ప్రజా ప్రయోజనాల కోసమే.. | CM YS Jagan in Assembly on dissolution of Legislative Council | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రయోజనాల కోసమే..

Published Tue, Jan 28 2020 4:18 AM | Last Updated on Tue, Jan 28 2020 4:44 AM

CM YS Jagan in Assembly on dissolution of Legislative Council - Sakshi

చంద్రబాబులా బాహుబలి లాంటి గ్రాఫిక్స్‌ సినిమాలు చూపించకుండా మనకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఆశ పడితే అది తప్పా?

ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్లో ఆలస్యం జరగకూడదు. కుట్రలతో మంచి పనులు ఆగిపోవడం నాకిష్టం లేదు. అందుకే మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా.

‘ద టైమ్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌ టు డూ.. వాట్‌ ఈజ్‌ రైట్‌..’ (మంచి చేయాలనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదే) అని చెప్పిన అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ సూక్తిని ఈ సందర్భంగా అంతా గుర్తు చేసుకోవాలి.
-సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకునే రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో నడుస్తున్నందు వల్లే శాసన మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్‌ దీనికి కారణాలను సోదాహరణంగా వివరించారు. అసలు శాసనమండలి ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? గతంలో దీన్ని సమర్థించిన పత్రికలు, టీడీపీ ఇప్పుడు ఎలా యూటర్న్‌ తీసుకున్నాయి? అనే అంశాలను వివరించారు. నాడు రామోజీరావు కోసం శాసనమండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్‌ ప్రభుత్వం తీర్మానం చేస్తే  అద్భుత నిర్ణయమని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాసిన ఈనాడుకు ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం తాము తీసుకున్న నిర్ణయం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. ఇదేనా మీ ద్వంద్వనీతి? అని ప్రశ్నించారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా.. వద్దా?
‘‘అధ్యక్షా.. ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న సంగతి మనతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనందరి ముందు ఉన్న ప్రశ్న కేవలం మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా బతికించుకోవాలా.. వద్దా? అన్న ప్రశ్న మనముందు ఉంది. ప్రజా ప్రభుత్వాలు సజావుగా పని చేయలా.. వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 (2) ప్రకారం సీఎం నేతృత్వంలోని క్యాబినెట్‌ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేరుగా ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి. 

భరించలేక వద్దనుకున్నాయి..
ఇప్పుడు శాసనమండలి దేశంలో 28 రాష్ట్రాలకు గాను కేవలం ఆరు చోట్ల మాత్రమే ఉంది. (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర). మండలిని భరించలేక ఈ వ్యవస్థ వద్దని పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. 

నాడు మాకు బలమున్నా కొనుగోలు చేసి గెలిచారు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరులో మాకు బలమున్నా అతి నీచంగా కొనుగోలు చేసి గెలిచారు. అప్పుడూ ఈ ఎల్లో మీడియా చంద్రబాబును ఒక్కరోజైనా ప్రశ్నించలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేసే అవకాశం ఉన్నా అలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. ఇదే విషయాన్ని తొలిరోజే సభలో చెప్పా. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాజకీయాలను మార్చడానికి ఈ చట్టసభలో అడుగుపెట్టామే తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. 

మండలి తప్పనిసరి కాదు
రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ శాసన మండలి తప్పనిసరి అనుకుని ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీలులేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేది. రెండో సభను ఆప్షనల్‌గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి మండలి రద్దు అధికారాన్ని కూడా ఆర్టికల్‌ 169 ప్రకారం అసెంబ్లీకే అప్పగించారు. దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో.. మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు. నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదు. ఇదే శాసనసభలో ముగ్గురు పీహెచ్‌డీ చేసినవారు, 38 మంది పీజీ చేసినవారు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజనీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు, ఇద్దరు గ్రూప్‌ – 1 అధికారులు, 1 ప్రొఫెసర్, 1 జర్నలిస్టు, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారు. వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఇలాంటప్పుడు మండలి అవసరం ఏముంది?
సోమవారం శాసన మండలి రద్దు తీర్మానంపై చర్చిస్తున్న అసెంబ్లీ 

కాలయాపనకే కౌన్సిల్‌..
ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్న మండళ్లను ఏమనాలి? కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రజా ప్రయోజనం లేని మండలిపై డబ్బులు ఖర్చు చేయడం శుద్ధ దండగ. ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు ఈ మండలికి అర్హత లేదు. ఇటువంటి మండలికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా? అని అంతా ఆలోచించాలి. మండలికి శాసనసభ జవాబుదారీ కాదు. పేదలు రూపాయి కూడా ఖర్చు చేయకుండా వారి పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం చదువుల కోసం బిల్లు తెచ్చినా, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తెచ్చిన ప్రత్యేక కమిషన్‌ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకున్న మండలి కారణంగా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఎలా హాని చేయాలి? బిల్లులను ఎలా అడ్డుకోవాలి? కత్తిరించాలి? అనే దిక్కుమాలిన ఆలోచనలు చేసే అలాంటి సభ మనకు అవసరమా? అన్నది ఆలోచన చేయాలి.

నాడు ఈనాడు సమర్థించలేదా..? 
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శాసనమండలిని రద్దు చేసినప్పుడు టీడీపీ పాంప్లేట్‌ పేపర్‌ ఈనాడు దాన్ని సమర్థిస్తూ సంపాదకీయాలు రాసింది. అప్పుడు ఈనాడు ఏమేం రాసిందంటే... (క్లిప్పింగ్‌లను సీఎం చదివారు) అనుభవంలో వాటి (మండళ్ల) నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయి. అందుకు పార్లమెంట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయనవసరం లేదు. నిరర్ధకమే కాక గుదిబండలా కూడా తయారైన కౌన్సిల్‌ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్లు గుండెలు బాదుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించిన ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది.రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గంలో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచిపేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఇలా ఎంత చక్కగా రాశారు అధ్యక్షా అప్పట్లో! 

రామోజీ కోసం రద్దు చేశారు.. 
ఆనాడు మండలిని ఒక మనిషి కోసం రద్దు చేశారు అధ్యక్షా. ఆ మనిషి సాక్షాత్తూ ఈనాడు అధినేత రామోజీరావు. ఆనాటి రాజకీయాల గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారందరికీ ఈ విషయం తెలుసు. ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా మండలినే రద్దు చేసిన పరిస్థితి. అటువంటి మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప సంపాదకీయాలు రాశారు. ఈరోజు కోట్లాది మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు రాజకీయ కోణంతో అడ్డుతగులుతున్నారు. అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలి రద్దు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా.  మండలిని కొనసాగిస్తే వచ్చే ఏడాది మా పార్టీకి మెజారిటీ వస్తుందని తెలిసినా ప్రజల అవసరాలు, ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మండలి రద్దు కోసం తీర్మానం చేస్తున్నాం.

ఆకర్ష్ అంటూ సిగ్గుమాలిన రాతలు.. 
ఆపరేషన్‌ ఆకర్ష్ అంటూ చంద్రబాబు పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాస్తున్నాయి. ఇంత దిగజారిన రాతలు చంద్రబాబు పత్రికల్లో చూస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్లంతా చంద్రబాబు హయాంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏ రోజైనా కనీసం నోరెత్తారా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోతే ఎల్లో మీడియా కనీసం నోరెత్తలేదు. మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే ఈనాడు, ‘చంద్ర’జ్యోతి, టీవీ 5 ఎందుకు ప్రశ్నించలేదు? నోరెత్తకపోగా చంద్రబాబు గొప్ప రాజనీతి చాణక్యుడని, ఆయన పరిపాలన చూసి ముగ్దులై ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటూ దిక్కుమాలిన కథనాలు రాశాయి. 

చర్చ జరగాలనే మూడు రోజులు టైం
మండలి రద్దు గురించే సభ పెడుతున్నామని గురువారం నాడే చెప్పాం. ప్రజలు చర్చించుకోవాలని సమయమిచ్చినా ఎమ్మెల్సీలను రూ. 5 కోట్లకు కొంటున్నామని టీడీపీ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. మేం సమయం ఇవ్వకుంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేసేవారు. విలువలు, విశ్వసనీయత లేని వారు ఎవరో, అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే నైజం ఎవరిదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో, మోదీ విషయంలో, కాంగ్రెస్‌ పార్టీ విషయంలో, బీజేపీ విషయంలో, మండలి విషయంలో చంద్రబాబు ఎన్నెన్ని యూటర్న్‌లు తీసుకున్నాడో గత ఐదేళ్లలో చాలా చూశాం. నిజంగా మాటలు ఎవరు మార్చారో ఒక్కసారి వీటిని చూస్తే తెలుస్తుంది (బాబు వివిధ సందర్భాల్లో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు). అవసరం తీరిన తరువాత ఎవరినైనా వెన్నుపోటు పొడవటానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి బాబు. 

చంద్రబాబు యూటర్నులు 
కాంగ్రెస్‌ పార్టీ గురించి ముందు.. 
- కాంగ్రెస్‌ పార్టీ ఓ పార్టీనా? చెత్త పార్టీ. ఇది సోనియాగాంధీ సామ్రాజ్యం కాదు. ఇది ఇటలీ కాదు ఇది ఇండియా 
- కాంగ్రెస్‌కు సహకరిస్తే వారిని ఏమనాలి...? ఆ పార్టీనే శాశ్వతంగా బాయ్‌కాట్‌  చేయాలి. అప్పుడు కూడా కసి తీరదు 
సోనియా, రాహుల్‌ ఇంతవరకు ఒక్క మాట అయినా విభజన గురించి మాట్లాడారా? మీకు చేతకాదా? మీరు నాయకులా? ఏమనుకుంటున్నారు మీ గురించి అని అడుగుతున్నా.  
ఆ మహాతల్లి (సోనియా)కి ఎక్కడ లేని డబ్బు పిచ్చి. డబ్బులు లేకపోతే ఆవిడకు నిద్ర పట్టదు.  సోనియా ఇటలీ నుంచి 
వచ్చింది. మన కష్టాలు తెలిసిన వ్యక్తా? కాదు.  
- కాంగ్రెస్‌ను ఎండగడతాం. ఈ దేశంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెడతా.  కాంగ్రెస్‌ పార్టీ  వెంటిలేటర్‌ మీదకు వెళ్లిపోయింది. ఆ వెంటిలేటర్‌ ఎప్పుడు తీసేస్తే అప్పుడు చనిపోతుంది.  
కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గమైన ఆలోచన చేస్తోంది. నీచమైన రాజకీయాలు చేస్తోంది.  æ సోనియాగాంధీ ఈ దేశానికి వచ్చి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఈ రోజు అభద్రతాభావంతో బతికే పరిస్థితి తీసుకువచ్చిందంటే చాలా దుర్మార్గం 
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీతో రాజీ పడలేదు. కాంగ్రెస్‌ పార్టీతో పోరాడాం. కాంగ్రెస్‌తో లాలూచీ పడే పరిస్థితి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఉండబోదు 
తరువాత 
- కాంగ్రెస్, మేమూ కలసి పనిచేస్తున్నాం. మా మధ్య సమస్య ఉండదు. మేము కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది.  
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసింది కాంగ్రెస్‌ పార్టీ. విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్‌పార్టీ. 90 శాతం డబ్బులు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్‌ పార్టీ.   
మోదీ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. కొత్త ప్రధాని వస్తారు.  
మేము కూర్చొని మాట్లాడుతున్నాం.  రాహుల్‌ను కూడా ఆయన పార్టీలో చర్చించమని కోరా. మేం ఓ ఉమ్మడి వేదిక మీదకు వస్తాం. కలసి ఎలా పనిచేయాలన్నది నిర్ణయిస్తాం. 
 
నరేంద్ర మోదీ గురించి ముందు..  
మోదీ సమర్థుడు. ఆయన ప్రధాని కాబోతున్నారు. ఎవరూ అడ్డుకోలేరు. నాదీ నరేంద్రమోదీదీ విన్‌విన్‌ కాంబినేషన్‌. 
అభివృద్ధి కోసం మోదీతో కలసి పనిచేయాలని భావిస్తున్నాను. 
స్వాతంత్య్రం వచ్చిన తరువాత చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు. కానీ భారతదేశం ప్రతిష్టను ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 
సమర్థుడైన మోదీ నాయకత్వంలో భారతదేశం త్వరలోనే సూపర్‌వపర్‌గా తయారవుతుంది.  
మోదీ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు.   
తరువాత... 
గురువుకు నామాలు పెట్టింది నరేంద్ర మోదీ. తల్లిని చూడలేదు. తల్లికి బిచ్చం పెట్టనివాడు దేశాన్ని ఉద్దరిస్తాడంట.  
నరేంద్రమోదీ కంటే మిగతా నాయకులంతా మెరుగైన వారే. 
- నరేంద్రమోదీ కరుడుగట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు.  
- నరేంద్ర మోదీకి ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు.  
- హుందాతనం ఏమైంది. పోలవరం ఈయన ఇచ్చాడంటాడు... ఈయన ఇచ్చేదేంటి పోలవరం. మన రాజధాని శంకుస్థాపనకు ఆయన్ని పిలిచాను. ఏం ఇచ్చారు...మట్టీ, నీళ్లు మన ముఖాన కొట్టాడు.  
మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ 

ప్రత్యేక హోదా గురించి ముందు ..
ప్రత్యేక హోదా ఇవ్వాలి ఐదేళ్లు ఇచ్చారు. నరేంద్రమోదీని కోరుతున్నా 15 ఏళ్లు ఇవ్వండి. ఐదేళ్లలో పరిశ్రమలు రావాలంటే రెండుమూడేళ్లవుతుంది. అది ప్రారంభమయ్యేలోగా ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే కనీసం 15ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నా.   
తరువాత 
- కావాలని కొందరు కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే అదేదో సంజీవని కింద అన్నీ అయిపోతాయని.  ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందండి?  రెండే వస్తాయి. ఒకటి ఈఏపీ... రెండు సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీములు. సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీములు తగ్గించేశారు. 62 శాతం నుంచి 52శాతానికి వచ్చింది.  ఇక ఈఏపీ ఏంటీ... కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు ఇస్తే ...మళ్లా వాళ్లు మంత్రిమండలిలో ఆమోదించాలి.  
నేను మొదట అడిగింది ప్రత్యేక హోదానే. కాదు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారన్నారనుకో. నేను కాదనను కదా. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?  
ప్రత్యేక హోదాతోనే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు , పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదేం... 
ఈ రోజు కేంద్రం ఇచ్చిందానికి అభినందిస్తూనే...వాళ్లు ఎంతిచ్చినా తీసుకోవడం...ముందుకు పోవడం తప్పా మనకు మరో మార్గం లేదు.  
మళ్లీ : ప్రత్యేక హోదా మినహా మనకు మరో మార్గం లేదు.  

చంద్రబాబూ ఈ ప్రశ్నలకు బదులేది? 
ఎస్సీ ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్‌ ఉండేది. వారి క్షేమాన్ని కాంక్షించి ఇప్పుడు వేర్వేరుగా కమిషన్లు తెచ్చాం. దీన్ని అడ్డుకోవడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? 
రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్‌ మీడియం చదువులు తేవడం  న్యాయమా.. అన్యాయమా? 
- ఏ అన్యాయం జరిగిందని ఆయన అమరావతి రైతులతో ఉద్యమాలు చేయిస్తున్నారు?  రైతులకు కౌలు (యాన్యుటి) 15 ఏళ్లకు పెంచడం అన్యాయమా? 
- రాజధానిలో భూమి లేని నిరుపేదలకు జీవనభృతి రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచడం అన్యాయమా? 
అసైన్డు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ప్లాట్లు ఇవ్వడం మేం చేసిన తప్పా?  
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగితే నేరమా? 
వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా మార్చాలనుకోవడం నేరమా?  
స్వాతంత్య్రానికి పూర్వం 1937నాటి శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనుకోవడం తప్పా?    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement