తెలంగాణలో కాంగ్రెస్‌కు 55 నుంచి 60 సీట్లు
ఎంపీ పాల్వాయి జోస్యం
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 55 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్, కాంగ్రెస్ అధిష్టానం ముందు తననే సీఎం చేయాలని పట్టుపట్టారని, అది కుదరదని చెప్పినందునే విలీనంపై మాట మార్చారని విమర్శించారు.
ఆదివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. పోలవరం డిజైన్ మార్చాలని, కృష్ణా నదీ జలాల పంపిణీపై కేంద్రంతో కొట్లాడింది తానేనని చెప్పారు. హరీష్‌రావు ప్రశ్నలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. కాగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి తాను సూచించినట్లు వచ్చిన వార్తలను పాల్వాయి కొట్టిపారేశారు.