గ్రామాలు, మండలాల్లో పాలనా వ్యవస్థ పటిష్టం
గ్రామాల్లో ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా వ్యవస్థను నిర్మించనున్న కమిటీ
పోస్టుల విభజనపై సర్కారు కసరత్తు పూర్తి
రాష్ట్ర కేడర్‌లోని 56 వేల మంది ఉద్యోగులే ఇరు రాష్ట్రాలకు పంపిణీ
తెలంగాణ నుంచి సీమాంధ్రకు వెళ్లాల్సింది 2,800 మంది
సీమాంధ్ర నుంచి తెలంగాణకు వెళ్లాల్సింది 1,200 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో గ్రామ, మండల స్థాయి పరిపాలన వ్యవస్థలను మరింత పటి ష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అన్ని శాఖలను ఆదేశించారు. రాష్ట్ర విభజనలో ప్రధానమైన ఉద్యోగుల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు, దేవాదాయ శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శితో కూడిన కమిటీని సీఎస్ నియమించారు.
ఈ కమిటీ ఇరు రాష్ట్రాలకు రాష్ర్ట స్థారుు కేడర్ పోస్టుల విభజనతో పాటు.. ప్రధానంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న 10-15 మంది ఉద్యోగుల ద్వారా ఆ గ్రామానికి అవసరమైన ప్రభుత్వ సేవలన్నీ సక్రమంగా అందేలా వ్యవస్థను నిర్మిస్తుంది. మండల స్థాయి పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తుంది. అలాగే ఉన్నతస్థాయిలో అవసరానికి మించి ఉన్న శాఖలు, ఉద్యోగులు, సిబ్బందిని వీలైనంత మేరకు కుదించేందుకు చేపట్టాల్సిన సంస్కరణలను సిఫారసు చేస్తుంది. ఒకే రకమైన పనులు చేస్తున్న పలు శాఖలన్నింటినీ ఒకే శాఖలో విలీనం చేస్తుంది.
పోస్టుల విభజనకు సంబంధించి సీఎస్ ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల విభజన ఉండదు. వారు ఏ ప్రాంతం వారైనా ప్రస్తుతం పనిచేస్తున్న చోటే పనిచేస్తారు. కేవలం రాష్ట్ర రాజధానితో పాటు వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఈ ఉద్యోగుల పంపిణీకి కూడా ఆప్షన్లను అడుగుతారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్రం నియమించిన కమలనాధన్ కమిటీ రూపొందిస్తోంది. ఈ కమిటీయే ఉద్యోగుల పంపిణీ చేస్తుంది.
ఇరు రాష్ట్రాలకు ఏ పోస్టులు ఎన్ని అనే అంశంపై కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రస్థాయి పోస్టులు మొత్తం 84 వేలు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్న వారు 56 వేల మంది మాత్రమే ఉన్నారు. ఈ 56 వేల మందిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారు. ఆ ప్రాతిపదికన పంపిణీ చేసిన తరువాత కేవలం 1,200 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నారు. అలాగే 2,800 మంది సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు తెలంగాణాలో పనిచేస్తున్నారు. వీరు మాత్రమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారాల్సి ఉంటుందని అధికారవర్గాల సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోస్టు ఒక్కటే ఉందనుకుంటే మరో రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయి పోస్టును సృష్టించనున్నారు. ఈ విధంగా పోస్టుల పంపిణీలో ఏ రాష్ట్రంలోనైనా తక్కువ పోస్టులుంటే వాటిని ఆ రాష్ట్రంలో కొత్తగా సృష్టిస్తారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు.
మరోవైపు సచివాలయంలో శాఖలు, కొన్ని విభాగాల కుదింపు చర్యలను ఆర్థిక శాఖ చేపట్టింది. ప్రధానంగా ఆర్థిక శాఖలో ప్రస్తుతం ఐదుగురు ముఖ్య కార్యదర్శుల పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి విభాగాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక శాఖలో ఇటు సీమాంధ్రకు, అటు తెలంగాణకు ఐఏఎస్ హోదాలో రెండు చొప్పున పోస్టులుంటే చాలని ప్రతిపాదించారు. పరిశ్రమల శాఖలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఒకరు లేదా ఇద్దరు ఐఏఎస్ స్థారుు పోస్టులుంటే చాలనే నిర్ణయానికి వచ్చారు. అలాగే రెవెన్యూ శాఖలో ప్రస్తుతం నలుగురు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో రెండు చొప్పున ఐఏఎస్ పోస్టులుంటే చాలని ప్రతిపదించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న అన్నిరకాల కేటగిరీల ఉద్యోగులు మొత్తం.. 13,51,838. వీరిలో ఇప్పటివరకు 11,22,566 మంది ఉద్యోగుల పూర్తి వివరాలను కంప్యూటరీకరించారు.
ఉద్యోగుల కేటగిరీ సంఖ్య
రెగ్యులర్ ఉద్యోగులు 7,16,137
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు 21,579
కాంట్రాక్టు ఉద్యోగులు 54,598
వర్క్ చార్జెడ్ ఉద్యోగులు 12,882
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 36,952
ఎన్‌ఎంఆర్ అండ్ ఇతరులు 21,050
హోంగార్డులు, ఇతరులు 2,59,368
మొత్తం 11,22,566