Palvai Govardhana Reddy
-
టీ పీసీసీలో ‘సభ్యత్వ’ జగడం!
గాంధీభవన్‌లో సమావేశం రసాభాస రెబెల్స్కూ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వాలన్న వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓడిపోయిన అభ్యర్థులు సర్దిచెప్పిన జానారెడ్డి, షబ్బీర్ అలీ సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదును ఉద్యమ స్థాయిలో చేపట్టి, దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు చేయించాలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి... ఆ పార్టీ నాయకుల మధ్య తగాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఎవరి అధీనంలో ఉండాలనే దగ్గరి నుంచే తగాదాలు మొదలయ్యాయి. దీనితో సభ్యత్వ నమోదుపై గురువారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు విస్తృతంగా పార్టీ సభ్యత్వాలను చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోనూ ఏర్పాట్లు జరిగాయి. దీనిపై చర్చించేందుకు గురువారం గాంధీభవన్‌లో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... ఈ సమావేశంలో ‘సభ్యత్వ నమోదు పుస్తకాలు ఎవరి అధీనంలో ఉండాలి? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అభ్యర్థులను ఓడగొట్టిన వారి సంగతి ఏమిట’నే అంశాలపై వాదోపవాదాలు జరిగాయి. పార్టీ అభ్యర్థులపై పోటీ చేసిన, పార్టీకే చెందిన రెబెల్స్‌కు కూడా సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వాలని ఎంపీ వి.హనుమంతరావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసి ఓటమికి కారణమైన వారిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని నిలదీశారు. అయినా వెనక్కితగ్గని వీహెచ్.. ‘అంతా మీ ఇళ్ల ముందు క్యూ కట్టాలా..?’ అని ఎదురు ప్రశ్నించడంతో సమావేశం కాస్తా రసాభాసగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారే నియోజకవర్గ ఇన్చార్జులుగా ఉన్నప్పుడు సభ్యత్వ నమోదుకు కూడా వారే బాధ్యులని... అందరికీ సభ్యత్వ పుస్తకాలు ఇస్తే ఎలాగని ప్రతాప్‌రెడ్డి, కొమిరెడ్డి రాములు, హరినాయక్, అనిల్ జాదవ్, భార్గవ్ దేశ్‌పాండే తదితరులు మండిపడ్డారు. ఎంపీ అయి ఉండీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తన కుమార్తెను రెబెల్‌గా పోటీ చేయించారని, అక్కడ కూడా సభ్యత్వ పుస్తకాలు ఇస్తారా? అని పోతంశెట్టి వెంకటేశ్వర్లు నిలదీశారు. అయితే.. తాను పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతున్నానని వీహెచ్ పేర్కొనడంతో... ఆగ్రహించిన పలువురు నేతలు బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ జోక్యం చేసుకుని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. నేటి నుంచి సభ్యత్వ నమోదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. గురువారం గాంధీభవన్‌లో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నెహ్రూ జయంతి రోజైన 14వ తేదీ నుంచి ఇందిరాగాంధీ జయంతి అయిన 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపడుతున్నాం. డిసెంబర్ 31వ తేదీ వరకూ సభ్యత్వాలను నమోదు చేస్తాం. పార్టీ నేతలు, కార్యకర్తలు సామాజిక, పార్టీ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరకు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి’’ అని పొన్నాల పిలుపునిచ్చారు. -
తెలంగాణలో కాంగ్రెస్‌కు 55 నుంచి 60 సీట్లు
ఎంపీ పాల్వాయి జోస్యం న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 55 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్, కాంగ్రెస్ అధిష్టానం ముందు తననే సీఎం చేయాలని పట్టుపట్టారని, అది కుదరదని చెప్పినందునే విలీనంపై మాట మార్చారని విమర్శించారు. ఆదివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. పోలవరం డిజైన్ మార్చాలని, కృష్ణా నదీ జలాల పంపిణీపై కేంద్రంతో కొట్లాడింది తానేనని చెప్పారు. హరీష్‌రావు ప్రశ్నలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. కాగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి తాను సూచించినట్లు వచ్చిన వార్తలను పాల్వాయి కొట్టిపారేశారు. -
విభజనకు అంగీకరించిన సీఎం: ఎంపి పాల్వాయి
హైదరాబాద్: తన చేతులు మీదుగా విభజన ప్రక్రియ పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం వద్ద అంగీకరించినట్లు కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డి చెప్పారు. వచ్చే జనవరిలో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని ఆయన జోస్యం చెప్పారు. డిసెంబర్ 5 -10 తేదీ మధ్యలో అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. నదీజలాల సమస్యను ట్రిబ్యునల్సే పరిష్కరిస్తాయని బిల్లులో స్పష్టంగా పేర్కొంటారన్నారు. ఇరు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఇద్దరు గవర్నర్లు, రెండు కౌన్సిల్స్ ఏర్పడతాయని చెప్పారు. శాంతి భద్రతలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్స్ తదితర అంశాలను ఈ కౌన్సిల్స్ పర్యవేక్షిస్తాయని తెలిపారు. భద్రాచలం డివిజన్ తెలంగాణలోనే కొనసాగుతుందన్నారు. 60ఏళ్లుగా ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న భద్రాచలంను సీమాంధ్రకు ఇవ్వడానికి అంగీకరించం అని చెప్పారు. డిజైన్ మార్చి పోలవరాన్ని నిర్మిస్తే అభ్యంతరంలేదని పాల్వాయి చెప్పారు. -
తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం రాజుకుంది. కంతాన పల్లి ప్రాజెక్టు డిజైన్ వ్యవహారంకు సంబంధించి టీ. ఎంపీల మధ్య రగడ మొదలైంది. ఎంపీ పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్యల మధ్య వివాదం చోటు చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి కంతాన పల్లి ప్రాజెక్టు డిజైన్ పై వ్యతిరేకిత వ్యక్తం చేస్తున్నఎంపీ పాల్వాయి తిరిగి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కంతానపల్లి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే కేంద్రాన్ని డిజైన్ మార్చాలని కోరినట్లు పాల్వాయి తెలిపారు. ఆ డిజైన్ వల్ల ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగపడదని తెలిపారు. కాగా, ఇప్పడున్న డిజైన్ తో లాభం చేకూరందని సిరిసిల్ల వ్యాఖ్యానించారు. దీంతో ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు చవిచూశాయి. గత కొన్ని రోజుల నుంచి కంతానపల్లి ప్రాజెక్టు డిజైన్ తో పాటు, పోలవరం ప్రాజెక్టు , దమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్లపై ఎంపీ పాల్వాయి వ్యతిరేకిస్తూవస్తున్నారు. తాజాగా మరోమారు కంతానపల్లి ప్రాజెక్టు డిజైన్ ను పాల్వాయి వ్యతిరేకించడంపై రాజయ్య సమావేశం నుంచి లేచివెళ్లిపోయారు. -
పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలి: పాల్వాయి
హైదరాబాద్: సమ్మెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉపేక్షించడం సరికాదని, తక్షణమే పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా ఉద్యోగుల సేవలను తీసుకోవాలని కోరారు. అసెంబ్లీకి వచ్చే తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ ఉండదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారన్నారు. తీర్మానాన్ని ఓడిస్తామంటూ సీఎం కిరణ్ సమైక్యవాదులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తుల దాడి వెనుక ఎంపీ లగడపాటి రాజగోపాల్ హస్తం ఉందని పాల్వాయి ఆరోపించారు.