రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన సభ తొలి సమావేశాలు గురువారం ప్రారంభంకానున్నాయి. ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి వ్యవహరిస్తారు. గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం 9.15 గంటలకు ఆయనతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత 11.52 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభకు ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారు.
ఆ తరువాత ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, అనంతరం మంత్రులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా సభ్యులందరితో వరుసగా ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారాల అనంతరం ఇటీవల మరణించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావుకు సభ సంతాపం తెలుపుతుంది. ఆతర్వాత సభ మరునాటికి వాయిదాపడుతుంది. 20వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21వ తేదీన ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 22వ తేదీ సెలవు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది.
తొలి సమావేశాలకు సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల కోసం పాత శాసనసభ భవనాన్ని తీర్చిదిద్దారు. పాత టీడీఎల్పీ భవనాన్ని ముఖ్యమంత్రి చాంబర్‌గా మార్చారు. ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లేందుకు రెండో నంబర్ గేట్‌ను కేటాయించారు. పురాతన భవనం అయినందున మీడియా, సందర్శకుల గ్యాలరీల్లో ఎక్కువమందిని అనుమతించే అవకాశం లేదు. సందర్శకులకు అనుమతి లేదు.