pk mohanty
-
ప్రైవేటు బ్యాంకుల ప్రమోటర్ల వాటాలపై సమీక్ష
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వాటి కార్పొరేట్ స్వరూపం, యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సమీక్షించనుంది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ పీకే మొహంతి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందం ఈ సమీక్ష చేపడుతుందని ఆర్బీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించి నియంత్రణలు, లైసెన్స్ నిబంధనలను సమీక్షించాలని ప్యానెల్‌ను ఆర్బీఐ కోరింది. యాజమాన్యం అధిక నియంత్రణ, అంతర్గత విధానాలపైనా ప్యానెల్ దృష్టి సారించనుంది. అలాగే, తొలిదశలో/లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత.. అనంతరం ప్రమోటర్ల వాటాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్ తగిన సిఫారసులు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో ప్రమోటర్లకు నిబంధనల కంటే అధిక వాటా ఉండగా, దీనిపై ఆర్బీఐ, బ్యాంకు మధ్య కోర్టు వెలుపల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోటక్ బ్యాంకులో ప్రమోటర్లు 26 శాతం వాటా కొనసాగించేందుకు అనుమతిస్తూ ఓటింగ్ హక్కులను 15 శాతం వాటాలకే ఆర్బీఐ పరిమితం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లకు ప్రమోటర్ల వాటా 40 శాతానికి.. 10 ఏళ్లకు 20 శాతానికి, 15 ఏళ్లకు 15 శాతానికి తగ్గించుకోవాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కోటక్ బ్యాంకు మాదిరే తామూ 26 శాతానికి వాటా పెంచుకునేందుకు అనుమతించాలని ఇండస్ఇండ్ బ్యాంకు ప్రమోటర్లు అయిన హిందుజా సోదరులు ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోగా.. అందుకు కేంద్ర బ్యాంకు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ అంశంపై దృష్టి సారించనుంది. -
జాస్తి రాముడు బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జాస్తి వెంకట రాముడు నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. -
9లోగా అప్పగింతలు పూర్తి!
శాఖల నుంచి రోజూ పురోగతిపై సీఎస్‌లకు నివేదికలు {పస్తుత పోస్టుల్లోనే విభజన తర్వాతా కొనసాగింపు సీఎస్ పి.కె.మహంతి ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అప్పగింతలు సోమవారం నుంచి వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉద్యోగులకు బాధ్యతల అప్పగింత, స్వీకరణలకు వారం రోజుల గడువు విధించారు. రెండు రాష్ట్రాల మధ్య ఫైళ్లు, ఆస్తులు తదితర అధికార అప్పగింతలకు ప్రణాళికను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుత (కరెంట్) ఫైళ్లు, మూసివేసిన ఫైళ్లు, ఉమ్మడి ఫైళ్లు, ఆస్తుల అప్పగింతలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఈ అప్పగింతల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వరాదని, ఫైళ్లు ఎవరికి అప్పగించిందీ పేర్కొంటూ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖాధిపతులే అధికారిక మార్పిడి అప్పగింతలు సజావుగా సాగుతున్నాయా లేదా అనేదీ పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఫైళ్లు సాఫ్ట్ కాపీతో ప్రింట్‌నూ అప్పగించాలని సూచించారు. అలాగే ప్రతీ విభాగంలోని ఓపీ సెక్షన్ ఆఫీసర్ నుంచి అప్పగింతలు పూర్తి అయినట్లు ‘నో డ్యూస్’ సర్టిఫికెట్‌ను ఉద్యోగులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అది సమర్పించేవరకు ఆయా ఉద్యోగులకు జూన్ నెల వేతనం చెల్లంచరని వెల్లడించారు. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు ప్రతి రోజూ అప్పగింతల పురోగతిపై రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నివేదిక సమర్పించాలని సూచించారు. ఈనెల 9లోగా అప్పగింతలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు కేటాయించిన బ్లాకుల్లో ఆయా ఉద్యోగులకు వసతి కేటాయించాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు సబ్జెక్టుల కేటాయింపు కూడా కార్యదర్శులే చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులు, మిగతా ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో సక్రమంగా పనిచేసేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులను కోరారు. అలాగే కార్యాలయాల్లో ఫర్నిచర్ తక్కువైతే సాధారణ నిబంధనల మేరకు కొనుగోలు చేసుకోవాలని, టెలిఫోన్, ఫ్యాక్స్, కంప్యూటర్లు, ప్రింటర్లు తప్పనిసరిగా ఉండేలాగ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన పోస్టుల్లోనే విభజన తరువాత కూడా కొనసాగుతారని, ఎటువంటి మార్పూ ఉండదని పేర్కొంటూ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
క్లిష్ట సమయంలో బాగా పనిచేశారు
కలెక్టర్లకు మహంతి ప్రశంసలు హైదరాబాద్: రాష్ట్ర విభజన.. వరుస ఎన్నికలు వంటి సంక్లిష్ట సమయాల్లో అద్భుతంగా పనిచేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ప్రశంసించారు. ‘అత్యంత క్లిష్టమైన సమయాల్లో కష్టపడి పనిచేసిన మీకు, జిల్లాల అధికార యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా’ అంటూ వారిని కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆదివారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో మహంతి ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన విధంగానే కొత్త రాష్ట్రాల ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉద్బోధించారు. ‘ఐఏఎస్‌లకు ప్రాంతీయ పరిధులు లేవు. మీరు కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల్లో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. రెండు రాష్ట్రాల ప్రగతి మీ చేతుల్లో ఉంది’ అని అన్నారు. ఈ సదస్సులో భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావుతోపాటు పలువురు సీనియర్ ఐఏఎస్‌లు పాల్గొన్నారు. విభజన అనంతరం కొత్తలో సమస్యలు ఉండవచ్చని, వాటి పరిష్కారంలో కలెక్టర్లు కీలక భూమిక పోషించాలని కృష్ణారావు సూచించారు. -
విభజన తీరుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ కు కాబోయే చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. విభజన తీరును పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఉద్యోగుల పంపిణీ, ఆస్తుల పంపకాల గురించి తెలిపారు. బడ్జెట్ తదితర వ్యవహారాల గురించి సవివరంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే పాలన సాగించడంపై సాధ్యాసాధ్యాల గురించి కూడా చంద్రబాబుకు అధికారులు వివరించారు. -
సంక్షేమ శాఖల్లో విభజన కొలిక్కి
* 58:42 ప్రాతిపదికన సీమాంధ్ర, తెలంగాణలకు పంపకాలు * గిరిజన శాఖలో మాత్రం 46 : 54 నిష్పత్తిని సూచించిన అధికారి * సంక్షేమ భవన్లో తెలంగాణకు మూడు, సీమాంధ్రకు నాలుగు ఫ్లోర్లు.. ప్రభుత్వానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: సంక్షేమశాఖల్లో విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఆస్తులు, అప్పులతో పాటు ఉద్యోగుల విభజన పై కూడా ప్రతిపాదనలు తయారుచేసిన సంక్షేమ శాఖల అధికారులు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతికి పంపించారు. 58 :42 నిష్పత్తిలో సీమాంధ్ర, తెలంగాణలకు విభజనను పూర్తిచేశారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమశాఖలు పనిచేస్తున్నాయి. 23 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లా యూనిట్‌గా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఉద్యోగులు, అధికారుల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో గత నెల రోజులుగా ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదిక రూపొందించినట్టు ఉన్నతాధికారి ఒకరు‘సాక్షి’కి తెలిపారు. గిరిజనశాఖ విషయంలో జనాభా పట్టని వైనం తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల జనాభా సీమాంధ్ర కన్నా ఎక్కువ కాబట్టి... తెలంగాణకు 54 శాతం, సీమాంధ్రకు 46 శాతం కింద పంపకాలుండాలని,ఆమేరకు నివేదిక రూపొందించాలని ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే అధికారి చెప్పిన విధంగా ఓ నివేదికను రూపొందించినప్పటికీ, ఆన్లైన్లో మాత్రం సీమాంధ్రకే 58 శాతం, తెలంగాణకు 42 శాతం ప్రకారమే విభజనను ప్రతిపాదించి అప్లోడ్ చేసినట్టు తెలిసింది. సీమాంధ్రకు 58 శాతం, తెలంగాణకు 42 శాతం ప్రాతిపదికన పంపకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని సంక్షేమ శాఖలు నివేదికలు రూపొందించాయి. ఓపెన్ కేటగిరీ కింద ఉద్యోగాలు సంపాదించి హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కూడా అవే మార్గదర్శకాలనే పాటించారు. కాగా గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి జనాభా ఆధారంగా విభజించాలని, సీమాంధ్ర కన్నా తెలంగాణలో గిరిజనులు అధికంగా ఉన్నందున పంపకాల విషయంలో ఉన్నతస్థాయి వర్గాల నుంచి కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. అయినప్పటికీ మిగిలిన శాఖల మాదిరిగానే పంపకాలతో నివేదిక పంపించినట్టు తెలిసింది. సంక్షేమ భవన్ రెండు విభాగాలుగా... మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌ను కూడా 58:42 ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణలకు విభజించారు. ఏడు అంతస్తులున్న ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడు అంతస్తులను తెలంగాణకు, నాలుగు నుంచి ఏడు అంతస్తులను సీమాంధ్రకు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే తెలంగాణ ఉద్యోగులు, అధికారులు పై మూడు అంతస్తులను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే, వారికి ప్రాధాన్యత ఇస్తూ తదనుగుణంగా మార్పులు చేయాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. శ్రీశైలం ఐటీడీఏ నుంచి వేరుకానున్న మహబూబ్‌నగర్ శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాలున్నాయి. విభజన కారణంగా శ్రీశైలం సీమాంధ్రకు వెళుతున్నందున మహబూబ్‌నగర్ జిల్లాను ఈ ఐటీడీఏ నుంచి వేరుచేశారు. ఇప్పటికి తెలంగాణలో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఐటీడీఏలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ అటవీప్రాంతం, చెంచుగ్రామాల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
రంగాలవారీగా ‘విభజన’ లక్ష్యాలు
అన్ని శాఖలు, కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలకు సీఎస్ సర్క్యులర్ పది పేజీల సర్క్యులర్‌తో పాటు తొమ్మిది నమూనా పత్రాలు మే 31కల్లా ఎటువంటి ఇబ్బందుల్లేకుండా 2 రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి తెలంగాణకు, ఆంధ్రాకు వేర్వేరుగా చట్టాలు, నిబంధనలను ప్రతిపాదించాలి విభజన పురోగతిపై ప్రతి శనివారం సీఎస్‌కు నివేదిక.. ప్రతి మంగళవారం సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పనుల పూర్తికి రంగాలవారీగా లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె.మహంతి శుక్రవారం అన్ని శాఖలు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు సర్క్యులర్ జారీ చేశారు. పది పేజీలతో కూడిన ఈ సర్క్యులర్‌కు రంగాలవారీగా వివరాల కోసం తొమ్మిది నమూనా పత్రాలను కూడా జతపరిచారు. మే 31వ తేదీకల్లా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి అన్ని రంగాలు సిద్ధంగా ఉండాలని అందులో స్పష్టం చేశారు. విభజన పురోగతిపై అన్ని శాఖల నుంచి ప్రతి శనివారం సీఎస్‌కు నివేదిక పంపాలని తెలిపారు. ప్రతి మంగళశారం సీఎస్ అన్ని శాఖల అధికారులతో సమీక్షలు చేస్తారని వెల్లడించారు. ప్రతి శాఖలో విభజనకు, ప్రతి పనికి జవాబుదారీగా ఒకరిని నోడల్ అధికారిగా నియమించాలి. - ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలు, నియంత్రణలకు సంబంధించి జాబితాలు సిద్ధం చేయాలి. ఈ చట్టాలు, నిబంధనలు, నియంత్రణలు ఇరు రాష్ట్రాల్లో అమలుకు అనుగుణంగా ఉంటాయో లేదో పరిశీలించాలి. అవసరం లేని చట్టాలు, నిబంధనల రద్దుకు ప్రతిపాదించాలి. వేర్వేరు చట్టాలు, నిబంధనలను ప్రతిపాదించాలి. ఈ ప్రక్రియను మార్చి 29వ తేదీలోగా పూర్తి చేయాలి. - మార్చి 1కల్లా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్లను వేర్వేరు చేయాలి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి ఫైళ్లను గుర్తించాలి. ప్రతి ఫైలుతోపాటు ప్రతి పేజీకీ నెంబరు వేయాలి. కరెంట్, నోట్ ఫైళ్లను మూడేసి ప్రతుల చొప్పున జిరాక్స్ తీయాలి. - ప్రతి కార్యాలయంలో అన్ని సెక్షన్లు, యూనిట్లలో పర్సనల్ రిజిస్టర్లను మార్చి 25కల్లా విభజించాలి. - శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లోని రికార్డు రూమ్‌లలో ఫైళ్ల విభజనను ఏప్రిల్ 30కల్లా పూర్తి చేయాలి. ఈ కార్యాలయాల్లోని చరాస్థులైన చిన్న గుండు సూది నుంచి పెద్ద జనరేటర్లు, ఫర్నీచర్, వాహనాలు, కంప్యూటర్లు, ఫోన్ల లెక్కింపు ప్రక్రియను మార్చి 25కల్లా పూర్తి చేయాలి. ఈ సంస్థల్లో మంజూరైన పోస్టులను మాత్రమే విభజనకు పరిగణనలోకి తీసుకోవాలి. అడ్హాక్, సూపర్‌న్యూమరీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవద్దు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా ఈ శాఖల స్వరూపాలు, మానవ వన రుల్లో సంస్కరణలు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిపైన పడే పనిభారాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన మార్పులతో ప్రతిపాదనలు చేయాలి అనుబంధ రంగాలకు చెందిన విభాగాలన్నింటినీ ఒకే శాఖ పరిధిలోకి తెస్తూ ప్రతిపాదించాలి. ఈ ప్రతిపాదనలను మార్చి 29లోగా అపెక్స్ కమిటీకి సమర్పించాలి. మార్చి 1వ తేదీనాటికి మంజూరైన పోస్టుల వివరాలను సేకరించాలి. దీర్ఘకాలిక సెలవు, శిక్షణ, డిప్యుటేషన్, ఇతర విధులు, విదేశీ సర్వీసు, సస్పెన్షన్, అనధికారిక గైర్హాజర్‌లో ఉన్న ఉద్యోగులు, అధికారుల వివరాల సేకరణను ఈ నెల 18 కల్లా పూర్తి చేయాలి. - జీహెచ్ఎంసీ పరిధిలోని స్థిరాస్తుల వివరాలను ఏప్రిల్ 18కి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డేటా బేస్‌లో నమోదు చేయాలి. - వివిధ రకాల పనుల కాంట్రాక్టుల వివరాలను వేర్వేరుగా గుర్తించి ప్రస్తుత కాంట్రాక్టులకు సవరణలు చేయడానికి ప్రతిపాదించాలి. - ప్రస్తుత పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల అమలుకు అవసరమైన బడ్జెట్‌ను అంచనా వేయాలి. ప్రతి శాఖలో కేంద్ర పథకాలు, విదేశీ సాయం, ఆర్థిక సంఘం నిధుల విడుదల, వ్యయం, వినియోగపత్రాలను ఏప్రిల్ 10కల్లా పూర్తి చేయాలి. - ఐటీ, మౌలిక సదుపాయాలతో పాటు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రక్రియను మే 5కల్లా పూర్తిచేయాలి. ఐటీ ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్టు ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలి. - రెండు రాష్ట్రాల్లో ఆర్థిక అవసరాలను లోతుగా అధ్యయనం చేయాలి. ఆర్థిక లోటు, ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదిక మార్చి 29లోగా 14వ ఆర్థిక సంఘానికి పంపించాలి. -
గ్రామాలు, మండలాల్లో పాలనా వ్యవస్థ పటిష్టం
గ్రామాల్లో ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా వ్యవస్థను నిర్మించనున్న కమిటీ పోస్టుల విభజనపై సర్కారు కసరత్తు పూర్తి రాష్ట్ర కేడర్‌లోని 56 వేల మంది ఉద్యోగులే ఇరు రాష్ట్రాలకు పంపిణీ తెలంగాణ నుంచి సీమాంధ్రకు వెళ్లాల్సింది 2,800 మంది సీమాంధ్ర నుంచి తెలంగాణకు వెళ్లాల్సింది 1,200 మంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో గ్రామ, మండల స్థాయి పరిపాలన వ్యవస్థలను మరింత పటి ష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అన్ని శాఖలను ఆదేశించారు. రాష్ట్ర విభజనలో ప్రధానమైన ఉద్యోగుల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు, దేవాదాయ శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శితో కూడిన కమిటీని సీఎస్ నియమించారు. ఈ కమిటీ ఇరు రాష్ట్రాలకు రాష్ర్ట స్థారుు కేడర్ పోస్టుల విభజనతో పాటు.. ప్రధానంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న 10-15 మంది ఉద్యోగుల ద్వారా ఆ గ్రామానికి అవసరమైన ప్రభుత్వ సేవలన్నీ సక్రమంగా అందేలా వ్యవస్థను నిర్మిస్తుంది. మండల స్థాయి పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తుంది. అలాగే ఉన్నతస్థాయిలో అవసరానికి మించి ఉన్న శాఖలు, ఉద్యోగులు, సిబ్బందిని వీలైనంత మేరకు కుదించేందుకు చేపట్టాల్సిన సంస్కరణలను సిఫారసు చేస్తుంది. ఒకే రకమైన పనులు చేస్తున్న పలు శాఖలన్నింటినీ ఒకే శాఖలో విలీనం చేస్తుంది. పోస్టుల విభజనకు సంబంధించి సీఎస్ ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల విభజన ఉండదు. వారు ఏ ప్రాంతం వారైనా ప్రస్తుతం పనిచేస్తున్న చోటే పనిచేస్తారు. కేవలం రాష్ట్ర రాజధానితో పాటు వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఈ ఉద్యోగుల పంపిణీకి కూడా ఆప్షన్లను అడుగుతారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్రం నియమించిన కమలనాధన్ కమిటీ రూపొందిస్తోంది. ఈ కమిటీయే ఉద్యోగుల పంపిణీ చేస్తుంది. ఇరు రాష్ట్రాలకు ఏ పోస్టులు ఎన్ని అనే అంశంపై కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రస్థాయి పోస్టులు మొత్తం 84 వేలు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్న వారు 56 వేల మంది మాత్రమే ఉన్నారు. ఈ 56 వేల మందిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారు. ఆ ప్రాతిపదికన పంపిణీ చేసిన తరువాత కేవలం 1,200 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నారు. అలాగే 2,800 మంది సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు తెలంగాణాలో పనిచేస్తున్నారు. వీరు మాత్రమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారాల్సి ఉంటుందని అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోస్టు ఒక్కటే ఉందనుకుంటే మరో రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయి పోస్టును సృష్టించనున్నారు. ఈ విధంగా పోస్టుల పంపిణీలో ఏ రాష్ట్రంలోనైనా తక్కువ పోస్టులుంటే వాటిని ఆ రాష్ట్రంలో కొత్తగా సృష్టిస్తారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. మరోవైపు సచివాలయంలో శాఖలు, కొన్ని విభాగాల కుదింపు చర్యలను ఆర్థిక శాఖ చేపట్టింది. ప్రధానంగా ఆర్థిక శాఖలో ప్రస్తుతం ఐదుగురు ముఖ్య కార్యదర్శుల పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి విభాగాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక శాఖలో ఇటు సీమాంధ్రకు, అటు తెలంగాణకు ఐఏఎస్ హోదాలో రెండు చొప్పున పోస్టులుంటే చాలని ప్రతిపాదించారు. పరిశ్రమల శాఖలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఒకరు లేదా ఇద్దరు ఐఏఎస్ స్థారుు పోస్టులుంటే చాలనే నిర్ణయానికి వచ్చారు. అలాగే రెవెన్యూ శాఖలో ప్రస్తుతం నలుగురు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో రెండు చొప్పున ఐఏఎస్ పోస్టులుంటే చాలని ప్రతిపదించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న అన్నిరకాల కేటగిరీల ఉద్యోగులు మొత్తం.. 13,51,838. వీరిలో ఇప్పటివరకు 11,22,566 మంది ఉద్యోగుల పూర్తి వివరాలను కంప్యూటరీకరించారు. ఉద్యోగుల కేటగిరీ సంఖ్య రెగ్యులర్ ఉద్యోగులు 7,16,137 గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు 21,579 కాంట్రాక్టు ఉద్యోగులు 54,598 వర్క్ చార్జెడ్ ఉద్యోగులు 12,882 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 36,952 ఎన్ఎంఆర్ అండ్ ఇతరులు 21,050 హోంగార్డులు, ఇతరులు 2,59,368 మొత్తం 11,22,566 -
ఫైళ్లు గవర్నర్‌కే పంపండి: సీఎస్ సూచన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి గత రెండు నెలల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కీలక ఫైళ్లను తనకు కాకుండా నేరుగా గవర్నర్‌కే పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి వివిధ శాఖల అధిపతులకు సూచించారు. బుధవారం రాష్ట్ర విభజనపై సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ ఫైళ్లను గవర్నర్‌కు రీ సర్క్యులేట్ చేయాలో సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులే నిర్ణయం తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ఈ విషయమై తన నుంచి తదుపరి ఆదేశాలు, వివరణ కోరవద్దని కూడా చెప్పారు. ఈ మేరకు కొన్ని అంతర్గత ఆదేశాలను జారీ చేశారు. దీనిపై మహంతి, కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సంవాదం నెలకొంది. మీనా, ఎస్.పి.సింగ్‌తో పాటు పలువురు సీఎస్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. గవర్నర్‌కు ఫైళ్లు సీఎస్ ద్వారానే వెళ్లాలని వారన్నారు. నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. అయితే ఇందుకు సీఎస్ ససేమిరా అన్నారు. తనకు రాకుండా నేరుగా సీఎం ఆమోదానికి పంపిన ఫైళ్లను ఇప్పుడు తనకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. కొందరు అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. విజిలెన్స్, ఏసీబీ కేసుల ఉపసంహరణకు సంబంధించి శాఖాధిపతులుగా తాము సిఫారసు చేయకపోయినా మంత్రులు సిఫారసు చేసి, ఫైళ్లను నేరుగా సీఎం ఆమోదానికి పంపుతున్నారని, ఆ తరువాత తమకు వస్తే ఆదేశాలు జారీ చేశామని వివరించారు. అలాంటి ఫైళ్లు ఇప్పుడు సీఎస్ ద్వారానే గవర్నర్‌కు వెళ్లాలని అన్నారు. పదోన్నతులు ఇవ్వను.. ఇవ్వాల్సిందే విభజన నేపథ్యంలో ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వబోనని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. సిన్హా స్పష్టం చేశారు. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారులైన నాగిరెడ్డి, ఎల్.వి.సుబ్రహ్మణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన పరిధిలోకి రాని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో పనిచేస్తున్న, త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని వారు పేర్కొన్నారు. అలాగే న్యాయస్థానాల్లో కేసులకు సంబంధించిన వారికీ పదోన్నతులు ఇవ్వాలన్నారు. సాగునీటి శాఖలో 2001-2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేవలం కోర్టు కేసు కారణంగా ఇన్చార్జిలుగా పదోన్నతితో కొనసాగుతున్న 1,334 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు.. కోర్టు కేసు తేలిపోవడంతో గురువారం డీపీసీ ద్వారా పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. అరుుతే విభజన నేపథ్యంలో ఈ పదోన్నతులపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియజేయూల్సిందిగా డీపీసీ కమిటీ చైర్మన్ టక్కర్ జీఏడీ అధిపతి సిన్హాకు లేఖ రాశారు. -
బ్యాంకు సేవలు.. పల్లెలకు విస్తరించాలి
బ్యాంకులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన రాష్ట్రానికి నాబార్డు రుణసాయం రూ. 1,25,039 కోట్లు దేశంలోనే ఇది అత్యధికం సాక్షి, హైదరాబాద్: గ్రామాభివృద్ధే లక్ష్యంగా బ్యాంకు సేవలు మరింత విస్తరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సూచించారు. గ్రామసభల తీర్మానం మేరకే రుణాలు ఇవ్వాలని కోరారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. వివిధ బ్యాంకుల, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణ పరపతి లక్ష్యాలపై సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ... 2014-15 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు మన రాష్ట్రానికి రూ. 1,25,039 కోట్ల రుణ సాయం అందించడం హర్షణీయమన్నారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయాధారిత రంగాల అభ్యున్నతికే ఈ రుణాలు చేరినప్పుడే గ్రామీణాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 2 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని, వీరిలో అత్యధికులు విద్యావంతులు, మహిళలు ఉన్నారని, రుణాల మంజురులో వీరిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 250 ప్రాథమిక సహకార గ్రామీణ బ్యాంకులకు, 14 జిల్లా సహకార గ్రామీణ బ్యాంకులకు నాబార్డు రూ.146 కోట్లు అందించిందని చెప్పారు. రాష్ట్రంలో పేద రైతులకు రుణ పరపతి మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, ఇప్పటికీ చాలామంది ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నారని ఆర్బీఐ ప్రాంతీయ డెరైక్టర్ కెఆర్ దాస్ తెలిపారు. రుణాల మంజూరులో కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయని, దీనిపై లోతైన చర్చ జరగాల్సి ఉందని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు మన్మోహన్సింగ్, డి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నాబార్డు సీజీఎం జీజీ మమెమ్ నాబార్డు పురోగతిని సమావేశం ముందుంచారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు నాబార్డు రూ.1,25,039 కోట్ల ఆర్థిక తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రధాన రంగాలకు వీటిని వెచ్చిస్తారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 14.58 శాతం అధికం. పంట రుణాల కింద రూ. 68,953 కోట్లు, వ్యవసాయ స్వల్పకాలిక రుణాలు రూ. 14,585 కోట్లు, అతి సూక్ష్మ, సూక్ష్మ, మధ్య తరగతి (ఎంఎస్ఎంఈ) విభాగానికి రూ. 12,529 కోట్ల రుణాలు అవసరమని అంచనా వేశారు. రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగులు అవసరమని గుర్తించారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
ఎల్లుండి హస్తినకు బిల్లు చర్చల సారాంశం
సోమవారం ఉదయం విమానంలో తీసుకెళ్లనున్న ప్రత్యేకాధికారి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013కు సంబంధించి రాష్ట్ర శాసనమండలి, శాసనసభలో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి సోమవారం ఢిల్లీకి పంపించనున్నారు. ఉభయ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, సారాంశం, చర్చల రికార్డు ప్రతులు, ప్రతిపాదిత సవరణలు, సూచనలను క్రోడీకరించి ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసే పని ముగింపు దశకు వచ్చింది. ఉభయ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలతో క్రోడీకరించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారానే కేంద్ర హోం శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నివేదిక శుక్రవారం సాయంత్రమే సీఎస్ పి.కె.మహంతికి చేరింది. ఉభయసభల అభిప్రాయాలను సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో హస్తినకు పంపాలని ఆయన నిర్ణయించారు. చర్చల రికార్డులపై ఏం చేయాలనే అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రధానాంశాలపై సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగా సారాంశాలను సాధారణ పరిపాలన శాఖ తయారు చేయనుంది. ప్రభుత్వ తీర్మానం ప్రతిని, సభ్యుల సవరణలను కూడా నివేదికకు జత చేయనున్నారు. మొత్తం కలిపి 400 నుంచి 500 పేజీల బండిల్ తయారవుతుందని సమాచారం. బిల్లును, సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సభలో చర్చ ముగిసిన మూడు రోజుల్లోగా పంపించాల్సిందిగా రాష్ట్రపతి పేర్కొనడం తెలిసిందే. మూడు రోజుల గడువు ఆదివారంతో ముగియనుంది. ఆ రోజు సెలవైనందున సోమవారం ఉదయమే పంపనున్నారు. -
బస్సుకు దారి చూపండి
ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లకు కనెక్టివిటీ కావాలి మరో 859 బస్షెల్టర్లు అవసరం సీటీఎస్ నివేదికపై ఆర్టీసీ సూచనలు సాక్షి, సిటీబ్యూరో: మహానగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా అభివృద్ధి కోసం లీ అసోసియేట్స్ సమర్పించిన సమగ్ర రవాణా అధ్యయన (సీటీఎస్) నివేదికపై ఆర్టీసీ పలు సూచనలు చేసింది. బుధవారం సీటీఎస్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్రావు, ఈడీ కోటేశ్వర్రావు, రవాణా కమిషనర్ జి.అనంతరాము తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఆర్టీసీ నివేదికపై చర్చ జరిగింది. తక్షణ అవసరాలతో పాటు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న 66 మెట్రో రైల్వేస్టేషన్లతో పాటు, ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లకు సిటీ బస్సును అనుసంధానం చేయాలని ఆర్టీసీ నివేదిక పేర్కొంది. అలాగే 2041 నాటికి దశలవారీగా జరుగనున్న ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి అనుగుణంగా అన్ని రేడియల్ రోడ్లపై బస్‌బేలు, బస్స్టేషన్లు, ప్రయాణికుల వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం ప్రతి రోజు 35 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న అతి పెద్ద ప్రజా రవాణా సంస్థయిన ఆర్టీసీని బలోపేతం చేసేందుకు, భవిష్యత్తు విస్తరకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అవేమిటంటే... నగరంలోని 26 ఎంఎంటీఎస్ స్టేషన్లలో 15కు మాత్రమే సిటీ బస్సులు వెళ్లేందుకు రోడ్డు, పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి. మరో 11 స్టేషన్లకు కూడా తక్షణమే కనెక్టివిటీ కల్పించాలి. అందుబాటులోకి రానున్న 66 మెట్రో రైలు స్టేషన్లను కూడా సిటీ బస్సులతో అనుసంధానించాలి. అక్కడ బస్‌బేలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. గ్రేటర్ పరిధిలో మరో 753 బస్షెల్టర్లు (ప్రస్తుతం ఉన్నవి 946) ఏర్పాటు చేయాలి. హెచ్ఎండిఏ పరిధిలో 41 బస్షెల్టర్లున్నాయి. మరో 106 తక్షణమే నిర్మించాలి. మరో 50 బస్‌బేలు ఏర్పాటు చేయాలి. సికింద్రాబాద్, ఎల్బీనగర్, మెహదీపట్నం, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలతో పాటు, రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 20 భారీ జంక్షన్ల వద్ద ట్రాన్సిట్ బస్స్టేషన్లు ఏర్పాటు చేయాలి. 2041 నాటికి దశలవారీగా అందుబాటులోకి రానున్న 33 రేడియల్ రోడ్లపై ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 200 బస్షెల్టర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 3800 బస్సులతో ఆర్టీసీ ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తోంది. మహానగర విస్తరణకు అనుగుణంగా 2021 నాటికి 7000, 2041 నాటికి 12000 బస్సులు పెరిగే అవకాశం ఉంది. వీటికి హెచ్ఎంఎ పరిధిలో 30 బస్‌డిపోలు అవసరం. వాటి కోసం తగిన విధంగా స్థలాల కేటాయింపు, రోడ్డు సదుపాయం అవసరం. -
2015 ఉగాది కానుకగా ‘మెట్రో’
సాక్షి,సిటీబ్యూరో: నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో మొదటి దశ పనులను 2015 ఉగాదికి పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి హెచ్ఎంఆర్ అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉన్నందున రద్దీని క్రమబద్దీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా మారిన నగర మెట్రో ప్రాజెక్టు పనులను త్వరిత గతిన పూర్తిచేసేందుకు అధికారులు సహకరించాలన్నారు. గురువారం సచివాలయంలో జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీలో మెట్రో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి పనుల పురోగతిని వివరించారు. సుమారు 72 కిలోమీటర్ల మెట్రో పనుల్లో 35 కిలోమీటర్ల మేర యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు 1001 పిల్లర్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని, నాగోల్-మెట్టుగూడ మార్గంలో పిల్లర్లపై పట్టాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. దీనిపై మహంతి మాట్లాడుతూ.. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉండాలని సూచించారు. దెబ్బతిన్న రహదారులకు సత్వరం మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ పొదుపు పాటిస్తేనే సబ్సిడీ: మహంతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇక నుంచి విద్యుత్ పొదుపు పాటిస్తేనే విద్యుత్ సబ్సిడీ అందనుంది. ఈ కొత్త విధానంపై పరిశ్రమలశాఖ అధ్యయనం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ (ఎస్ఈసీఎం) చైర్పర్సన్ పి.కె. మహంతి తెలిపారు. నిర్ణయించిన మేరకు విద్యుత్ పొదుపు చేస్తేనే రాయితీ ఇస్తామని, దీనిపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులతో ఆయన సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎస్ చెప్పిన ముఖ్యాంశాలు: అన్ని ప్రభుత్వశాఖల్లో విద్యుత్ పొదుపు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించామన్నారు. ఎల్ఈడీ బల్బులతో అధిక విద్యుత్ వినియోగాన్ని నివారించవచ్చన్నారు. వ్యవసాయ మోటార్లు పాడైనపుడు రీ-వైండింగ్‌ను స్థానికంగా చేయిస్తున్నారని.. అది నాణ్యత లేకపోవడంతో విద్యుత్ అధికంగా ఖర్చవుతోందని తేలిందన్నారు. అందువల్ల గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా రీ-వైండింగ్ చేసే అంశంపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు. అనంతపురం, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, తిరుపతి, వైజాగ్ నగరాల్లో వీధి దీపాలకు ప్రస్తుతం 186 ఎంయూలను వినియోగిస్తున్నారు. దీనిని 93 ఎంయూలకు తగ్గించుకోవచ్చన్నారు. మంచి గాలి, వెలుతురు ఉండే విధంగా బిల్డింగ్లు నిర్మించాలనే ఉద్దేశంతో రూపొం దిస్తున్న బిల్డింగ్ కోడ్‌ను ఆగస్టు 15 నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు. -
బస్సు దుర్ఘటనపై సీఐడీ దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద 45 మందిని బలిగొన్న ఘోర దుర్ఘటనపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బస్సు ప్రమాదానికి కారణాలు, బాధ్యులను గుర్తించడంతోపాటు బస్సు యజమాన్యం నిబంధనలను అతిక్రమించిన తీరుపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. బస్సు దుర్ఘటనపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ పి.కె.మహంతి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి, డీజీపీ ప్రసాదరావు, ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్, రవాణా శాఖ కమిషనర్ అనంతరాము, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం తీరు, ప్రాథమికంగా నిర్ధారించిన కారణాలను సీఎం అధికారులనడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. గతేడాది షిర్డీకి వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు బ్రిడ్జిపై నుంచి పడిపోయి 32 మంది మృతి చెందిన ఘటనలో, తాజా దుర్ఘటనలో ఉన్నవి వోల్వో బస్సులే కావటంతో.. కారణాలను పూర్తిగా తెలుసుకోవాల్సి ఉన్నం దున సీఐడీ విచారణ అవసరమన్నారు. ఈ మేరకు సీఐడీ విచారణకు ఆదేశించి, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోర దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసు చేసేందుకు మరో అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో ఐఏఎస్ అధికారులతో పాటు ఆటోమొబైల్, ఇంధనశాఖ ఇంజనీర్లకు చోటు కల్పించాలన్నారు. బుధవారం నాటి దుర్ఘటనలో.. నిమిషాల వ్యవధిలోనే వోల్వో బస్సు బుగ్గిగా మారటం, ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా తలుపులు తెరుచుకోకపోవటం, అత్యవసర ద్వారాలను వారు ఉపయోగించుకోలేకపోవటం.. తదితర ప్రశ్నలకు జవాబులు దొరకాల్సిన అవసరం ఉందని సమావేశం భావించింది. డీఎన్ఏ పరీక్షలను త్వరగా పూర్తిచేసి, వారం రోజుల్లో మృతదేహాలను బంధువులకు అందజేయాలని సీఎం ఆదేశించారు. -
హెల్త్‌కార్డులపై చర్చలు విఫలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి గురువారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గత నాలుగేళ్లలో ఈ అంశంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం 25 సార్లు చర్చలు జరిపినప్పటికీ.. వైద్య సేవలకు నగదు రహిత సౌకర్యం అందించే విషయంలో పరిమితి, అవుట్ పేషంట్ సేవల చేర్పు.. అంశాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్‌కార్డుల జారీ విధి విధానాలపై వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో గురువారం సీఎస్ చర్చించారు. ఈ సందర్భంగా నగదు రహిత వైద్యానికి సంబంధించిన పరిమితి అంశంలో ఉద్యోగ సంఘాల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో ప్రకటించినట్లుగా రూ.2 లక్షల పరిమితితో హెల్త్‌కార్డులు అందించేలా తక్షణమే జీవో జారీ చేసి దీపావళి కానుకగా ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు కోరారు. పరిమితిలేని నగదు రహిత వైద్యం అందించేలా హెల్త్‌కార్డులు జారీ చేయాలని, పరిమితి పెడితే కార్డులు తీసుకునే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎన్జీవో), తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్జీవో)లు స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని ఆయా సంఘాల ప్రతినిధులు మీడియా సమావేశంలోనూ ప్రకటించారు. ‘రూ. 2 లక్షల పరిమితితోనైనా దీపావళి కానుకగా హెల్త్‌కార్డులు అందించేలా తక్షణమే జీవో జారీ చేయాలి. ఏమైనా లోపాలు ఉంటే తరువాత సవరించుకోవచ్చు అని సీఎస్‌కు చెప్పాం. దీనిపై మంత్రివర్గ ఉపసంఘంతో, ముఖ్యమంత్రితో చర్చించి వీలైనంత త్వరగా జీవో ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారు’ అని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య (తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాలన్నీ ఇందులో ఉన్నాయి) ప్రతినిధులు మురళీ కృష్ణ, నరేందర్‌రావు, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.పద్మాచారి తెలిపారు. పరిమితి పెడితే కార్డులు తీసుకోం ‘నగదు రహిత వైద్యానికి సంబంధించి ఎలాంటి పరిమితి లేకుండా హెల్త్‌కార్డులు జారీచేయాలని డిమాండు చేశాం. ఆస్పత్రులకు వైద్య ప్యాకేజీల విషయంలో ప్రభుత్వం ఎలాంటి పరిమితినైనా పెట్టుకోవచ్చు. ఉద్యోగుల వైద్యానికి మాత్రం పరిమితి ఉండరాదని స్పష్టం చేశాం. పరిమితి విధిస్తే మాత్రం కార్డులు తీసుకునే ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పాం. దీనిని అమలు చేసే ట్రస్టులోనూ ఉద్యోగుల భాగస్వామ్యం 50 శాతం తగ్గకుండా ఉండాలని కోరాం. ముఖ్యమంత్రితోనూ, మంత్రివర్గ ఉపసంఘంతోనూ చర్చించి వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇస్తామని సీఎస్ చెప్పారు’ అని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ వేర్వేరుగా మీడియాకు వివరించారు. -
కేంద్రానికి ఐఏఎస్, ఐపీఎస్‌ల వివరాలు
* నివేదించిన సీఎస్ మహంతి * ఉన్నతాధికారుల విభజన, యంత్రాంగం పంపిణీపై నివేదికలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రం అఖిల భారత సర్వీసు అధికారులను కొత్తగా ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశంపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నదీజలాలు, విద్యుత్, సహజవనరులు, ఆస్తులు, అప్పుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక ప్యాకేజీల విషయమై ఆయా శాఖల రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్న కేంద్రం బుధవారం ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల వివరాలను సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె.మహంతి ఈ వివరాలు అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఈఎస్, ఐఐఎస్‌ల వివరాలను కేంద్ర ప్రభుత్వ కీలక శాఖల ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందజేశారు. ఇరు ప్రాంతాల నుంచి ఎంతమంది కేంద్ర సర్వీసు అధికారులున్నారు, ఏయే స్థాయిల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల అధికారులు ఎంతమంది తదితర వివరాలను తెలియజేశారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శి ఎస్.కె.సర్కార్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో పాటు మరికొందరు కీలక శాఖ కార్యదర్శుల ముందు హాజరైన సీఎస్ రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్న ఉన్నతాధికారుల విభజన, పాలనా యంత్రాంగం పంపిణీ అంశాలపై నివేదికలు అందజేశారు. విభజన తర్వాత ఏ ప్రాంతానికి ఎంతమంది వెళ్లాల్సి ఉందో నివేదికలో పొందుపరిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం 280 మంది ఐఏఎస్‌లు, 258 మంది ఐపీఎస్‌లు, ఇతర కేంద్ర సర్వీసు అధికారులు 300కు పైగా ఉన్నట్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన అధికారుల పంపిణీని ఎలా జరపాలన్న దానిపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఈ భేటీకి ముందు సీఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి, చెక్‌పోస్టుల ఏర్పాటు తదితర అంశాలపై సీఈసీ పలు సూచనలు చేసినట్లు సమాచారం. -
‘సమైక్య’ హమీ ఇచ్చేవరకూ సమ్మె అప్పటిదాకా విరమించేది లేదు : ఏపీఎన్జీవో
సీఎస్‌కు ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల చర్చలు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరిన మహంతి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సమ్మె విరమించలేమని తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ సమ్మె విరమించబోమని సమ్మెలో ఉన్న ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి తేల్చిచెప్పాయి. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఈయూ సమైక్యాంధ్ర పోరాట సమితి చైర్మన్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్ దామోదరరావు, ఎన్ఎంయూ సీమాంధ్ర నేతలు ప్రసాద్, రమణారెడ్డి, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, నాయకులు మురళీమోహన్, కృష్ణయ్య తదితరులు మంగళవారం సీఎస్‌తో చర్చలకు హాజరయ్యారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తిరుమల, విజయవాడల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయని, ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రజా రవాణా స్తంభించిందని చెప్పిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా తాము సమ్మెలో ఉన్నామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించలేమని ఉద్యోగులు తేల్చిచెప్పారు. విభజన జరిగితే ఉద్యోగులకు కలిగే ఇబ్బందులు, నష్టాల గురించి సీఎస్ అడిగినప్పుడు.. ‘ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో శాఖల వారీగా సమస్యలను వివరించాం. మంత్రుల సూచన మేరకు సమస్యలు, ఇబ్బందులపై ఉద్యోగులు సంబంధిత శాఖలకు నివేదికలూ ఇచ్చారు. ఆ సమావేశంలో మీరు (సీఎస్) కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సమస్యల గురించి అడగడం బాధ కలిగించింది’ అని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వివరించి ఆయన వద్ద సమావేశం ఏర్పాటు చేయిస్తానని సీఎస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎస్మా ప్రయోగిస్తే ఉద్యమం మరింత ఉధృతం ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా సమ్మె వల్ల ఇబ్బంది పడుతున్నారని, అయితే ఈ ఇబ్బందుల కంటే విభజన వల్ల వచ్చే సమస్యలు తీవ్రమైనవని సీఎస్‌కు చెప్పామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. విభజన జరగదని రాజకీయంగా స్పష్టమైన హామీ వస్తే సమ్మె విరమణకు సిద్ధమని ఆయన చెప్పారు. ఆయన సీఎస్‌తో భేటీ అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకులాల సిబ్బంది సమ్మె విరమించి వెంటనే వస్తే సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరిస్తామని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మెసేజ్‌లు పంపటాన్ని అశోక్‌బాబు తప్పుబట్టారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఫిర్యాదు చేశామని, అందుకు సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎస్మా ప్రయోగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ వదిలి ప్రజల్లోకి రండి... అంతకుముందు ఏపీఎన్జీవో కార్యాలయంలో అశోక్‌బాబు మాట్లాడుతూ.. తమ పదవులకు రాజీనామా సమర్పించి స్పీకర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఎంపీలు, వారి రాజీనామాల్లో చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీని వదిలి ప్రజా ఉద్యమంలోకి రావాలని సూచించారు. రాజీనామాలు చేశామని చెప్తూ.. ప్రభుత్వ క్వార్టర్లు, విమాన టికెట్లు తదితర అధికారిక సదుపాయాలను వినియోగించుకోవడం ఎంతమాత్రం నైతికత అనిపించుకోదన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా.. రాజీనామా చేయని ఎంపీల ఇళ్ల వద్ద ధర్నాలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పదవులకు రాజీనామాలు చేసి, ఇంకా ఢిల్లీలోనే ఉన్న ఎంపీలకు మినహాయింపేమీ లేదని స్పష్టంచేశారు. ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, నైతికంగా పదవులను త్యజించిన నేతలు ఢిల్లీని వదిలి పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విభజన నిర్ణయం వెనక్కు తీసుకోవడమనేది రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యం కనుక.. ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే యూపీఏ ప్రభుత్వం తలొగ్గక తప్పదన్నారు. రాజీనామా చేయని ఎంపీల ఇళ్ల వద్ద ఆందోళన ఉధృతం చేయడం ద్వారా వారిపై మరింత ఒత్తిడి పెంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఈ నెల 3న (గురువారం) సమావేశమై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సమ్మె కొనసాగింపుపై చర్చిస్తామన్నారు. స్పష్టమైన హామీ ఇస్తే విరమిస్తాం: మురళీకృష్ణ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం లేదా రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ఏర్పాటై 13 సంవత్సరాలు పూర్తయినా, ఉద్యోగుల సర్వీస్ సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మన రాష్ట్ర పరిస్థితి గతంలో ఏర్పాటైన మూడు రాష్ట్రాల కంటే భిన్నమైనదని, క్లిష్టమైందని.. విభజన వల్ల పలు సమస్యలు వస్తాయని చెప్పారు. విభజన జరిగినా ఉద్యోగులకు సమస్యలేమీ ఉండవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. అవసరమైతే సీఎం కూడా చర్చలు జరుపుతారు: ఆనం ఉద్యోగులు సమ్మె విరమించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా చర్చలు జరుపుతారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో సీఎంను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర కమిటీ హైదరాబాద్ రావాలని, ఇక్కడి నుంచి ఉద్యోగులు ఢిల్లీకి రాలేరని సోనియాగాంధీకి, దిగ్విజయ్‌సింగ్‌కు సీఎం చెప్పారని, త్వరలోనే కమిటీ ఇక్కడికి వచ్చే అవకాశముందని మంత్రి వివరించారు. సీఎం వైఖరి అధిష్టానాన్ని ధిక్కరించేలా ఒక అభిప్రాయం ఉందన్న ప్రశ్నకు ఆనం బదులిస్తూ.. చూసే వ్యక్తి చూపును బట్టి అభిప్రాయం ఉంటుందని, ఆరోపణ చేయాలనుకున్న వారికి అలాగే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందన్న జగన్ వ్యాఖ్యలపై మీరేమంటారని ప్రశ్నించగా.. ‘‘విభజనకు అనుకూలమని జగన్ తన తండ్రి సమాధి వద్ద ప్రమాణం చేశారు. చంద్రబాబు తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లని చెప్పారు. చివరకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కానీ రాజకీయ స్వార్థంతో నాలుగు సీట్లు సంపాదించుకోవాలన్న ఆశతో కొందరు నిర్ణయాలు మార్చుకున్నారు’’ అని ఆరోపించారు. -
బాధ్యతతో పనిచేయండి: డీజీపీ ప్రసాదరావు
పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ ప్రసాదరావు సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఇప్పటివరకూ ఎలాంటి పనివిధానం కొనసాగిందో అదేవిధంగా ముందుకు వెళ్లాలని ఉన్నతాధికారులకు డీజీపీ బి.ప్రసాదరావు సూచిం చారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అన్ని విభాగాల అదనపు డీజీలు, రీజియన్ ఐజీలు, రేంజ్ డీఐజీలు, ఎస్పీలతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమష్టి బాధ్యతతో పనిచేయాలని, అప్పుడే మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పటికీ అవసరం లేని చోట్ల మార్పులంటూ అయోమయానికి గురిచేసే పరిస్థితి మాత్రం ఉండబోదని, పనితీరును మరింత మెరుగుపర్చాల్సిన చోట మాత్రమే మార్పులు చేద్దామని వారికి స్పష్టంచేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్‌ను ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అభినందనలు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నేతలు నూతన డీజీపీ ప్రసాదరావును మంగళవారం కలిసి అభినందనలు తెలిపారు. కానిస్టేబుల్ కుమారుడు డీజీపీగా ఎదగడం సంతోషించదగ్గ పరిణామమని వారు పేర్కొన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఆయన విశేష కృషి చేస్తారని సంఘం నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ వివేకానంద, కోశాధికారి బాలకృష్ణ, సీనియర్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ అధ్యక్షులు శంకరరెడ్డి, భద్రారెడ్డి తదితరులు డీజీపీని కలిసినవారిలో ఉన్నారు. -
పదో తేదీ వరకు ర్యాలీలు, సభలపై నిషేధం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈనెల పదో తేదీ వరకు ఎలాంటి సభలు, ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈనెల ఏడో తేదీన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఏపీ ఎన్జీవోలు బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టడం, అలా నిర్వహిస్తే తాము దాన్ని అడ్డుకుని తీరుతామని తెలంగాణ ఉద్యోగులు, ఓయూ జేఏసీ నాయకులు ప్రకటించడం లాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, డీజీపీ దినేశ్ రెడ్డి, సీపీ అనురాగ్ శర్మ తదితర ఉన్నతాధికారులు శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష జరిపారు. అలాగే, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకంగా సీఎస్ మహంతితో చర్చలు జరిపారు. ఉద్యోగులతో సమావేశం అనంతరం మహంతి మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాంతం వారైనా సచివాలయం ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుకోవాలని ఉద్యోగులను కోరినట్లు ఆయన తెలిపారు. సచివాలయం జే బ్లాక్ వద్ద టి.ఉద్యోగులు శాంతియుత నిరసన చేపట్టడానికి మాత్రమే అవకాశం ఇచ్చామన్నారు. అలాగే సీమాంధ్ర ఉద్యోగులు అమ్మవారి ఆలయం దగ్గర నిరసన తెలిపేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో విధులకు 67 శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఈనెల 10వ తేదీ వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అనురాగ్ శర్మ తెలిపారు.