ఫైళ్లు గవర్నర్‌కే పంపండి: సీఎస్ సూచన | Send files to governer Narasimhan | Sakshi
Sakshi News home page

ఫైళ్లు గవర్నర్‌కే పంపండి: సీఎస్ సూచన

Published Thu, Mar 6 2014 5:48 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Send files to governer Narasimhan

సాక్షి, హైదరాబాద్:  ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి గత రెండు నెలల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కీలక ఫైళ్లను తనకు కాకుండా నేరుగా గవర్నర్‌కే పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి వివిధ శాఖల అధిపతులకు సూచించారు. బుధవారం రాష్ట్ర విభజనపై సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ ఫైళ్లను గవర్నర్‌కు రీ సర్క్యులేట్ చేయాలో సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులే నిర్ణయం తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ఈ విషయమై తన నుంచి తదుపరి ఆదేశాలు, వివరణ కోరవద్దని కూడా చెప్పారు. ఈ మేరకు కొన్ని అంతర్గత ఆదేశాలను జారీ చేశారు.
 
 దీనిపై మహంతి, కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సంవాదం నెలకొంది. మీనా, ఎస్.పి.సింగ్‌తో పాటు పలువురు సీఎస్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. గవర్నర్‌కు ఫైళ్లు సీఎస్ ద్వారానే వెళ్లాలని వారన్నారు. నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. అయితే ఇందుకు సీఎస్ ససేమిరా అన్నారు. తనకు రాకుండా నేరుగా సీఎం ఆమోదానికి పంపిన ఫైళ్లను ఇప్పుడు తనకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. కొందరు అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. విజిలెన్స్, ఏసీబీ కేసుల ఉపసంహరణకు  సంబంధించి శాఖాధిపతులుగా తాము సిఫారసు చేయకపోయినా మంత్రులు సిఫారసు చేసి, ఫైళ్లను నేరుగా సీఎం ఆమోదానికి పంపుతున్నారని, ఆ తరువాత తమకు వస్తే ఆదేశాలు జారీ చేశామని వివరించారు. అలాంటి ఫైళ్లు ఇప్పుడు సీఎస్ ద్వారానే గవర్నర్‌కు వెళ్లాలని అన్నారు.
 
  పదోన్నతులు ఇవ్వను.. ఇవ్వాల్సిందే
 విభజన నేపథ్యంలో ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వబోనని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. సిన్హా స్పష్టం చేశారు. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారులైన నాగిరెడ్డి, ఎల్.వి.సుబ్రహ్మణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన పరిధిలోకి రాని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో పనిచేస్తున్న, త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని వారు పేర్కొన్నారు. అలాగే న్యాయస్థానాల్లో కేసులకు సంబంధించిన వారికీ పదోన్నతులు ఇవ్వాలన్నారు. సాగునీటి శాఖలో 2001-2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేవలం కోర్టు కేసు కారణంగా ఇన్‌చార్జిలుగా పదోన్నతితో కొనసాగుతున్న 1,334 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు.. కోర్టు కేసు తేలిపోవడంతో గురువారం డీపీసీ ద్వారా పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. అరుుతే విభజన నేపథ్యంలో ఈ పదోన్నతులపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియజేయూల్సిందిగా డీపీసీ కమిటీ చైర్మన్ టక్కర్ జీఏడీ అధిపతి సిన్హాకు లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement