ఉద్యోగుల పంపిణీ బాధ్యత కమలనాథన్‌కే
* సలహా కమిటీ చైర్మన్‌గా ఆయనే
* ఉద్యోగులకు చట్టప్రకారం ఆప్షన్లు ఉంటాయి
* విభజనపై పదిరోజులకోసారి సమీక్షించనున్న కేంద్ర హోంశాఖ
* లీడ్ బ్యాంకులుగా ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్
* ప్రత్యేక ప్రతిపత్తి నిధులపై కసరత్తు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ బాధ్యతలను కూడా కమలనాథన్‌కే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. ప్రస్తుతం ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాలు రూపకల్పన కమిటీకి చైర్మన్‌గా కమలనాథన్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. అయితే మార్గదర్శకాలు రూపకల్పన అనుభవం ఉన్నందున ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సలహా కమిటీ చైర్మన్‌గా కూడా క మలనాధన్‌నే నియమించాలనేది కేంద్ర అభిప్రాయంగా ఉందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి సలహా కమిటీ చైర్మన్‌గా కమలనాథన్‌ను నియమిస్తూ ఏప్రిల్ 1వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. మార్గదర్శకాలకు అనుగుణంగా కమలనాథన్ కమిటీ రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులను చట్టం ప్రకారం ఆప్షన్‌లు అడుగుతారు. ఆప్షన్‌లకు కొంత సమయం నిర్ధారిస్తారు. ఆ సమయంలో ఆప్షన్స్ ఏ ప్రాంతానికి ఎంతమంది ఇచ్చారో అధ్యయనం చేసిన తరువాత కమలనాధన్ కమిటీ తొలుత ఏ రాష్ట్రానికి ఏ ఉద్యోగులో స్పష్టం చేస్తూ ప్రొవిజన్ జాబితాలను ప్రకటిస్తుంది.
ఈ జాబితాలపై అప్పీల్ చేసుకోవడానికి కొంత సమయాన్ని ఇస్తారు. అప్పీల్స్‌లో వచ్చిన అంశాలను పరిశీలించిన తరువాత తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ మేరకు ఏ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులు ఆ రాష్ట్రంలో పనిచేయాల్సి ఉంటుంది. అయినా తరువాత సర్వీసు అంశాలతో పాటు ఇతర అంశాలన్నింటిపైనా ఉద్యోగులు కమలనాథన్ కమిటీకే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కమలనాథన్ కమిటీ కొన్ని సంవత్సరాలపాటు కొనసాగుతుంది.
పది రోజులకోసారి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమీక్ష
విభజన ప్రక్రియ పురోగతిని వారం పది రోజులకోసారి రాష్ట్రానికి వచ్చి సమీక్షించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి తెలియజేశారు. ప్రస్తుతం విభజనపై కమిటీలు వేస్తూ తీసుకున్న నిర్ణయాల పట్ల అనిల్ గోస్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇక నుంచి క్షేత్రస్థాయిలో జరగాల్సిన పనుల పురోగతిపై మరో వారం పది రోజుల్లో వచ్చి సమీక్షించాలని ఆయన నిర్ణయించారు.
‘ఉమ్మడి’ అధికారే తెలంగాణ రాష్ట్ర ఖాతా తెరుస్తారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంచిత నిధి ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్‌బీఐకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైందని ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెళ్లి ఆర్‌బీఐలో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధి ఖాతాను తెరుస్తారు. ఆ ఖాతాలో జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి నిధులు అందుబాటులో ఉంటాయి. ఈ నిధికే తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం జమ అవుతుంది. ఆ నిధి నుంచి వ్యయం చేస్తారు.
సీమాంధ్రకు ఆంధ్రా బ్యాంకు... తెలంగాణకు ఎస్‌బీహెచ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటివరకు లీడ్ బ్యాంకుగా వ్యవహరించిన ఆంధ్రా బ్యాంకు రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు పరిమితం కానుంది. సీమాంధ్ర ప్రభుత్వానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి ఆంధ్రాబ్యాంకు లీడ్ బ్యాంకుగా మారనుంది. తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి ఎస్‌బీహెచ్ లీడ్ బ్యాంకుగా వ్యవహరించనుంది.
ప్రత్యేక ప్రతిపత్తి నిధులపై కసరత్తు
సీమాంధ్రకు రెవెన్యూ లోటు నేపథ్యంలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన నేపథ్యంలో ఏ పథకాల కింద ఎన్ని నిధులు అదనంగా వస్తాయనే కసరత్తును ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సాధారణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పథకాల నిధుల్లో 70 శాతం రుణం కింద, మిగతా 30 శాతం గ్రాంట్ల రూపంలో వస్తాయి. ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పథకాల నిధుల్లో 90 శాతం గ్రాంటు రూపంలోను 10 శాతం రుణం రూపంలో వస్తాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీలకు సంబంధించి కూడా కసరత్తు ప్రారంభించారు.