
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిజంగానే బాగుంటే, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్న ట్లయితే ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ఉద్యోగాలపై ఎవరైనా ప్రశ్నిస్తుంటే వారిని జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన విషయంలో కేసీఆర్, కేటీఆర్‌లు చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు.
రాష్ట్రంలో రాచరిక పాలన: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజాస్వామ్యం ముసుగులో ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ విఫలమవ్వడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఘటనా స్థలానికి వెళ్లిన నేతలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించడం కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు.
ప్రజలకు స్వేచ్ఛలేదు: మల్లు రవి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారని, ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తుంటే జైల్లో పెట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ధర్నాలు చేసుకునేందుకు కోర్టుల నుంచి అనుమతులు పొందాల్సిన దుస్థితి నెలకొందని, కోర్టులు అనుమతించినా ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తోందని, కేసీఆర్ పాలన ఎంతో కాలం సాగదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment