ఫ్యాప్సీ పేరు మారింది...
ఇక ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
రెండు రాష్ట్రాల్లో చెరో మూడు కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) పేరును ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టాప్సీ)గా మార్చారు. రెండు రాష్ట్రాలకు ఒకే సంస్థగా ఉంటూ, ఆయా రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మెంబర్స్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ కుమార్ రుంగ్టా తెలిపారు.
ఫ్యాప్సీ పేరును ఎఫ్‌టాప్సీగా మార్చడానికి మంగళవారం జరిగిన ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నామని, దీనికి ఇంకా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీయే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. విలేకరుల సమావేశంలో రుంగ్టా మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో ఆరు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లలో... ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రుంగ్టా తెలిపారు.
రెండు రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు బాగున్నాయని, వీటిల్లో 80% అంశాలు ఫ్యాప్సీ సూచించినవే ఉండటం సంతోషంగా ఉందని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనీల్ రెడ్డి వెన్నం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీల్లో రూ. 2,000 కోట్ల వరకు ఉన్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాకు సంబంధించిన రూ. 1,500 కోట్లు చెల్లించనున్నట్లు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, తెలంగాణకు సంబంధించిన రూ. 650 కోట్లు మార్చిలోగా వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలాగా వచ్చే ఏడాది విద్యుత్ కొరత ఉండకపోవచ్చని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికోత్పత్తి పెరిగితే విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అనీల్ తెలిపారు.