ఇక్కడివారు అటు..అక్కడివారు ఇటు | employees position change in Secretariat | Sakshi
Sakshi News home page

ఇక్కడివారు అటు..అక్కడివారు ఇటు

Published Mon, Jun 2 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

ఇక్కడివారు అటు..అక్కడివారు ఇటు

ఇక్కడివారు అటు..అక్కడివారు ఇటు

సచివాలయంలో ఉద్యోగుల స్థానం మార్పు
- ఆంధ్రాకు చెందిన 99 మంది తెలంగాణకు
- తెలంగాణకు చెందిన 127 మంది ఆంధ్రాకు
- తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులూ ఆంధ్రాకు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంలోని ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణ సచివాలయంలో పనిచేయాల్సిన ఉద్యోగుల పేర్లు, వారి హోదాతో ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఆదేశాల ప్రకారం నాల్గో తరగతి ఉద్యోగులు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని 774 మంది ఉద్యోగులను తెలంగాణ సచివాలయంలో పనిచేసేందుకు కేటాయించారు. ఇందులో ఆంధ్రాకు చెందిన 99 మంది ఉన్నారు. అలాగే తెలంగాణకు చెందిన 127 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం తెలంగాణకు చెందిన ఉద్యోగులే ఎక్కువ మంది ఆంధ్రపదేశ్ సచివాలయంలో పనిచేయాల్సి వస్తోంది.

నాల్గో తరగతి ఉద్యోగులు సచివాలయంలో 595 మంది ఉండగా, వారిలో 35 మంది తప్ప మిగతా వారంతా తెలంగాణకు చెందినవారే. ఇప్పుడు వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణ సచివాలయానికి కేటాయించిన ఉద్యోగుల సంఖ్య ప్రకారం.. అదనపు కార్యదర్శులు    ముగ్గురు, సంయుక్త కార్యదర్శులు ముగ్గురు, ఉప కార్యదర్శులు 24 మంది, సహాయ కార్యదర్శులు 55, సెక్షన్ ఆఫీసర్లు 239, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 348, ప్రైవేట్ కార్యదర్శులు 34, ప్రత్యేక స్టెనోలు 10, సీనియర్ స్టెనోలు ముగ్గురు, జూనియర్ స్టెనోలు 12, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్‌లు 14, డీఆర్‌టీ అసిస్టెంట్‌లు 29 మంది ఉన్నారు.

1. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సిన తెలంగాణకు చెందినవారు: ఇద్దరు అదనపు కార్యదర్శులు, ఇద్దరు ఉప కార్యదర్శులు, 75 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, 19 మంది టైపిస్ట్ కమ్ అసిస్టెంట్‌లు, 29 మంది టీఆర్‌టీ అసిస్టెంట్లు ఉన్నారు.
2. తెలంగాణ సచివాలయంలో పనిచేయాల్సిన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు: ముగ్గురు జూనియర్ స్టెనోలు, ముగ్గురు సీనియర్ స్టెనోలు, నలుగురు ప్రత్యేక స్టెనోలు, పది మంది ప్రైవేట్ కార్యదర్శులు, 78 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు.
 ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు
3. తెలంగాణ సచివాలయం, వివిధ విభాగాలు, చట్టసభల్లో పనిచేసే ఉద్యోగులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేలా ఉత్తర్వులు జారీ అయిన ఉద్యోగులందర్నీ తక్షణమే రిలీవ్ చేయాలనీ, లేని పక్షంలో సంబంధిత శాఖల అధిపతులపై క్రమశిక్షణ  చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అపాయింటెడ్ డే నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఉద్యోగుల విభజనకు సంబంధించి కసరత్తు ప్రారంభించినా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఉద్యోగులను తాత్కాలిక పద్దతిలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement