Employees send
-
తొలిదశలో 20 శాఖల తరలింపు
-20 హెచ్వోడీలు కూడా తరలి వెళ్లాల్సిన మొత్తం సిబ్బంది 9,750 -లెక్క తేల్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపు తొలి దశలో 20 శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం నుంచి 20 శాఖలను తరలించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్.. సోమవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజధాని తరలింపు అంశం మీద చర్చించారు. గత వారం చెప్పిన విషయాలనే మళ్లీ ప్రభుత్వం చెప్పిందే తప్ప.. కొత్త విషయాలేమీ లేకపోవడం గమనార్హం. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న స్థానికతపై స్పష్టత, 30 శాతం హెచ్ఆర్ఏ, తరలింపు అలవెన్స్, 5 రోజుల పనిదినాలు, ఉద్యోగుల వసతి కల్పన.. తదితర అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయింది. ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతామంటూ పాత పాటే పాదింది. రాజధానికి తరలి వెళ్లాల్సిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 9750 మంది అని ప్రభుత్వ నిర్ధారించింది. తొలి దశలో సచివాలయంలో 20 శాఖలు(20 మంది కార్యదర్శులు, వారికి అనుబంధంగా పనిచేస్తున్న సిబ్బంది), 20 శాఖాధిపతుల కార్యాలయాల(హెచ్‌వోడీల)ను తరలించాలనే యోచనలో ఉన్నామని తెలిపింది. ల్యాండ్ అండ్ రెవెన్యూ, వ్యవసాయం, జల వనరులు, వైద్యం, అటవీ, విద్య శాఖల పరిధిలో 20 హెచ్వోడీలు ఉన్నాయని, వాటిని తొలి దశలో తరలించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలోని ఈ శాఖలకు సంబంధించిన విభాగాలనే తొలుత తరలించనున్నామని తెలిపారు. ఏ కార్యాలయానికి ఎంత స్థలం అవసరం? ఏ కార్యాలయానికి ఎంత స్థలం అవసరం అనే విషయాన్ని నిర్ధారించడానికి ఈనెల 30న వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. కార్యాలయాల వారీగా స్థలాల అవసరాలను నిర్ణయించే అవకాశం ఉంది. 2న మళ్లీ భేటీ ఉద్యోగ సంఘాలు, సచివాలయ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మరో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30న జరగనున్న సమావేశంలో నిర్ణయించే అంశాలను ఉద్యోగ సంఘాల ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీలో.. తరలింపు విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. -
ఉద్యోగుల పంపిణీ బాధ్యత కమలనాథన్కే
* సలహా కమిటీ చైర్మన్‌గా ఆయనే * ఉద్యోగులకు చట్టప్రకారం ఆప్షన్లు ఉంటాయి * విభజనపై పదిరోజులకోసారి సమీక్షించనున్న కేంద్ర హోంశాఖ * లీడ్ బ్యాంకులుగా ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్ * ప్రత్యేక ప్రతిపత్తి నిధులపై కసరత్తు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ బాధ్యతలను కూడా కమలనాథన్కే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. ప్రస్తుతం ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాలు రూపకల్పన కమిటీకి చైర్మన్‌గా కమలనాథన్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. అయితే మార్గదర్శకాలు రూపకల్పన అనుభవం ఉన్నందున ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సలహా కమిటీ చైర్మన్‌గా కూడా క మలనాధన్నే నియమించాలనేది కేంద్ర అభిప్రాయంగా ఉందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి సలహా కమిటీ చైర్మన్‌గా కమలనాథన్‌ను నియమిస్తూ ఏప్రిల్ 1వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. మార్గదర్శకాలకు అనుగుణంగా కమలనాథన్ కమిటీ రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులను చట్టం ప్రకారం ఆప్షన్లు అడుగుతారు. ఆప్షన్లకు కొంత సమయం నిర్ధారిస్తారు. ఆ సమయంలో ఆప్షన్స్ ఏ ప్రాంతానికి ఎంతమంది ఇచ్చారో అధ్యయనం చేసిన తరువాత కమలనాధన్ కమిటీ తొలుత ఏ రాష్ట్రానికి ఏ ఉద్యోగులో స్పష్టం చేస్తూ ప్రొవిజన్ జాబితాలను ప్రకటిస్తుంది. ఈ జాబితాలపై అప్పీల్ చేసుకోవడానికి కొంత సమయాన్ని ఇస్తారు. అప్పీల్స్‌లో వచ్చిన అంశాలను పరిశీలించిన తరువాత తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ మేరకు ఏ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులు ఆ రాష్ట్రంలో పనిచేయాల్సి ఉంటుంది. అయినా తరువాత సర్వీసు అంశాలతో పాటు ఇతర అంశాలన్నింటిపైనా ఉద్యోగులు కమలనాథన్ కమిటీకే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కమలనాథన్ కమిటీ కొన్ని సంవత్సరాలపాటు కొనసాగుతుంది. పది రోజులకోసారి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమీక్ష విభజన ప్రక్రియ పురోగతిని వారం పది రోజులకోసారి రాష్ట్రానికి వచ్చి సమీక్షించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి తెలియజేశారు. ప్రస్తుతం విభజనపై కమిటీలు వేస్తూ తీసుకున్న నిర్ణయాల పట్ల అనిల్ గోస్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇక నుంచి క్షేత్రస్థాయిలో జరగాల్సిన పనుల పురోగతిపై మరో వారం పది రోజుల్లో వచ్చి సమీక్షించాలని ఆయన నిర్ణయించారు. ‘ఉమ్మడి’ అధికారే తెలంగాణ రాష్ట్ర ఖాతా తెరుస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంచిత నిధి ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైందని ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెళ్లి ఆర్బీఐలో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధి ఖాతాను తెరుస్తారు. ఆ ఖాతాలో జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి నిధులు అందుబాటులో ఉంటాయి. ఈ నిధికే తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం జమ అవుతుంది. ఆ నిధి నుంచి వ్యయం చేస్తారు. సీమాంధ్రకు ఆంధ్రా బ్యాంకు... తెలంగాణకు ఎస్బీహెచ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటివరకు లీడ్ బ్యాంకుగా వ్యవహరించిన ఆంధ్రా బ్యాంకు రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు పరిమితం కానుంది. సీమాంధ్ర ప్రభుత్వానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి ఆంధ్రాబ్యాంకు లీడ్ బ్యాంకుగా మారనుంది. తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి ఎస్బీహెచ్ లీడ్ బ్యాంకుగా వ్యవహరించనుంది. ప్రత్యేక ప్రతిపత్తి నిధులపై కసరత్తు సీమాంధ్రకు రెవెన్యూ లోటు నేపథ్యంలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన నేపథ్యంలో ఏ పథకాల కింద ఎన్ని నిధులు అదనంగా వస్తాయనే కసరత్తును ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సాధారణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పథకాల నిధుల్లో 70 శాతం రుణం కింద, మిగతా 30 శాతం గ్రాంట్ల రూపంలో వస్తాయి. ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పథకాల నిధుల్లో 90 శాతం గ్రాంటు రూపంలోను 10 శాతం రుణం రూపంలో వస్తాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీలకు సంబంధించి కూడా కసరత్తు ప్రారంభించారు. -
నెలకు రూ. 80 వేలు ఇవ్వండి: కమలనాథన్
రాష్ట్రాన్ని కోరిన కమలనాథన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలను రూపొందించే కమిటీ చైర్మన్ కమలనాథన్ నెలకు రూ.80 వేలు వేతనం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చాలా సీనియర్ కేడర్‌లో పదవీ విరమణ చేసినందున ఇంత మొత్తం వేతనంగా ఇవ్వాలని, లేదంటే కమిటీకి పనిచేయబోనని స్పష్టం చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా జనవరి 15నే కమలనాథన్‌ను నియమిస్తూ కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం డెరైక్టర్ కె.కిప్గిన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి లేఖ రాశారు. ఆయనకు నెలకు రూ.40 వేలు చెల్లించనున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన పెద్దమొత్తంలో వేతనం కోరడంతో రాష్ట్రప్రభుత్వం ఆమేరకు కేంద్రానికి ప్రతిపాదన పంపింది. అలాగే ఈ కమిటీ కన్వీనర్‌గా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌ని నియమించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. విభజన పురోగతిపై 18న అనిల్ గోస్వామి సమీక్ష రాష్ట్ర విభజన పనుల పురోగతిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఈ నెల 18న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోస్వామి 18న రాష్ట్రానికి వస్తారు. అదే రోజు సీఎస్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో విభజన పనులపై సమీక్షిస్తారు. విభజనపై రంగాలవారీగా ఆయా శాఖలు ఇప్పటివరకు చేసిన పనులు ఎంతవరకు వచ్చాయో లోతుగా సమీక్షిస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 19వ తేదీన జాతీయ పోలీసు అకాడమీలో జరిగే సమావేశంలో గోస్వామి పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం తిరిగి ఢిల్లీ వెళ్తారు. -
గ్రామాలు, మండలాల్లో పాలనా వ్యవస్థ పటిష్టం
గ్రామాల్లో ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా వ్యవస్థను నిర్మించనున్న కమిటీ పోస్టుల విభజనపై సర్కారు కసరత్తు పూర్తి రాష్ట్ర కేడర్‌లోని 56 వేల మంది ఉద్యోగులే ఇరు రాష్ట్రాలకు పంపిణీ తెలంగాణ నుంచి సీమాంధ్రకు వెళ్లాల్సింది 2,800 మంది సీమాంధ్ర నుంచి తెలంగాణకు వెళ్లాల్సింది 1,200 మంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో గ్రామ, మండల స్థాయి పరిపాలన వ్యవస్థలను మరింత పటి ష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అన్ని శాఖలను ఆదేశించారు. రాష్ట్ర విభజనలో ప్రధానమైన ఉద్యోగుల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు, దేవాదాయ శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శితో కూడిన కమిటీని సీఎస్ నియమించారు. ఈ కమిటీ ఇరు రాష్ట్రాలకు రాష్ర్ట స్థారుు కేడర్ పోస్టుల విభజనతో పాటు.. ప్రధానంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న 10-15 మంది ఉద్యోగుల ద్వారా ఆ గ్రామానికి అవసరమైన ప్రభుత్వ సేవలన్నీ సక్రమంగా అందేలా వ్యవస్థను నిర్మిస్తుంది. మండల స్థాయి పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తుంది. అలాగే ఉన్నతస్థాయిలో అవసరానికి మించి ఉన్న శాఖలు, ఉద్యోగులు, సిబ్బందిని వీలైనంత మేరకు కుదించేందుకు చేపట్టాల్సిన సంస్కరణలను సిఫారసు చేస్తుంది. ఒకే రకమైన పనులు చేస్తున్న పలు శాఖలన్నింటినీ ఒకే శాఖలో విలీనం చేస్తుంది. పోస్టుల విభజనకు సంబంధించి సీఎస్ ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల విభజన ఉండదు. వారు ఏ ప్రాంతం వారైనా ప్రస్తుతం పనిచేస్తున్న చోటే పనిచేస్తారు. కేవలం రాష్ట్ర రాజధానితో పాటు వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఈ ఉద్యోగుల పంపిణీకి కూడా ఆప్షన్లను అడుగుతారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్రం నియమించిన కమలనాధన్ కమిటీ రూపొందిస్తోంది. ఈ కమిటీయే ఉద్యోగుల పంపిణీ చేస్తుంది. ఇరు రాష్ట్రాలకు ఏ పోస్టులు ఎన్ని అనే అంశంపై కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రస్థాయి పోస్టులు మొత్తం 84 వేలు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్న వారు 56 వేల మంది మాత్రమే ఉన్నారు. ఈ 56 వేల మందిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారు. ఆ ప్రాతిపదికన పంపిణీ చేసిన తరువాత కేవలం 1,200 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నారు. అలాగే 2,800 మంది సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు తెలంగాణాలో పనిచేస్తున్నారు. వీరు మాత్రమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారాల్సి ఉంటుందని అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోస్టు ఒక్కటే ఉందనుకుంటే మరో రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయి పోస్టును సృష్టించనున్నారు. ఈ విధంగా పోస్టుల పంపిణీలో ఏ రాష్ట్రంలోనైనా తక్కువ పోస్టులుంటే వాటిని ఆ రాష్ట్రంలో కొత్తగా సృష్టిస్తారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. మరోవైపు సచివాలయంలో శాఖలు, కొన్ని విభాగాల కుదింపు చర్యలను ఆర్థిక శాఖ చేపట్టింది. ప్రధానంగా ఆర్థిక శాఖలో ప్రస్తుతం ఐదుగురు ముఖ్య కార్యదర్శుల పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి విభాగాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక శాఖలో ఇటు సీమాంధ్రకు, అటు తెలంగాణకు ఐఏఎస్ హోదాలో రెండు చొప్పున పోస్టులుంటే చాలని ప్రతిపాదించారు. పరిశ్రమల శాఖలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఒకరు లేదా ఇద్దరు ఐఏఎస్ స్థారుు పోస్టులుంటే చాలనే నిర్ణయానికి వచ్చారు. అలాగే రెవెన్యూ శాఖలో ప్రస్తుతం నలుగురు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో రెండు చొప్పున ఐఏఎస్ పోస్టులుంటే చాలని ప్రతిపదించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న అన్నిరకాల కేటగిరీల ఉద్యోగులు మొత్తం.. 13,51,838. వీరిలో ఇప్పటివరకు 11,22,566 మంది ఉద్యోగుల పూర్తి వివరాలను కంప్యూటరీకరించారు. ఉద్యోగుల కేటగిరీ సంఖ్య రెగ్యులర్ ఉద్యోగులు 7,16,137 గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు 21,579 కాంట్రాక్టు ఉద్యోగులు 54,598 వర్క్ చార్జెడ్ ఉద్యోగులు 12,882 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 36,952 ఎన్ఎంఆర్ అండ్ ఇతరులు 21,050 హోంగార్డులు, ఇతరులు 2,59,368 మొత్తం 11,22,566