నెలకు రూ. 80 వేలు ఇవ్వండి: కమలనాథన్
రాష్ట్రాన్ని కోరిన కమలనాథన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలను రూపొందించే కమిటీ చైర్మన్ కమలనాథన్ నెలకు రూ.80 వేలు వేతనం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చాలా సీనియర్ కేడర్‌లో పదవీ విరమణ చేసినందున ఇంత మొత్తం వేతనంగా ఇవ్వాలని, లేదంటే కమిటీకి పనిచేయబోనని స్పష్టం చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా జనవరి 15నే కమలనాథన్‌ను నియమిస్తూ కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం డెరైక్టర్ కె.కిప్గిన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి లేఖ రాశారు. ఆయనకు నెలకు రూ.40 వేలు చెల్లించనున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన పెద్దమొత్తంలో వేతనం కోరడంతో రాష్ట్రప్రభుత్వం ఆమేరకు కేంద్రానికి ప్రతిపాదన పంపింది. అలాగే ఈ కమిటీ కన్వీనర్‌గా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌ని నియమించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది.
విభజన పురోగతిపై 18న అనిల్ గోస్వామి సమీక్ష
రాష్ట్ర విభజన పనుల పురోగతిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఈ నెల 18న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోస్వామి 18న రాష్ట్రానికి వస్తారు. అదే రోజు సీఎస్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో విభజన పనులపై సమీక్షిస్తారు. విభజనపై రంగాలవారీగా ఆయా శాఖలు ఇప్పటివరకు చేసిన పనులు ఎంతవరకు వచ్చాయో లోతుగా సమీక్షిస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 19వ తేదీన జాతీయ పోలీసు అకాడమీలో జరిగే సమావేశంలో గోస్వామి పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం తిరిగి ఢిల్లీ వెళ్తారు.