. సంప్రదాయ ఆచార వ్యవహారాలతో పూజాదులు నిర్వహించి భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భారీ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికార యంత్రాంగం విçస్తత ఏర్పాట్లు చేస్తుంది. గట్టి భద్రత రాధా పాద దర్శనం కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో సాక్షి గోపాలు పట్టణ వ్యాప్తంగా భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. వరుస క్రమంలో భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రవాణా క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల పైబడి భక్తులు రాధా పాద దర్శనం కోసం తరలి వస్తారని నిర్వహణ యంత్రాంగం అంచనా. తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పూరీ జిల్లా మేజి్రస్టేటు , పోలీసు సూపరింటెండెంట్ తదితర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సాక్షిగోపాల క్షేత్రం సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు. దర్శనం పురస్కరించుకుని 11 వరుసల బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు పంచసఖ బహిరంగ స్థలం, పరిసర ప్రాంతాలలో సువిశాల పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. -
ప్రమథ గణాలు, వారిలో ముఖ్యులు ఎవరంటే..?
ప్రమథ గణాలంటే శివపరివారం లేదా శివుని సేన. ప్రమథ అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులు. ప్రమధ గణాలు కోట్లకొలది ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్రగణాలుగా ఉండి పోతారని ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులువీరభద్రుడు: సాక్షాత్ శివస్వరుపం. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపం లో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. నందీశ్వరుడు: శివునికి ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితేనే శివదర్శనం! భృంగి: శివుని పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని ఖ్యాతిగాంచాడు. స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. క΄ాల హస్తుడు. కాశీ పురాధీశుడు.రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన శ్రీ కృష్ణునితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.చండీశుడు: ఒక గోప బాలుడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు. ఇలా శివగణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. -
కార్తీక దీపానికి భక్తకోటి కాంతులు
అవి ప్రతి యేటా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు... సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులూ కాదు తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు అలాగని అది మునుపెన్నడూ చేయని క్రతువు కాదు. వేదాలు.. పురాణేతిహాసాలు అందించిన ఒక చిన్న వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం. కార్తికమాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అద్భుతం. సుమారు పుష్కరకాలం క్రితం కార్తికమాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే భక్తిటీవీ కోటి దీపోత్సవం. కార్తికమాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం. భక్తిటీవీ కోటిదీపోత్సవం. చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై... పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు.సుమారు పుష్కరకాలం క్రితం... పదమూడేళ్లక్రితం శృంగేరీ దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ సందర్భాన్ని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులకు ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయాలని భావించారు. దానితోపాటు కార్తికమాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక.. వారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఆ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్‌స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తులను ఆశీర్వదించారు.ముక్కోటి దేవతలు ఒక్కటైనారు...కార్తికమాసంలో శంకరనారాయణులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టధామాల నుంచి కోటిదీ΄ోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు.. యాదాద్రి, శ్రీరంగం, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు... అలంపురం, కంచి, వారణాసి వంటి శక్తిపీఠాలు. ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటిదీ΄ోత్సవ వేదికపై కొలువుదీరతారు. కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. ఎన్నో పూజలు – పరిణయోత్సవ వైభవ సమాహారం.గురుర్దేవో మహేశ్వరఃప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలి వస్తుంటారు. శివైక్యం చెందిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతిస్వామి, ఉడిపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామి, ఆర్షవిద్యాగురుకులం శ్రీదయానందసరస్వతి వంటి మహామహులు కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం వీక్షకుల అదృష్టం. శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థమహాస్వామి, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీవిద్యాశంకరభారతిస్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి వీరేంద్రహెగ్డే, అక్షయ΄ాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమధుపండితదాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు జయపతాకస్వామి, పతంజలి యోగ బాబారామ్ దేవ్, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతిస్వామి, రుషికేశ్ పరమార్థ్నకేతన్ చిదానంద సరస్వతి, కాశీ – శ్రీశైల జగద్గురువులతో పాటు ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్తకోటిని అనుగ్రహించారు. ఈ ఏడాది సైతం శృంగేరి జగద్గురు విధుశేఖరభారతిస్వామివారు.. కంచి జగద్గురు విజయేంద్రసరస్వతి స్వామివారు విచ్చేయడం కోటిదీపోత్సవానికి సూర్యచంద్రుల ఆగమనం లాంటి శుభతరుణం. సువర్ణాక్షరాల ఘట్టాలు కోటిదీపోత్సవ చరిత్రలోనే కాదు... భక్తిటీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టాలు. కోటిదీపోత్సవం – 2023. కోటిదీపోత్సవం – 2024. రెండేళ్ల క్రితం మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు తుమ్మల నరేంద్రచౌదరి – రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు.. సాక్షాత్తూ దేశప్రధానమంత్రి నరేంద్రమోది విచ్చేయడం... దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించడం ఓ అపూర్వ జ్ఞాపకం. గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయడం మరో మరపురాని ఘట్టం. దేశ ప్రథమ ΄ పౌరురాలి చేతులమీదుగా కార్తికదీపం వెలిగింది. భక్తుల ఆనందం కోటిదీపాల కాంతులై మెరిసింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టమని ద్రౌపది ముర్ము పేర్కొనడం అద్వితీయం. సప్తహారతులు... మహానీరాజనాలు ఈ అపూర్వ వేడుకలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు.లక్ష కాదు.. కోటి 2013లో... మళ్లీ కార్తికమాసం రానే వస్తోంది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. లక్షదీపోత్సవం కంటే మించినది ఏదైనా చేయాలని తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి – వారి కుమార్తె రచనా చౌదరిల సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే అంతవరకూ ఎవరూ చేయని మహోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం. ఆనాడు వెలిగిన దీపజ్యోతి ఇంతింతై అన్నట్లుగా... పుష్కరకాలంగా కొనసాగుతోంది. అఖండదీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త హంగులతో వెలుగొందుతోంది. కోటిదీ΄ోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన ప్రతీ భక్తుడికీ కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది. నటరాజుకు కళాంజలి: జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, కైకుట్టి, మోహినిఆట్టం, ఒడిస్సీ, మణిపురి, లావణి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీ΄ోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా ఫౌండేషన్ తరఫున బ్రహ్మచారులు చేసే అగ్నినృత్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతిఏటా చోటుచేసుకుంటాయి.ఆ అపూర్వ యజ్ఞంమరోమారు...కార్తికమాసాన్ని పురస్కరించుకునినవంబరు1 నుంచి 13 వరకుహైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో... -
పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయం
కృష్ణానదిలో స్నానం... అమరేశ్వరుని దర్శనం’ మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగునేల మీద ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్నది. ఇక్కడ వెలసిన బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించటానికి భక్తజనం నిత్యం అమరావతిని సందర్శిస్తుంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమ గల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.దేవాలయంలో గల వివిధ శాసనాలు ద్వారా అమరేశ్వరుణ్ణి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెపుతోంది.శ్రీ కృష్ణదేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలున్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్రదేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి, మూడు ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశీక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలవబడుతుంది.ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగో΄ాల స్వామి క్షేత్ర΄ాలకునిగా విరాజిల్లుతూ శివ కేశవులకు భేదం లేదని చాటుతున్నాడు.ఏకశిలా రూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున, మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదుట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.శుక్రాచార్యుడి సందేహంఅసుర గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధాన మిస్తూ, అమరేశ్వరుడు వెలసిన దీన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది.అమరలింగేశ్వరాలయ ప్రాముఖ్యత...ద్వాపర యుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితం మరియూ కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదుడిని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కాంద పురాణం పేర్కొంది. నారదుడు శౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజూ స్నానం చేసి, కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున, అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నివసించమని సలహా యిచ్చాడు.నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు, తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కష్ణానదిలో స్నానం చేసి ఇక్కడి ఆలయంలోని అమరేశ్వరుడిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో మూడు రోజులపాటు ఉండి భక్తిశ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు గ్రహిస్తాడు.అమరలింగేశ్వర ఆలయ ఉత్సవాలు...ఈ ఆలయంలో కార్తీక మాసం, మహా బహుళ దశమి, నవరాత్రి, మహా శివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయ సమయాలు...మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. ప్రస్తుత కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సా. 4 గంటల నుండి రాత్రి 8.30 వరకు గుడిని తెరచి ఉంచుతారు.కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉ.3 నుండి రాత్రి 10 వరకు, ఆదివారాలలో ఉ. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. -
జీవులన్నీ దేవుడే!
ప్రాణికోటిలో మనిషితో పాటు ఎన్నో జంతువులున్నా, భారతీయ గ్రామీణ జీవితంలో అతి పురాతన కాలం నుంచి, గోమాతగా పూజించబడే ఆవుకూ, నాగదేవతగా ఆరాధించబడే పాముకూ ప్రత్యేక స్థానం ఉంటూ వచ్చింది. భౌతికంగా చూస్తే, పాము ‘రైతు నేస్తం’. సిద్ధమైన పంటలను గుటకాయ స్వాహా చేసి అపార నష్టాన్ని కలిగించే ఎలుకలు మొదలైన ప్రాణులను తమకు ఆహారంగా చేసుకొనే పాములే లేకపోతే, పండిన పంటలో సగం కూడా చేతికి చిక్కదు. పాముది, మనిషిలాగే, వైరుద్ధ్యాల జీవితం. వాటిని క్రూర జీవులనటం అపార్థం వల్లే! వాటికి మనిషితో శత్రుత్వం లేదు. మనిషి అలికిడి తెలియగానే, అతడికి వీలయినంత దూరంగా వెళ్ళటానికే అవి ప్రయ త్నిస్తాయి. పాము మనిషిని కాటు వేస్తే, అది కాకతాళీయమైన విధి విలాసమే తప్ప, ‘క్రూరత్వం’ కాదు. పాము విషం ప్రాణాంతకమే. కానీ సరిగా వాడితే, అది దివ్యౌషధంగా పని చేస్తుంది అంటుంది వైద్య శాస్త్రం.పాములకు ఇతర జంతువులకు లేని స్థాయిలో శ్రవణ శక్తీ, ఘ్రాణ శక్తీ, గ్రహణ శక్తీ ఉంటాయన్న నమ్మకం గ్రామీణులలో కనిపిస్తుంది. ముఖ్యంగా భౌతికాతీతమైన, లోకాతీతమైన శక్తి, దివ్య సంపత్తి ఎక్కడ ఉన్నా, అది పాములను ఆకర్షిస్తుంది అని ప్రతీతి. యోగులూ, మునులూ పాములతో సఖ్యం చేసిన సందర్భాల గురించి ఎన్నో విశేషాలు వింటూ ఉంటాం. భగవాన్ రమణ మహర్షితో పాములు ముఖాముఖి నిలిచి, సుదీర్ఘమైన మౌన భాషణలు చేసేవనీ, పాములు కాళ్ళకు చుట్టుకొని పాదాభివందనం చేసినా ఆయనకు చక్కలిగింత తప్ప మరో భావన కలిగేది కాదనీ ఆయన మాటలలోనే విన్నాం.ఇదీ చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?పాములలో ఒక దివ్యత్వం ఉన్నదని భారతీయ గ్రామీణులు అనాదిగా విశ్వసిస్తూ వచ్చారు. చనిపోయిన పాము త్రోవలో ఎదురైతే, దానికి సాదరంగా, సభక్తికంగా అంతిమ సంస్కారం చేసే ఆనవాయితీ మన గ్రామాలలో ఉండేది. సమస్త జీవరాశిలో భగవంతుణ్ణి చూడడమే భారతీయ ఆదర్శం.– ఎం. మారుతి శాస్త్రి -
పుణ్య కార్తీకమాసం సందడి షురూ .. కార్తీక పౌర్ణమి ఎపుడు?
అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు శివ భక్తులతో శివనామస్మరణతో మారుమ్రోగుతాయి. అత్యంత మహిమాన్వితమైన మైన కార్తీకమాసంలో పుణ్యనదీ స్నానాలు, దీపారాధనలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివకేశలను అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అందునా ఆదిదేవుడైన ఆ పరమేశ్వరుడికి కార్తీక సోమవారం అత్యంత ప్రీతికరమని భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతీ సోమవారం ఉదయాన్నే చన్నీటి స్నానం ఆచరించి, శివాలయాల్లో దీపారాధన చేయడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. కార్తీక పురాణం పారాయణం ద్వారా సర్వ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. సోమవారాలు, పౌర్ణమి మాత్రమేనా? పండితుల మాట ప్రకారం చెప్పాలంటే.. కార్తీక మాసంలోని ప్రతీ రోజూ శుభప్రదమైనదే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, ద్వాదశి ఉపవాస దీక్ష, పూజలు ఇంకా పవిత్ర మైనవిగా చెబుతారు .ఉదయాన్నేనదులు, కాలువలు, చెరువులు లేదా బావివద్ద, లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసి కోట వద్ద, నువ్వులు, లేదా నేతిదీపాలు వెలిగిస్తారు. కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు. భోళాశంకరుడిని భక్తితో పూజిస్తారు. ఉపవాస దీక్ష చేపడతారు. కార్తీక పురాణం విధిగా చదువుతారు. మాంసాహారానికి దూరంగా ఉంటై నిష్టగా శివుడ్ని కొలుస్తారు. శివాలయాలను, ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తోచినంత దానం చేస్తారు.కార్తీక సోమవారం రోజున ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలిస్తాయట. ఇలా చేయడం ద్వారా ఏడేడు జన్మల సర్వపాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని, సంపద వృద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఇంకా ఎంతో ప్రీతి పాత్రమైన బిల్వార్చన చేయడంతోపాటు శ్రీమహావిష్ణువుని ఆరాధించడం శుభప్రదం.ఈ మాసమంతా ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ పరమేశ్వరుడి నామస్మరణ మారుమోగుతుంది. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజల అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, ఇలా ప్రత్యేకపూజలు, వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. వనభోజనాలు మరో విశిష్ట కార్యంగా చెప్పుకోవచ్చు.కార్తీకమాసంలో నాలుగు సోమవారాలు, తేదీలు తొలి కార్తీక సోమవారం - అక్టోబర్ 27రెండవ కార్తీక సోమవారం - నవంబర్ 3మూడో కార్తీక సోమవారం - నవంబర్ 10నాలుగో కార్తీక సోమవారం - నవంబర్ 17కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరంలో, కార్తీక పూర్ణిమ నవంబర్ , 5వ తేదీ బుధవారం వచ్చింది.కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. మాసం అంతా దీపారాధన చేయలేని వారు ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఏడాదికి సరిపడా నేతిలో ముంచిన 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడినికొలిచి భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలగించి పున్నమి వెలుగుల్లో నదిలో వదిలే సన్నివేశాన్ని చూసి తరించాల్సిందే. ఇలా కార్తీక మాస సందడి నవంబర్ 20 వరకు ఉంటుంది. నోట్ : వారి వారి విశ్వాసాల ఆధారంగా ఎవరికి వారు భక్తితో ఆచరించే పుణ్యకార్యాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. అలాగే అనారోగ్యంతో ఉన్నపుడు కూడా అన్నీ ఇలాగే తు.చ తప్పకుండా ఆచరించాలనే విధి ఏమీ లేదు. భక్తి ముఖ్యం. నిండైన భక్తితో చేసే ఏ కార్యమైనా ఆ దేవుడి ప్రేమకు నోచుకుంటుంది. భక్తితో వెలిగించే చిన్న దీపం కూడా మెక్షానికి మార్గం చూపిస్తుంది. కార్తీక పురాణం మనకు బోధించేది ఇదే.


