విద్యార్థుల ప్రతిభ.. ఆకట్టుకుంటున్న సృజన! | Engineering Students Create Electronic Gadgets In Bhimavaram Institution | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రతిభ.. ఆకట్టుకుంటున్న సృజన!

Published Mon, Jul 1 2019 11:08 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Engineering  Students Create Electronic Gadgets In Bhimavaram Institution - Sakshi

ప్రాజెక్టుల తయారీలో భీమవరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు

నేటితరం విద్యార్థులు కేవలం మార్కుల సాధనకేకాకుండా చదువుకుంటూనే వివిధ రకాల ప్రాజెక్టుల తయారీపై దృష్టిపెడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే వివిధ రకాల పరికరాలను తయారుచేస్తూ అబ్బురపరుస్తున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో  వినూత్న తరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. దీనికిగాను ఆయా కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం ప్రశంసనీయం. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలోని భీమవరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. 

సాక్షి, భిమవరం(పశ్చిమ గోదావరి) : హార్ట్‌బీట్‌ మానిటరింగ్‌ సిస్టమ్,  స్మార్ట్‌ సెక్యూరిటీ ఆలర్ట్‌ ఫర్‌ హెవికల్స్, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ సిస్టమ్, స్మార్ట్‌ రిజర్వాయర్‌ సిస్టమ్‌ వంటివి ఎన్నో ప్రాజెక్టులను భీమవరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. కళాశాలలో హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ సహకారంతో రేయింబవళ్లు విద్యార్థులు తమ మేథస్సును ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తయారుచేసిన పలు ప్రాజెక్టులకు మరింత మెరుగుపర్చి వినియోగంలోకి తీసుకువస్తే ధనికులకేకాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌
ప్రస్తుతం ఈవీఎంలు మొరాయిస్తున్న కారణంగా ఎన్నికల పోలింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించడం మరికొంత ఆలస్యానికి కారణం. దీనిని అధిగమించడానికి ఈసీఇ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న పి నిర్మల, వి సాయిభారతి, పి వెంకటలక్ష్మి, బి హిమసాయి తయారుచేసిన ఎలక్ట్రానిక్స్‌ ఓటింగ్‌ సిస్టమ్‌ ఎంతగానో దోహదపడుతుంది. దీని ద్వారా ఓటింగ్‌ త్వరితగతిని పూర్తిచేయించడమేకాక సిబ్బంది సంఖ్యను కూడా ఘననీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. 

హార్ట్‌బీట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌
కళాశాలలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్యార్థులు వై రోహిత్, కె హరిలత, కె శివ, బి దేవి కేవలం రూ.2,500 వ్యయంతో తయారుచేసిన హార్ట్‌బీట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ఆకట్టుకుంటోంది. దీని ద్వారా ఆసుపత్రులు, నివాసాల్లో సైతం రోగుల హార్ట్‌బీట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ప్రధానంగా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకోవడం ఎంతో సులువు. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ యంత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. 

స్మార్ట్‌ రిజర్వాయర్‌ సిస్టమ్‌
ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థిని జి సుప్రియ నేతృత్వంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎస్‌ జ్యోతిక, సీహెచ్‌ సాయి మహేష్, పి లలిత రూ.3 వేల వ్యయంతో రూపొందించిన స్మార్ట్‌ రిజర్వాయర్‌ సిస్టమ్‌ ద్వారా రిజర్వాయర్లు, డ్యామ్‌లలో నీటి పరిమాణాన్ని గుర్తించే వీలుంటుంది. నివాసాల వద్ద ఏర్పాటుచేసుకునే వాటర్‌ ట్యాంక్లులో నీరు నిండిన సమయంలో ఈ సిస్టమ్‌ ద్వారా ఆలారమ్‌ మోగుతుంది. తద్వారా నీటి వృథాను అరికట్టవచ్చు. 

వెహికల్స్‌ అలర్ట్‌ 
నేటి ఆధునిక యుగంలో అన్ని వయస్సులవారు వాహనాలను యథేచ్చగా వినియోగిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలకు గురై అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోతున్ననవారు కొందరైతే, సకాలంలో వైద్యం అందక తుదిశ్వాస విడిచేవారు మరికొందరు. అయితే ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సీహెచ్‌ సంతోష్, బి దేవిశ్రీ, వి థామస్, వై లోకేష్, ఎన్‌ శరత్‌ తయారుచేసిన  స్మార్ట్‌ సెక్యూరిటీ అలర్ట్‌ ఫర్‌ వెహికల్స్‌ సిస్టమ్‌ ద్వారా మోటారుసైకిల్స్, కార్లు నడిపే సమయంలో హెల్మ్‌ట్, సీట్‌బెల్ట్‌ ధరించకపోయినా,  మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసినా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసిన పద్ధతి వల్ల వెంటనే సదరు కుటుంబ సభ్యులకు మెసేజ్‌ వెళ్తుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినా క్షణాల్లో తెలుస్తుంది. తద్వారా ప్రమాదం జరిగి వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చును. దీనిని కేవలం రూ.4 వేల వ్యయంతో రూపొందించారు.

చదువుతో పాటు ప్రయోగాలు 
మా కళాశాలలో విద్యనేర్చుకోవడంతో పాటు సరికొత్త అంశాలపై ప్రయోగాలను చేస్తున్నాం. దీని ద్వారా కేవలం ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూడనవసరం లేకుండా సొంతంగా చిన్న కంపెనీ ఏర్పాటు చేసుకుని మరొక పదిమందికి ఉపాధి అవకాశం కల్పించవచ్చును.
–జి.సుప్రియ, ఈసీఈ విద్యార్థి 

కళాశాల యాజమాన్యం ప్రోత్సహిస్తోంది 
కళాశాలలో విద్యాబోధనతో సమానంగా వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనకు యాజమాన్యం ఎంతగానో అవకాశం కల్పిస్తోంది. సొంతంగా ప్రాజెక్టులు తయారు చేయడం వల్ల చదువు పూర్తయిన తరువాత వివిధ ఆంశాలపై అవగాహన ఉండడంతో ఎక్కడ ఉద్యోగంలో చేరినా కష్టం లేకుండా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. 
–పి.నిర్మల, విద్యార్థిని మాలో మాకే పోటీ 

ప్రాక్టికల్స్‌ వల్ల ఎక్కువ ప్రయోజనం
బట్టిపట్టే విద్యకంటే ప్రాక్టికల్స్‌ ద్వారా ఎక్కువ విజ్ఞానాన్ని గ్రహించవచ్చు. మా కళాశాలలో వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేసే విద్యార్థులకు మంచి ప్రోత్సహం లభిస్తోంది. అందువల్లనే తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ఉపయోగకకరంగా ఉండే వివిధ రకాల ప్రాజెక్టుల తయారీలో విద్యార్థులం పోటీ పడుతున్నాం.                  
–సీహెచ్‌ సంతోష్, విద్యార్థి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement