టీ పీసీసీలో ‘సభ్యత్వ’ జగడం!
గాంధీభవన్‌లో సమావేశం రసాభాస
రెబెల్స్‌కూ సభ్యత్వ పుస్తకాలు
ఇవ్వాలన్న వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓడిపోయిన అభ్యర్థులు
సర్దిచెప్పిన జానారెడ్డి, షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదును ఉద్యమ స్థాయిలో చేపట్టి, దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు చేయించాలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి... ఆ పార్టీ నాయకుల మధ్య తగాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఎవరి అధీనంలో ఉండాలనే దగ్గరి నుంచే తగాదాలు మొదలయ్యాయి. దీనితో సభ్యత్వ నమోదుపై గురువారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు విస్తృతంగా పార్టీ సభ్యత్వాలను చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు రాష్ట్రంలోనూ ఏర్పాట్లు జరిగాయి. దీనిపై చర్చించేందుకు గురువారం గాంధీభవన్‌లో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... ఈ సమావేశంలో ‘సభ్యత్వ నమోదు పుస్తకాలు ఎవరి అధీనంలో ఉండాలి? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అభ్యర్థులను ఓడగొట్టిన వారి సంగతి ఏమిట’నే అంశాలపై వాదోపవాదాలు జరిగాయి. పార్టీ అభ్యర్థులపై పోటీ చేసిన, పార్టీకే చెందిన రెబెల్స్‌కు కూడా సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వాలని ఎంపీ వి.హనుమంతరావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసి ఓటమికి కారణమైన వారిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని నిలదీశారు. అయినా వెనక్కితగ్గని వీహెచ్.. ‘అంతా మీ ఇళ్ల ముందు క్యూ కట్టాలా..?’ అని ఎదురు ప్రశ్నించడంతో సమావేశం కాస్తా రసాభాసగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారే నియోజకవర్గ ఇన్‌చార్జులుగా ఉన్నప్పుడు సభ్యత్వ నమోదుకు కూడా వారే బాధ్యులని... అందరికీ సభ్యత్వ పుస్తకాలు ఇస్తే ఎలాగని ప్రతాప్‌రెడ్డి, కొమిరెడ్డి రాములు, హరినాయక్, అనిల్ జాదవ్, భార్గవ్ దేశ్‌పాండే తదితరులు మండిపడ్డారు. ఎంపీ అయి ఉండీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తన కుమార్తెను రెబెల్‌గా పోటీ చేయించారని, అక్కడ కూడా సభ్యత్వ పుస్తకాలు ఇస్తారా? అని పోతంశెట్టి వెంకటేశ్వర్లు నిలదీశారు. అయితే.. తాను పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతున్నానని వీహెచ్ పేర్కొనడంతో... ఆగ్రహించిన పలువురు నేతలు బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ జోక్యం చేసుకుని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
నేటి నుంచి సభ్యత్వ నమోదు
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. గురువారం గాంధీభవన్‌లో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నెహ్రూ జయంతి రోజైన 14వ తేదీ నుంచి ఇందిరాగాంధీ జయంతి అయిన 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపడుతున్నాం. డిసెంబర్ 31వ తేదీ వరకూ సభ్యత్వాలను నమోదు చేస్తాం. పార్టీ నేతలు, కార్యకర్తలు సామాజిక, పార్టీ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరకు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి’’ అని పొన్నాల పిలుపునిచ్చారు.