
ఐటీఐఆర్‌కు విద్యుత్తు.. 3,348 మెగావాట్లు: పొన్నాల లక్ష్మయ్య
రోజుకు 45.2 కోట్ల లీటర్ల నీరు అవసరం
అందుకే 25 ఏళ్ల ప్రణాళిక: మంత్రి పొన్నాల లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ పెట్టుబడుల ప్రాంతాని(ఐటీఐఆర్)కి 3,348 మెగావాట్ల విద్యుత్తు, రోజుకు 45.2 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఎల్లంపల్లి, కంతనపల్లి ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకే 25 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించామని వివరించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐటీఐఆర్ వర్క్‌షాప్‌లో పొన్నాల ప్రసంగించారు. ఐటీఐఆర్‌లో మౌలిక వసతుల కోసం రెండు దశలలో కలిపి 25 ఏళ్లలో రూ. 13,093 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు. రూ. 85 కోట్లతో ఫలక్‌నుమా-ఉందానగర్-ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్ రైలు మార్గ విస్తరణ, రూ. 440 కోట్లతో నాలుగు రేడియల్ రోడ్ల విస్తరణ, రూ. 417 కోట్లతో విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు విడతల్లో కలిపి రవాణా, ఇతర మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీఐఆర్ అమలును ఏపీఐఐసీ పర్యవేక్షిస్తుందని తెలిపారు.
కరీంనగర్, నె ల్లూరుకు ఐటీ
ప్రస్తుతం టైర్-1 కింద హైదరాబాద్, విశాఖ.. టైర్-2 కింద విజయవాడ, కాకినాడ, తిరుపతి, వరంగల్లు నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధిపరుస్తున్నామని, తదుపరి విడతలో టైర్-3 నగరాలైన కరీంనగర్, నెల్లూరులో ఐటీని విస్తరిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యమాలు ఐటీ అభివృద్ధికి ఆటం కం కలిగించలేదన్నారు. గ్రామపంచాయతీలను మండలాలు, జిల్లాకేంద్రాలతో అనుసంధానించే జాతీయ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ 12 నెలల్లోగా పూర్తవుతుందని తెలిపారు. మొబైల్ ద్వారా తెలుగులో ఎస్‌ఎంఎస్ సౌకర్యం తొందర్లోనే అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. సమావేశంలో ఐటీ కార్యదర్శి సంజయ్‌జాజు, ఏపీఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, ఇట్స్‌ఏపీ కార్యదర్శి బిపిన్ చంద్ర, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు శివరాంప్రసాద్ తదితరులు ప్రసంగించారు.
ఐటీఐఆర్‌కు 10 కోట్ల గ్యాలన్ల గోదావరి జలాలు
రాష్ట్రరాజధాని రూపురేఖలను సమూలంగా మార్చనున్న ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాంతానికి రోజూ 10 కోట్ల గ్యాలన్ల గోదావరి జలాలను సరఫరా చేసేందుకు జలమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకోసం గోదావరి రెండోదశ ప్రాజెక్టును 2020లో కాకుండా 2017 చివరినాటికి పూర్తిచేసి నీటిని సరఫరా చేస్తామని జలమండలి ఉన్నతాధికారులు వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. కృష్ణా జలాల లభ్యత దృష్ట్యా కృష్ణా నాల్గవదశ ద్వారా ఐటీఐఆర్ ప్రాంతానికి నీటిని తరలించిన పక్షంలో జలవివాదాలు తలెత్తే ప్రమాదం ఉండడంతో ఈమేరకు నిర్ణయించామన్నారు.
నీటిసరఫరా ప్రాజెక్టుపై త్వరలో కన్సల్టెం ట్‌ను నియమించుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)
సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. గోదావరి రెండోదశ ద్వారా నగరానికి 17.2 కోట్ల గ్యాలన్ల నీటిని తరలించినప్పటికీ ఐటీఐఆర్ పరిధిలోని కంపెనీలకు 10 కోట్ల గ్యాలన్ల కేటాయింపులే ఉంటాయని స్పష్టం చేశారు. మిగతా జలాలు నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తామని చెప్పారు.
సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఏర్పడనున్న ఐటీఐఆర్ పరిధిలో సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్-పోచారం, సైబరాబాద్-ఎయిర్‌పోర్ట్ (గ్రోత్‌కారిడార్-1), ఎయిర్‌పోర్ట్-ఉప్పల్(గ్రోత్‌కారిడార్-2) ప్రాంతాలు ఉన్నాయి. ఐటీఐఆర్ మొదటి దశ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి.