-20 హెచ్‌వోడీలు కూడా తరలి వెళ్లాల్సిన మొత్తం సిబ్బంది 9,750
-లెక్క తేల్చిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపు తొలి దశలో 20 శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం నుంచి 20 శాఖలను తరలించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్.. సోమవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజధాని తరలింపు అంశం మీద చర్చించారు. గత వారం చెప్పిన విషయాలనే మళ్లీ ప్రభుత్వం చెప్పిందే తప్ప.. కొత్త విషయాలేమీ లేకపోవడం గమనార్హం. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న స్థానికతపై స్పష్టత, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, తరలింపు అలవెన్స్, 5 రోజుల పనిదినాలు, ఉద్యోగుల వసతి కల్పన.. తదితర అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయింది. ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతామంటూ పాత పాటే పాదింది. రాజధానికి తరలి వెళ్లాల్సిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 9750 మంది అని ప్రభుత్వ నిర్ధారించింది. తొలి దశలో సచివాలయంలో 20 శాఖలు(20 మంది కార్యదర్శులు, వారికి అనుబంధంగా పనిచేస్తున్న సిబ్బంది), 20 శాఖాధిపతుల కార్యాలయాల(హెచ్‌వోడీల)ను తరలించాలనే యోచనలో ఉన్నామని తెలిపింది.
ల్యాండ్ అండ్ రెవెన్యూ, వ్యవసాయం, జల వనరులు, వైద్యం, అటవీ, విద్య శాఖల పరిధిలో 20 హెచ్‌వోడీలు ఉన్నాయని, వాటిని తొలి దశలో తరలించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలోని ఈ శాఖలకు సంబంధించిన విభాగాలనే తొలుత తరలించనున్నామని తెలిపారు. ఏ కార్యాలయానికి ఎంత స్థలం అవసరం? ఏ కార్యాలయానికి ఎంత స్థలం అవసరం అనే విషయాన్ని నిర్ధారించడానికి ఈనెల 30న వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. కార్యాలయాల వారీగా స్థలాల అవసరాలను నిర్ణయించే అవకాశం ఉంది. 2న మళ్లీ భేటీ ఉద్యోగ సంఘాలు, సచివాలయ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మరో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30న జరగనున్న సమావేశంలో నిర్ణయించే అంశాలను ఉద్యోగ సంఘాల ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీలో.. తరలింపు విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
తొలిదశలో 20 శాఖల తరలింపు
Published Mon, Mar 28 2016 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM
Advertisement
Advertisement