విలీన మండలాల్లో ఇదీ దుస్థితి
* తెలంగాణలోకి వెళ్లిపోయిన టీచర్లు
* చోద్యం చూసిన ఏపీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక్కడి టీచర్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తామంటూ పాఠశాలల నుంచి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఏడు మండలాల్లోని టీచర్లను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖలోకి తీసుకోవాలని ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తమను రిలీవ్ చేయాలని అక్కడి టీచర్లు గత కొంతకాలంగా కోరుతూ వచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టలేదు. టీచర్లు పదేపదే రిలీవ్ చేయాలని కోరినా ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోయారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక టీచర్లను రిలీవ్ చేయాలని ఈ మండలాల విద్యాధికారులకు ఖమ్మం కలెక్టర్ చెప్పారు.
ఈ సమస్యను మండల విద్యాధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఖమ్మం కలెక్టర్ సూచన మేరకు టీచర్లంతా మంగళవారం ఎవరికి వారు స్వచ్ఛందంగా రిలీవ్ లేఖలు రాసి ఇచ్చి స్కూళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ ఏడు మండలాలకు చెందిన 400 మంది టీచర్లు తెలంగాణకు వెళ్లారని, దీంతో అక్కడి అన్ని స్కూళ్లూ మూతపడ్డాయని తమకు సమాచారం వచ్చిందని ఏపీ పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి.
జూలైలో రేషనలైజేషన్, బదిలీల సమయంలో ఈ మండలాలకు టీచర్లను ఏర్పాటుచేస్తామని, అప్పుడు రిలీవ్ అవ్వాలని తాము సూచించినా టీచర్లు పట్టించుకోకుండా స్వచ్ఛందంగా రిలీవ్ అయి వెళ్లారన్నారు. ఈ స్కూళ్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విద్యాకార్యదర్శి ఆర్పీ సిసోడియాతో ‘సాక్షి’ సంప్రదించగా ఇతర మండలాల స్కూళ్లనుంచి టీచర్లను తాత్కాలికంగా ఏర్పాటుచేయనున్నామని, ఏ స్కూలూ మూత పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆ స్కూళ్లు మూత!
Published Thu, Jun 25 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement