బంగారు కాదు... బాధల తెలంగాణ తీసుకోచ్చాడు
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ సమస్య అధికమైందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లకుండా కేసీఆర్ 5 నెలలుగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విద్యుత్ సమస్యపై కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పొన్నాల గుర్తు చేశారు.
అధికారంలోని వచ్చిన నాటి నుంచి కేసీఆర్ .... బంగారు తెలంగాణ తీసుకు వస్తానని చెబుతూ బాధల తెలంగాణ తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు నిలదీస్తాయనే ఉద్దేశ్యంతో ఉన్నపళంగా ఛత్తీస్గఢ్ వెళ్లి... అక్కడి ప్రభుత్వంతో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని కేసీఆర్ను పొన్నాల ధ్వజమెత్తారు.