విభజన సజావుగా జరిగేందుకు సిఎం సహకారం:కొణతాల
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వత్తాసు పలుకుతూ రాష్ట్ర విభజన సజావుగా జరిగేందుకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కుర్చీ కాపాడుకోడానికి సమైక్యవాదం ముసుగులో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
విభజన సజావుగా జరిగిపోడానికి ప్రజాప్రతినిధులు రాజీనామాలు ఇవ్వకుండా, రాజకీయ సంక్షోభం రానీయకుండా చేస్తున్నారన్నారు. శాసనసభ ప్రత్యేక సమావేశాలు పెట్టి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేస్తే యూపీఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కిరణ్ సర్కారు అదీ చేయడం లేదన్నారు. విభజనపై అంచెలంచెలుగా కేంద్రం ముందుకు వెళుతుంటే నీరో చక్రవర్తి పడేలు వాయిస్తున్న చందంగా సీఎం తాపీగా హైదరాబాద్‌లో కూర్చొని వారానికో ప్రసంగం చేస్తున్నారని విమర్శించారు. సోనియాను ఎదిరించి సీఎం పదవిత్యాగం చేస్తారని గతంలో చాలామంది భావించారని, కాని ఇపుడు ఆయన నిజ స్వరూపం బయటపడిందని చెప్పారు. సమైక్యవాదాన్ని అణచే కార్యక్రమాలు చేస్తే పదవి ఎంతోకాలం ఉండదని, చరిత్రహీనులుగా మిగులుతారని అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియతో సోనియా నేతత్వంలో ప్రజాస్వామ్యం నేలమట్టమయిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆఖరికి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసే పరిస్ధితి లేకుండా చేశారు. అదే రాజ్యసభ సభ్యత్వానికి హరికష్ణ రాజీనామా చేస్తే 24గంటల లోపు ఆమోదించారన్నారు. మంత్రి విశ్వరూప్ రాజీనామాను ఆమోదించినా, మిగతా మంత్రుల రాజీనామాలు, వైఎస్సార్ సీపీ రాజీనామాలు ఆమోదించకపోవడం దారుణమన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర ముసుగులో ఒక మాదిరిగా, ముసుగు తీశాక మరోమాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సేవియర్ ఆఫ్ కాంగ్రెస్‌గా మారారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఓట్లు బదిలీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. సోనియా నేతత్వంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పని చేస్తున్నార ని పేర్కొన్నారు. తనపై సీబీఐ కేసులు లేకుండా, సమైక్యాంధ్రకు జగన్ సీఎం కాకూడదన్న లక్ష్యంతో చంద్రబాబుపై చేతులు కలిపారని ఆరోపించారు. చంద్రబాబుపై కేసులున్నా సీబీఐకి స్టాఫ్‌లేరని దర్యాప్తు చేయకుండా తప్పించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు దీక్షలో సమైక్యమన్న మాటలేదని, కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటన చేస్తే దాన్ని ఖండించకుండా బాబు నాలుగు లక్షల కోట్లడిగారంటే విభజనను అంగీకరించినట్లేనని కొణతాల చెప్పారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులతో వైఎస్సార్ సీపీ పొత్తుప్రచారాన్ని ఖండించారు. తమ పార్టీ ప్రతినిధులు సమైక్య శంఖారావానికి మద్దతు పలకాలని రాఘవులును కోరితే దాన్ని రాజకీయకోణంలో రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. సమైక్య శంఖారావం అన్ని ప్రాంతాలకు సంబంధించిందని, ఈ సభ విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీలూ కలిసిరావాలని కోరారు. తెలంగాణలో విభజన కోరుకోవడం లేదని, అభివద్ధిని కోరుతున్నారనడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతత్వంలో జరిగిన ఎన్నికలే తార్కాణమన్నారు.