శాఖల నుంచి రోజూ పురోగతిపై సీఎస్‌లకు నివేదికలు
{పస్తుత పోస్టుల్లోనే విభజన తర్వాతా కొనసాగింపు
సీఎస్ పి.కె.మహంతి ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అప్పగింతలు సోమవారం నుంచి వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉద్యోగులకు బాధ్యతల అప్పగింత, స్వీకరణలకు వారం రోజుల గడువు విధించారు. రెండు రాష్ట్రాల మధ్య ఫైళ్లు, ఆస్తులు తదితర అధికార అప్పగింతలకు ప్రణాళికను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుత (కరెంట్) ఫైళ్లు, మూసివేసిన ఫైళ్లు, ఉమ్మడి ఫైళ్లు, ఆస్తుల అప్పగింతలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఈ అప్పగింతల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వరాదని, ఫైళ్లు ఎవరికి అప్పగించిందీ పేర్కొంటూ ఎక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖాధిపతులే అధికారిక మార్పిడి అప్పగింతలు సజావుగా సాగుతున్నాయా లేదా అనేదీ పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఫైళ్లు సాఫ్ట్ కాపీతో ప్రింట్‌నూ అప్పగించాలని సూచించారు. అలాగే ప్రతీ విభాగంలోని ఓపీ సెక్షన్ ఆఫీసర్ నుంచి అప్పగింతలు పూర్తి అయినట్లు ‘నో డ్యూస్’ సర్టిఫికెట్‌ను ఉద్యోగులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అది సమర్పించేవరకు ఆయా ఉద్యోగులకు జూన్ నెల వేతనం చెల్లంచరని వెల్లడించారు. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు ప్రతి రోజూ అప్పగింతల పురోగతిపై రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నివేదిక సమర్పించాలని సూచించారు. ఈనెల 9లోగా అప్పగింతలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు కేటాయించిన బ్లాకుల్లో ఆయా ఉద్యోగులకు వసతి కేటాయించాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు సబ్జెక్టుల కేటాయింపు కూడా కార్యదర్శులే చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులు, మిగతా ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో సక్రమంగా పనిచేసేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులను కోరారు. అలాగే కార్యాలయాల్లో ఫర్నిచర్ తక్కువైతే సాధారణ నిబంధనల మేరకు కొనుగోలు చేసుకోవాలని, టెలిఫోన్, ఫ్యాక్స్, కంప్యూటర్లు, ప్రింటర్లు తప్పనిసరిగా ఉండేలాగ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన పోస్టుల్లోనే విభజన తరువాత కూడా కొనసాగుతారని, ఎటువంటి మార్పూ ఉండదని పేర్కొంటూ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
9లోగా అప్పగింతలు పూర్తి!
Published Mon, Jun 2 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement
Advertisement