విభజనకు అంగీకరించిన సీఎం: ఎంపి పాల్వాయి
హైదరాబాద్: తన చేతులు మీదుగా విభజన ప్రక్రియ పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం వద్ద అంగీకరించినట్లు కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డి చెప్పారు. వచ్చే జనవరిలో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని ఆయన జోస్యం చెప్పారు. డిసెంబర్ 5 -10 తేదీ మధ్యలో అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు.
నదీజలాల సమస్యను ట్రిబ్యునల్సే పరిష్కరిస్తాయని బిల్లులో స్పష్టంగా పేర్కొంటారన్నారు. ఇరు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఇద్దరు గవర్నర్లు, రెండు కౌన్సిల్స్ ఏర్పడతాయని చెప్పారు. శాంతి భద్రతలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్స్ తదితర అంశాలను ఈ కౌన్సిల్స్ పర్యవేక్షిస్తాయని తెలిపారు. భద్రాచలం డివిజన్ తెలంగాణలోనే కొనసాగుతుందన్నారు. 60ఏళ్లుగా ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న భద్రాచలంను సీమాంధ్రకు ఇవ్వడానికి అంగీకరించం అని చెప్పారు. డిజైన్ మార్చి పోలవరాన్ని నిర్మిస్తే అభ్యంతరంలేదని పాల్వాయి చెప్పారు.