తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడుతున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. కాని కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలతో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తం అవుతోంది. ఎంత శ్రమిస్తున్నా వారి మాటలతో తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని వాపోతున్నారు. నోరు జారుతున్న ఆ నాయకులు ఎవరు?
గడచిన 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది. మూడోసారి కూడా ఓడిపోతే...ఇక పార్టీ పరిస్థితి మరింత జారుతుందని గ్రహించిన టీ.కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీవ్రంగా శ్రమిస్తున్నారు. రకరకాల కార్యక్రమాలతో సీనియర్లంతా రోడ్ల మీద జనంతోనే ఉంటున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే కొందరు సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలు మొత్తంగా పార్టీకి నష్టం చేసేవిగా ఉంటున్నాయని గాంధీభవన్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేసిన అనర్హతను ఖండించేదుకు ప్రెస్ మీట్ పెట్టారు సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి. అయితే ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కలసి వచ్చే పార్టీలతో పనిచేస్తాం. ప్రజలు నిర్ణయిస్తే బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని కామెంట్ చేశారు జానారెడ్డి. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కునేందుకు అన్ని పార్టీలను కలుపుకుపోతాం అని జానారెడ్డి చెప్పదలుచుకున్నారు. కానీ మరోరకంగా అర్థం వచ్చేలా వాఖ్యానించడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ పొత్తు చర్చ కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చేస్తుందని భావిస్తుంటే... పొత్తుకు మరింత బలం చేకూర్చేలా జానారెడ్డి చేసిన వాఖ్యలు టీ కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టాయి. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వాఖ్యలు కూడా పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు 40 నుంచి 50 స్థానాలు వస్తాయని, సెక్యులర్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని కోమటిరెడ్డి వాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు చిగురిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న ఇటువంటి ప్రకటనలను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుంటోంది.
ఇక రాష్ట్రంలో వివిధ పార్టీలతో పొత్తుపై చర్చ జరిగేలా కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వ్యవహార శైలి ఉంటోంది. రాహుల్ గాంధీపై పార్లమెంట్ లో అనర్హత వేటు విషయంలో సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఖండించారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటోందని సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ లో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా ఉంది. ఇలా టీ కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు చేసే వాఖ్యలు, వారు వ్యవహరిస్తున్న తీరు, బీఆర్ఎస్ విధానాలు రెండు పార్టీల మధ్య పొత్తు గురించి ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తున్నాయి...
పొత్తు అంశంపై చర్చ జరిగితే అది కాంగ్రెస్ కే నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ నాయకులు చేసే ప్రకటనలు, వారి వ్యవహార శైలి వల్ల బీజేపీ పెరిగి...అంతిమంగా కాంగ్రెస్‌కే నష్టం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment