సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్)లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ తరహాలోనే విశాఖపట్నంలో ఒకటి.. తిరుపతి, అనంతపురం, నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ‘తిరుపతి ఐటీఐఆర్’ ప్రాజెక్టులను ప్రభుత్వం నెలకొల్పనుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిర్దిష్ట క్లస్టర్లను గుర్తించి తిరుపతి ఐటీఐఆర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఒక్కొక్క ప్రాంతంలో 4 వేల ఎకరాల చొప్పున మూడు ప్రాంతాల్లోనూ కలిపి మొత్తం 12 వేల ఎకరాల పరిధిలో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రి పొన్నాల మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయం, బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లాలోని ప్రాంతాల్లో ఐటీ, అనుబంధ సంస్థల స్థాపనకు వసతుల కల్పన, అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఈ ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై సర్వే నిర్వహించే బాధ్యతను ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించామని, ఈనెల 24, 25 తేదీల్లో సదరు సంస్థ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తుందని చెప్పారు. 26వ తేదీన సంబంధిత జిల్లా అధికారులతో చర్చిస్తుందన్నారు. అనంతరం సమగ్ర పథక నివేదిక(డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నట్టు వివరించారు.
పెద్ద ఎత్తున ఉద్యోగాలు..
పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలకు వీలు కల్పించే ఐటీఐఆర్‌లో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల సంస్థలు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మాన్యు ఫాక్చరింగ్ సంస్థలు ఏర్పాటవుతాయి. తొలి ఐదేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. రెండో విడతలో 15 నుంచి 20 ఏళ్ల కాలంలో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. ఉత్పత్తి యూనిట్లు, ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన యంత్రాంగం, నివాస ప్రాంతం, పరిపాలన సేవలు భాగంగా ఉంటాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్‌ఈజడ్)లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్‌హౌసింగ్ జోన్లు, ఎగుమతులకు సంబంధించిన యూనిట్లు, అభివృద్ధి కేంద్రాలు కూడా ఉంటాయి.
విశాఖ, తిరుపతిలో ఐటీఐఆర్
Published Tue, Oct 22 2013 6:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement